ఏటీఎం/ డెబిట్ కార్డులను ఆన్‌లైన్‌లో ఎలా బ్లాక్ చేయాలి...?
బ్యాంకులు జారీచేసే డెబిట్ కార్డులు సాధారణంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు ఉపయోగిస్తున్నప్పటికీ ఆన్‌లైన్ లావాదేవీలకు కూడా ఇదే డెబిట్ కార్డును ఉపయోగించి ఏవైనా సరకులు కొనొచ్చు. అనేక సేవలకు ఇందులో నుంచి డబ్బు చెల్లించొచ్చు. వస్తువులను ఆన్‌లైన్‌లో బుక్ చేయవచ్చు. అయితే, ఈ కార్డు వేరే వారికి చిక్కినప్పుడు లేదా హ్యాకర్లు కార్డును హ్యాక్ చేసి అనధికారిక ఆన్‌లైన్ లావాదేవీలకు కూడా వీటిని ఉపయోగించొచ్చు. షాపింగ్ చేసి డెబిట్ కార్డును దుర్వినియోగం చేసే అవకాశం కూడా లేకపోలేదు. అనధికార, మోసపూరిత లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. అయితే వెంటనే డెబిట్ కార్డ్‌ను బ్లాక్ చేయడం ద్వారా తదుపరి జరగబోయే ఆర్థిక నష్టాన్ని ఆపొచ్చు. డెబిట్, ఏటీఎం కార్డులో ఏదైనా అనధికారిక లావాదేవీ మీ దృష్టికి వస్తే, కార్డు పొగొట్టుకున్న వెంటనే మొబైల్ యాప్ ద్వారా లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించడం ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కార్డును బ్లాక్ చేయమని బ్యాంక్‌కు మెసేజ్ పెట్టడం గానీ అభ్యర్థించడం గానీ చేయాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఏటీఎం/డెబిట్ కార్డ్‌ను బ్లాక్ చేయొచ్చు.*
ఎస్‌బీఐ ఏటీఎం/డెబిట్ కార్డు పోయినప్పుడు బ్లాక్ చేసే విధానం...
1. వినియోగదారుడి పేరు/ఐడీ, పాస్‌వర్డ్‌తో నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వండి.
2. ‘ఈ-సర్వీసెస్’ ట్యాబ్ కింద ఏటీఎం కార్డ్ సర్వీసెస్ - బ్లాక్ ఏటీఎం కార్డ్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
3. ఏటీఎం/డెబిట్ కార్డ్‌ను బ్లాక్ చేయాల్సిన ఖాతాను ఎంచుకోండి.
4. తర్వాత బ్లాక్ చేసే కార్డు నంబర్ మొదటి 4, చివరి 4 అంకెలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
5. బ్లాక్ చేయాల్సిన కార్డును ఎంచుకుని, వివరాలను ధ్రువీకరించిన తర్వాత సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
6. తర్వాత ప్రొఫైల్ పాస్‌వర్డ్ లేదా మెసేజ్ ద్వారా ఓటీపీ నమోదు చేసే మోడ్‌ను ఎంచుకోండి.
7. తదుపరి ఓటీపీ లేదా ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను నమోదు చేసి కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయండి.*
8. ఈ ప్రక్రియ అంతా విజయవంతంగా పూర్తయిన తర్వాత ఒక నంబర్ స్క్రీన్‌పై వస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం ఈ నంబర్‌ను నోట్ చేసుకోండి.
ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం/డెబిట్ కార్డును నెట్ బ్యాంకింగ్/ ఐ మొబైల్ ద్వారా బ్లాక్ చేసే విధానం...
1. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో బ్యాంక్ ఖాతాకు లాగిన్ అవ్వండి.
2. మై అకౌంట్స్ ఆప్షన్‌కి వెళ్లండి.
3. బ్యాంకు ఖాతాను ఎంచుకోండి.
4. సర్వీస్ రిక్వెస్ట్స్ ఆప్షన్ కింద ఏటీఎం/డెబిట్ కార్డు సంబంధిత సమస్య విషయాన్ని ఎంచుకోండి.
5. తర్వాత ఏటీఎం/డెబిట్ కార్డును బ్లాక్ చేయండి.
ఐసీఐసీఐ బ్యాంక్‌కు సంబంధించిన ఏటీఎం/డెబిట్ కార్డుని వినియోగదారుడు తాత్కాలికంగా బ్లాక్ చేయవచ్చు. ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత అన్‌బ్లాక్ చేయవచ్చు. కార్డును శాశ్వతంగా బ్లాక్ చేసినట్టయితే, ఖాతాదారునికి కొత్త డెబిట్ కార్డును బ్యాంక్ జారీ చేస్తుంది. శాశ్వతంగా బ్లాక్ చేసిన కార్డు ఇప్పటికీ కార్డుదారుని అధీనంలో ఉన్నట్లయితే, వారు బ్లాక్ చేసిన కార్డును కత్తిరించాలని బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
ఇదే విధంగా చాలా వరకు బ్యాంకులు ఇలా ఆన్‌లైన్‌లో కార్డు బ్లాక్ చేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి. మీ ఏటీఎం/డెబిట్ కార్డులో ఏదైనా అనధికారిక లావాదేవీని కనుగొన్నా లేక పోగొట్టుకున్నా వెంటనే మొబైల్ యాప్ ద్వారా లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించడం ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కార్డును బ్లాక్ చేయాలని బ్యాంక్‌కు అభ్యర్థనను పంపించడం ద్వారా కార్డు దుర్వినియోగాన్ని, నష్టాన్ని ఆపొచ్చు.
0 Comments