GET MORE DETAILS

వివాహ వయసు పెరిగిందిలా...

 వివాహ వయసు పెరిగిందిలా...



మహిళల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం త్వరలో సవరణ బిల్లును తీసుకురానుంది. మన దేశంలో యువతుల పెళ్లి వయసు నిర్ధరణకు సుదీర్ఘ చరిత్రే ఉంది. ఈ విషయంలో కాలానుగుణంగా అనేక మార్పులు జరిగాయి. వివిధ మతాల వారు తమ ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లకు అనుగుణంగా పెళ్లిళ్ల నిబంధనలను రూపొందించుకున్నారు. దేశంలో వివాహ చట్టాల పరిణామ క్రమం మాత్రం 1860లో ప్రారంభమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాల్య వివాహాల కట్టడి కోసం చట్టబద్ధమైన చర్యలు అవసరమయ్యాయి. ఈ క్రమంలో బాలికల పెళ్లి అర్హత వయసు మారుతూ వస్తోంది.

పదేళ్ల కన్నా తక్కువ వయసు బాలికలతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షా స్మృతి 1860లో వచ్చింది.

‘ది ఏజ్‌ ఆఫ్‌ కన్సెంట్‌ బిల్‌’-1891 ప్రకారం 12 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న బాలికను వివాహమాడితే...ఆ పెళ్లి చట్టప్రకారం చెల్లుబాటు కాదు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో తీసుకొచ్చిన ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. హిందువుల సంప్రదాయాలపై బ్రిటిషర్ల దాడిగా కొందరు నేతలు అభివర్ణించారు.

1929లో బాల్య వివాహాల కట్టడి చట్టం వచ్చింది. కనీస వివాహ వయసు బాలికలకు 14, బాలురకు 18 ఏళ్లు ఉండాలని పేర్కొంది.

శ్రారదా చట్టంగా పేర్కొంటున్న ఈ శాసనానికి 1949లో సవరణ చేసి బాలికల కనీస వివాహ వయసును 15 ఏళ్లకు పెంచారు.

1978లో ఇదే చట్టాన్ని మరోసారి సవరించి యువతుల కనీస పెళ్లి వయసు 18 ఏళ్లుగా, యువకుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా నిర్దేశించారు.

1955 హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 5(3) నిబంధన .. కనీస వివాహ వయసును వరుడికి 21 ఏళ్లు, వధువుకు 18 ఏళ్లుగా పేర్కొంది. అయితే, మైనర్‌ బాలిక అభ్యర్థన మేరకు పెళ్లిని రద్దు చేసినప్పటికీ బాల్య వివాహాన్ని చట్ట విరుద్ధంగా పేర్కొనలేదు.

ముస్లిం మతం ప్రకారం యుక్తవయసుకు వచ్చిన మైనర్‌ బాలికకు జరిగిన పెళ్లి చెల్లుబాటవుతుంది.

ప్రత్యేక వివాహ చట్టం-1954, బాల్య వివాహాల నిషేధ చట్టం-2006 ప్రకారం..యువతీ యువకులకు ఉండాల్సిన కనీస వివాహ వయసు వరుసగా 18, 21 ఏళ్లు. మైనర్‌ బాలికతో శృంగారాన్ని అత్యాచారంగా పరిగణిస్తారు. ఆ బాలిక ఆమోదంతో జరిగినప్పటికీ అది నేరమే.

వివిధ దేశాల్లో బాలికల కనీస వివాహ వయసులు...

* కనీస వయసును నిర్ధరించని దేశాలు : సౌదీ అరేబియా, యెమెన్‌

* 14 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నా అనుమతించేవి : ఇరాన్‌(13), లెబనాన్‌(9), సుడాన్‌(యుక్తవయసు)

* 15 ఏళ్లు, ఆపైన : చాద్‌, కువైట్‌(15), అఫ్గానిస్థాన్‌, బహ్రెయిన్‌, పాకిస్థాన్‌, కతార్‌, యూకే(16)

* 17 ఏళ్లు ఉంటేనే అనుమతించేవి : ఉత్తరకొరియా, సిరియా, ఉజ్బెకిస్థాన్‌

* 18 ఏళ్లు : అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా, నార్వే, స్వీడన్‌, యూఏఈ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, సింగపూర్‌, శ్రీలంక

* 19 ఏళ్లు : అల్జీరియా, దక్షిణ కొరియా

* 20 ఏళ్లు : చైనా, జపాన్‌, నేపాల్‌, థాయ్‌లాండ్‌

* 21 ఏళ్లు : ఇండోనేసియా, మలేసియా, నైజీరియా, ఫిలిప్పీన్స్

Post a Comment

0 Comments