GET MORE DETAILS

55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి - సిఎస్‌ కమిటీ ప్రతిపాదనలకు నో

 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి - సిఎస్‌ కమిటీ ప్రతిపాదనలకు నో



నేషనల్‌ పేస్కేల్‌ లేనప్పుడు సిపిసి ఎలా...?

సజ్జలతో భేటీలో ఉద్యోగ సంఘాల నేతలు.

నల్లబ్యాడ్జీలతో చర్చలకు హాజరు.

నేడు సిఎంతో సమావేశం!


పిఆర్‌సిపై సిఎస్‌ కమిటీ నివేదించిన అంశాలపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలను అధికారుల కమిటీ ఏకపక్షంగా రూపొందించిందని, 14.29 శాతం ఫిట్‌మెంట్‌ వల్ల ఒరిగేదేమీ లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలను వారితో చర్చించకుండా తయారు చేయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆ కమిటీ ప్రతిపాదనలు ఆమోదించడం లేదని స్పష్టం చేశారు. మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశానికి కూడా నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు. సమావేశం సందర్భంగా బ్యాడ్జీలు తీసేయాలని కోరినా ఉద్యోగులు అంగీకరించలేదు. నివేదికలో అంశాలపై చర్చించేందుకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీరాజ్‌శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇస్తున్నామనీ, 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినా ఇప్పుడు తీసుకుంటున్న వేతనం రూపాయి కూడా తగ్గబోదని సజ్జల చెప్పారు. అయితే, ఉద్యోగుల కోర్కెలు సమంజసం కాదని తాను అనలేనని, అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటారనీ తెలిపారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి ఉద్యోగ సంఘాలతో బుధవారంనాడు చర్చలు జరిపే అవకాశం ఉంది.

పిఆర్‌సిపై సిఎస్‌ కమిటీ ప్రతిపాదనలు సరికాదని, కనీసం 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఎపి జెఎసి, జెఎసి అమరావతి ఐక్య కార్యాచరణ సమితి నాయకులు సజ్జలకు స్పష్టం చేశారు. సిఎస్‌ ఇచ్చిన నివేదికలో అంశాలు ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయనీ పేర్కొన్నారు. సమావేశానికి ఎపిజెఎసి, జెఎసి అమరావతి ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు బండి శ్రీనివాసరావు, బప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటేరియట్‌ ఉద్యోగుల సంఘం నాయకులు కె.వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, యుటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎస్‌.ప్రసాదు, ఎపిటిఎఫ్‌ నాయకులు హృదయరాజుతోపాటు పలు సంఘాల నాయకులు హాజరయ్యారు. వారితో సజ్జల వేర్వేరుగా చర్చించి వారి అభిప్రాయాలు విన్నారు. సమావేశం అనంతరం బండి శ్రీనివాసరావు, బప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అంటే ఉద్యోగులను అవమానించడమేనని తెలిపారు. పిఆర్‌సిపై తుది నివేదికను తయారు చేసిన తరువాత ఉద్యోగ సంఘాలతో చర్చించకపోవడం బాధ కలిగించిందని తెలిపారు. ఉన్నతాధికారులు వారికి తోచిన విధంగా తయారు చేసిన నివేదికను సిఎస్‌ చదివి వినిపించారని అన్నారు. ప్రతిపాదిత అంశాలూ ఏకపక్షంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగులకు 55 శాతం ఫిట్‌మెంట్‌తో 11వ పిఆర్‌సిని ప్రకటించాలని కోరారు. పెరిగిన ధరలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల ఇబ్బందులనూ పరిశీలించాలని కోరారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పే కమిషన్‌ను అమలు చేస్తామని చెబుతున్నారని, రాష్ట్రంలో ఆ తరహా పేస్కేళ్లు లేనప్పుడు సిపిసి ఎలా అమలవుతుందని ప్రశ్నించారు. తమ డిమాండ్లను సిఎం పరిష్కరిస్తారని నమ్ముతున్నామన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ నివేదికలో అంశాలు సరిగా లేవని, కనీసం 34 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని సిఎంను కోరుతున్నట్లు తెలిపారు. బుధవారం జరిగే సమావేశంలో ఇదే అంశాన్ని సిఎం దృష్టికి తీసుకెళతామన్నారు. పిఆర్‌సిలో ఫిట్‌మెంట్‌ ఎప్పుడూ తక్కువే ప్రతిపాదిస్తారని, దాన్ని ప్రభుత్వ స్థాయిలో పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ ఉద్యోగుల ఇబ్బందులనూ దృష్టిలో పెట్టుకోవాలని ఆయన కోరారు.

55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి : యుటిఎఫ్‌

11వ పిఆర్‌సితోపాటు 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, అలా ప్రకటిస్తేనే ఉద్యమం కొనసాగించాలా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని యుటిఎఫ్‌ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు తెలిపారు. పిఆర్‌సి నివేదికను బయటపెట్టకుండా 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడం సరైన విధానం కాదని అన్నారు. ఇప్పటికైనా రిపోర్టులో ఉన్న అంశాలను బయటపెట్టి ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు తెలుసుకోవాలని కోరారు. ఫిట్‌మెంట్‌ ప్రకటించకుండా సలహాదారుల పేరుతో ఎన్ని చర్చలు జరిపినా అంగీకరించేది లేదని తెలిపారు.

సిపిఎస్‌ రద్దును సామాజిక న్యాయంగా చూడాలి : ఎపిటిఎఫ్‌

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సిపిఎస్‌) రద్దును సామాజిక న్యాయంగా చూడాలని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు, ప్రధాన కార్యదర్శి కె.కులశేఖర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ సర్వీసులో 30 నుంచి 39 ఏళ్లపాటు ఉండి, పదవీ విరమణ చేసిన తర్వాత రూ.700 నుంచి రూ.2 వేల వరకు పెన్షన్‌ తీసుకుని ఎలా జీవించాలని ప్రశ్నించారు. సిపిఎస్‌ను రద్దు చేస్తే ఎన్‌ఎస్‌డిఎల్‌ ఉన్న రూ.13 వేల కోట్లను రాష్ట్రానికి తెచ్చుకోవచ్చన్నారు.

Post a Comment

0 Comments