డిజిటల్ అభ్యసనంతో మెరుగైన భవిత : : నేడు ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం
కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవనశైలిని సులభతరం చేస్తోంది. డిజిటల్ విప్లవం పోనుపోను ఎన్నో ఆవిష్కరణలు, మరెన్నో అద్భుతాలకు నాంది పలకనుంది. భవిష్యత్తులో మానవుడి జీవన విధానం కంప్యూటర్లతోనే ముడివడి ఉందని గ్రహించిన ప్రముఖ ప్రైవేటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఎన్‌ఐఐటీ- 2001, డిసెంబరు రెండున ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులకు కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇచ్చింది. అప్పటి నుంచి ఏటా అదే రోజున ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆధునిక యుగంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో పాలన, సేవారంగాల్లో పారదర్శకత పెరిగింది. ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలు, చెల్లింపులు, రవాణా సౌకర్యాలు సులభతరమయ్యాయి. వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా ఎనలిటిక్స్ వంటివాటితో మానవ జీవనవిధానం మరింత సులభతరం కానుంది. విద్యార్థులకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించనున్న రంగాలుగానూ ఇవి నిలవనున్నాయి. ఈ తరుణంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరగాల్సిన అవసరముంది. ఇంట్లోని వయోజనులకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై పిల్లలే విస్తృతంగా అవగాహన కల్పించాలి. విద్యార్థులకు పాఠశాలస్థాయినుంచే కంప్యూటర్ విద్యను బోధించడం అత్యావశ్యకం. పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన నిరాశాజనకంగా ఉందని పలు నివేదికలు చాటుతున్నాయి.
రానున్న కాలంలో కుటుంబాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేది నేటి విద్యార్థులే. అటువంటి వారికి సాంకేతిక విద్యను అందించడంలో ప్రభుత్వాలు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా 2019-20 విద్యాసంవత్సరంలో మొత్తం 15.07 లక్షల పాఠశాలలు పనిచేయగా, వాటిలో దాదాపు 39శాతం బడుల్లోనే కంప్యూటర్లు ఉన్నాయని విద్యపై ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ (యూడైస్) ప్లస్ నివేదిక ఇటీవల వెల్లడించింది. వాటిలోనూ సుమారు 22శాతం పాఠశాలల్లోనే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 36శాతం పాఠశాలల్లోనే కంప్యూటర్లు ఉన్నాయి. వాటిలోనూ తెలంగాణలో దాదాపు 21శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 23శాతం బడుల్లోనే ఇంటర్‌నెట్ సదుపాయం కనిపిస్తుంది.
ఉపాధ్యాయులకు సాంకేతిక విద్యా నైపుణ్యాలు లేకపోవడం, డిజిటల్ ఉపకరణాలు కరవవడం విద్యార్థుల కంప్యూటర్ బోధనకు అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ కారణంగా విద్యార్థులకు కరోనా వేళ ఆన్‌లైన్ పాఠాలను బోధించలేకపోయామని 68శాతం ఉపాధ్యాయులు తెలిపారని భారత్ సహా 92 దేశాల్లో సర్వే చేసిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రెస్(ఓయూపీ) తెలిపింది. డిజిటల్ ఉపకరణాలపై అవగాహన లేక తమ పిల్లల ఆన్‌లైన్ తరగతులను పర్యవేక్షించలేకపోయామని 58శాతం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తెలిపారని వెల్లడించింది. ఇటువంటి పరిస్థితుల్లో పాఠశాల స్థాయిలో భావిభారత పౌరుల సాంకేతిక విద్యకు గట్టి పునాదులు ఎలా పడతాయో మన పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అయిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వయసు వారిలో దాదాపు ఏడు శాతానికి, 15-29 ఏళ్ల వయసు వారిలో 34శాతానికే డిజిటల్ అక్షరాస్యత ఉందని జాతీయ గణాంక కార్యాలయం 2017-18 అధ్యయనం తేల్చింది. గ్రామాల్లోని మహిళలకు ఏడు శాతం, పురుషులకు 12.6శాతం, పట్టణాల్లోని మహిళలకు 26.9శాతం, పురుషులకు 37.5శాతం మాత్రమే కంప్యూటర్ పరిజ్ఞానం ఉందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం సర్వేలో వెల్లడైంది. 60శాతానికిపైగా వృద్ధులు డిజిటల్ నిరక్షరాస్యులేనని హెల్పేజ్ ఇండియా సర్వేలో తేలింది. చదువులేని వారిలో కేవలం తొమ్మిది శాతం మాత్రమే ఇంటర్‌నెట్ వినియోగిస్తున్నారని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. వారిపై మరింతగా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. 2019 మార్చి వరకు ఆరు కోట్ల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చాలన్నది కేంద్ర ప్రభుత్వ జాతీయ డిజిటల్ అక్షరాస్యతా మిషన్ లక్ష్యం. 2019 డిసెంబరు 31 నాటికి దీని కింద 2.56 కోట్ల మంది మాత్రమే డిజిటల్ అక్షరాస్యులయ్యారు. డిజిటల్ అక్షరాస్యత సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించాలి. గడపగడపకూ ఇంటర్‌నెట్ సదుపాయాన్ని కల్పించాలన్న సంకల్పంతో కేంద్రం చేపట్టిన భారత్‌నెట్ పథకాన్ని త్వరితగతిన పరుగులెత్తించాలి. 90శాతానికిపైగా పాఠశాలలకు కంప్యూటర్లను అందజేసి విద్యార్థులకు సాంకేతిక విద్యను బోధించడంలో దిల్లీ, కేరళ రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాటి స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలూ పాఠశాలలకు కంప్యూటర్లు, ఇంటర్‌నెట్ సదుపాయాన్ని కల్పించి బోధకులను నియమించాలి. ఉపాధ్యాయులందరికీ డిజిటల్ బోధనపై శిక్షణ ఇవ్వాలి. ఆశా కార్యకర్తలు, యువకులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మహిళలు, వృద్ధులకు డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించడం మీద ప్రభుత్వాలు దృష్టిసారించాలి.
0 Comments