GET MORE DETAILS

విద్యతోనే దేశ పురోగతి సాధ్యం : ఎన్టీఆర్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్

 విద్యతోనే దేశ పురోగతి సాధ్యం : ఎన్టీఆర్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌




ఏ దేశ పురోగతి అయినా విద్యతోనే సాధ్యమని, చదువు పూర్తి చేసి వైద్య వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువ వైద్యులు సేవా భావంతో ముందుకు సాగి సమాజానికి తోడ్పాటు అందించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగింది. వర్సిటీ కులపతి హోదాలో రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్‌ వెబినార్‌ విధానంలో స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు, ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డికి రాజ్‌భవన్‌లో గవర్నర్‌, తమిళనాడు కోయంబత్తూర్‌లోని జెమ్‌ హాస్పిటల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సి.పళనివేలుకు స్నాతకోత్సవంలో వీసీ పి.శ్యామ్‌ప్రసాద్‌ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ... ‘ప్రస్తుతం కరోనా మహమ్మారితో ఎదురవుతున్న సవాళ్లతో వైద్య రంగం పోరాడుతోంది. కొత్తగా వైద్య వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువత నూతన ఆవిష్కరణలతో సమస్యలకు పరిష్కారం చూపాలి’ అని సూచించారు. రెండేళ్లకు కలిపి విద్యార్థులకు 107 బంగారు, 43 వెండి పతకాలను, మరో 42 మందికి నగదు పురస్కారాలు ఇచ్చారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ కె.శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి : సి.పళనివేలు

గౌరవ డాక్టరేట్‌ గ్రహీత సి.పళనివేలు మాట్లాడుతూ.. ‘కొవిడ్‌తో రెండేళ్లు కష్టంగా గడిచింది. మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నామని అనుకునేలోగా ఒమిక్రాన్‌ బెదిరిస్తోంది. సవాళ్లు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ... మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకుసాగాలి’ అని వివరించారు.

ప్రతి వైద్యుడి విజయానికి 10 అంశాలు : నాగేశ్వరరెడ్డి

తన తండ్రి భాస్కర్‌రెడ్డి ఇరవై ఏళ్ల క్రితం ఇదే ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారని, ఇప్పుడు తనకూ ఆ గౌరవం దక్కడం చాలా ఆనందంగా ఉందని డి.నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌లో మాట్లాడుతూ... ‘అందరితో వినయం, రోగులతో నిజాయతీగా ఉండడం, కష్టపడడం, కరుణ చూపడం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, నిరంతర అభ్యసన, తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం, తోటి వైద్యులతో మర్యాదగా వ్యవహరించడం, వృత్తిగత ఇబ్బందులు ఎదురైనప్పుడు నేర్పుగా పరిష్కరించడం, కొత్త అంశాలపై దృష్టిపెట్టడం... అనే పది అంశాలను అనుసరించే వైద్యులకు వృత్తిగతంగా గౌరవం దక్కుతుంది’ అని వివరించారు.

* ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్‌ ద్వారా జీవన సాఫల్య పురస్కారాన్ని పొందిన హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డిని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సత్కరించారు. గురువారం రాజ్‌భవన్‌కు వచ్చిన ఆయనకు జ్ఞాపికను బహుకరించారు. గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎండోస్కోపీ అంటే ఎంతో ఇష్టం : డి.నాగేశ్వరరెడ్డి

ప్రభుత్వ విభాగంలో గ్యాస్ట్రో ఎంటరాలజీకి సరైన ఆదరణ లేకపోవడంతోనే తాను ప్రైవేటు రంగంలోకి వెళ్లానని ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. తనకు ఎండోస్కోపీ అంటే ఎంతో ఇష్టమన్నారు. గురువారం సాయంత్రం విజయవాడ సూర్యారావుపేటలోని విమ్‌హాన్స్‌ ఆసుపత్రిలో ఇండ్ల రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, కర్నూలు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు, నాగేశ్వరరెడ్డి సహ విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘కర్నూలు వైద్యకళాశాల ప్రిన్సిపల్‌గా నా తండ్రి భాస్కర్‌రెడ్డి పనిచేశారు. అందుకే కర్నూలు అంటే నాకు బాగా ఇష్టం. అప్పట్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో రాష్ట్రం మొత్తంగా అయిదారుగురం నిపుణులమే ఉండేవాళ్లం. ఒకే ఎండోస్కోపీ యంత్రంలో అందరం పని చేసేవాళ్లం. ఒకసారి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ సతీమణి తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా నేను అర్ధరాత్రి బెంగళూరు వెళ్లి చికిత్స అందించా. ఉదయం ఆరు గంటలకల్లా ఆమె కోలుకుని అల్పాహారం తీసుకున్నారు. ఇది చూసిన ఎస్‌ఎం కృష్ణ..., బెంగళూరులో అత్యాధునిక ఆసుపత్రి ఏర్పాటు చేయిస్తానని, అక్కడే స్థిరపడాలని కోరినా.. నేను తెలుగు రాష్ట్రాలపై మక్కువతో హైదరాబాద్‌లో ఉన్నాను. ఎస్‌ఎం కృష్ణ సహకారంతో హైదరాబాద్‌లోనే ఆసుపత్రి నిర్మించుకున్నా’ అని వివరించారు.

Post a Comment

0 Comments