శివతాండవం చూసేందుకు ఆదిశేషుడు ఎత్తిన అవతారం - పతంజలి
భారతీయులు ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగశాస్త్రం. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ శాస్త్రపు విలువ పెరుగుతూనే ఉంది. ఆరోగ్యానికి అంతకు మించిన సాధన లేదని రుజువు చేస్తూనే ఉంది. అంతటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి గురించి మాత్రం పెద్దగా సమాచారం కనిపించదు. కానీ కొన్ని కథలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది ఇదిగో... శివుడు ఒకసారి దేవతలు, రుషులందరి సమక్షంలోనూ తాండవం చేశాడట. చూపరులందరినీ కట్టిపడేసిన ఆ తాండవం గురించి లోకమంతా గొప్పగా చెప్పుకోసాగింది. ఆ నృత్యాన్ని స్వయంగా వీక్షించిన విష్ణుమూర్తి సైతం శివతాండవం గురించి పదే పదే తల్చుకోసాగాడు. విష్ణుమూర్తిని మోస్తున్న ఆదిశేషునికి సైతం ఆ పొగడ్తలు చేరాయి. ఇంతమందిని అలరించిన తాండవాన్ని తాను చూడలేకపోయానే అని ఆదిశేషునిలో బాధ మొదలైంది. ఆ బాధ క్రమేపీ పెరిగి ఆయన మనసుని దహించివేసింది. ఎలాగైనా తాను కూడా శివతాండవాన్ని చూడాలని అనుకున్నాడు. కానీ అది మాటలు కాదు కదా! ఎప్పుడో కానీ సంభవించని సందర్భం అది.
ఆదిశేషుని మనసులోని దుగ్ధను గ్రహించిన విష్ణుమూర్తి- భూమిమీద జన్మించి, శివుని ధ్యానించి తన కోరికను తీర్చుకోమని సూచించాడు. అదే సమయంలో గోనిక అనే భక్తురాలు సంతానం కోసం భగవంతుని ప్రార్థిస్తోంది. ఒకరోజు ఆమె సూర్యునికి అర్ఘ్యం అందిస్తుండగా ఆ నీటిలో ఒక పాముపిల్ల రూపంలో అవతరించాడు ఆదిశేషుడు. అంజలి ఘటిస్తుండగా పతం (ఆకాశం) నుంచి వచ్చిపడ్డాడు కాబట్టి అతనికి ‘పతంజలి’ అన్న పేరు స్థిరపడిందంటారు.
పతంజలి పెరిగిపెద్దవాడయి సకలశాస్త్రాలనూ ఔపోసన పట్టేశాడు. చిదంబరంలో శివుని గురించి తపస్సు చేసుకుంటూనే వేదాధ్యయనాన్ని సాగించాడు. అదే సమయంలో చిదంబరంలో వ్యాఘ్రపాదుడు అనే మరో రుషి కూడా ఉండేవాడు. శివుని అర్చించేందుకు ఎంతటి శ్రమకైనా ఓర్చి పూలు సాధించేందుకు తనకు పులి పాదాలు కావాలని ఆ ముని కోరుకున్నాడట. అందుకనే ఆయనకు ఆ పేరు వచ్చింది. చిదంబరంలో ఉన్న ఆ ఇద్దరు రుషుల దీక్షకు మెచ్చి పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షమైనాడు. వారి కోసం ఆనందతాండవాన్ని నర్తించాడు. అక్కడే నటరాజ స్వామిగా వెలిశాడు.
చిదంబరంలో వ్యాఘ్రపాదుడు, పతంజలి స్వామివారిని పూజించారనేందుకు నమ్మికగా అక్కడి చిత్రాలలో స్వామివారిని పూజిస్తున్న ఇద్దరు రుషులూ కనిపిస్తారు. అసలు చిదంబరంలోని ఆలయాన్ని పతంజలి స్వయంగా నిర్మించారని కూడా కొందరంటారు. నిజానికి పతంజలి పేరుతో చాలా ప్రముఖ గ్రంథాలే కనిపిస్తాయి. ఇవన్నీ రాసినవారు వేర్వేరు వ్యక్తులనీ.... భారతీయ సాహిత్యంలో కనీసం ఒక ఐదుగురు పతంజలిలు ఉన్నారని కొందరంటారు. కానీ పతజంలి అన్నవాడు ఒక్కడే అని మరికొందరి నమ్మకం! పతంజలి జీవన కాలం గురించి కూడా ఇలాంటి సందిగ్ధతే ఉంది. క్రీ.పూ ఊదో శతాబ్ది వాడని కొందరంటే అంతకు కొన్ని వేల సంవత్సరాల మునుపువాడని మరికొందరి వాదన.
ఏది ఏమైనా అప్పటివరకూ జ్ఞానులకు మాత్రమే తెలిసిన యోగసూత్రాలను క్రోడీకరించి ప్రపంచానికి అందించడంలో పతంజలి అనే వ్యక్తి చేసిన కృషి అసాధారణం అని మాత్రం ఒప్పుకోక తప్పదు. ఇక పతంజలిని సగం పాము రూపంలో కొలవడంలోనూ ఒక ఆంతర్యం కనిపించకపోదు. మనలోని కుండలినిని సర్పంగా భావిస్తుంటారు. నిద్రాణంగా ఉన్న ఆ కుండలినిని జాగృతం చేయగలిగిన రోజున మోక్షం సాధ్యమన్నది యోగుల మాట. ఆ కుండలినీ శక్తిని సూచించేందుకు యోగశాస్త్రకారుడైన పతంజలికి సర్పరూపాన్ని అందించి ఉండవచ్చు.
0 Comments