GET MORE DETAILS

ఇలా చేస్తే కొలువు మీదే...

 ఇలా చేస్తే కొలువు మీదే...కొవిడ్‌ కాలం. చాలామంది కొలువులు ఊడిపోయాయి. అయినా బేఫికర్‌. కష్టకాలంలోనూ ఠక్కున వచ్చే ఉద్యోగాలెన్నో! కాకపోతే మీకు ఉండాల్సింది- సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు. చిన్నాచితకా కంపెనీలు మొదలు బహుళజాతి కంపెనీల ప్రతినిధుల వరకూ చెబుతున్నదిదే.

ప్రైవేటు రంగంలో, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌, ఈ-కామర్స్‌ రంగాల్లో అవకాశాలు కోకొల్లలు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్‌ ఉన్న కొలువుల్లో కృత్రిమమేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ప్రథమస్థానంలో ఉంది. 2025 నాటికి ఇప్పుడున్న ఉద్యోగాల్లో 8.50 కోట్లు కనుమరుగైనా.. సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్‌, వర్చువల్‌ రియాలిటీ, బిజినెస్‌ అనలిటిక్స్‌ రంగాల్లో కొత్తగా 9.70 కోట్ల కొలువులు పుట్టుకొస్తాయి. ఈ స్కిల్స్‌ ఉంటే కొలువు ఖాయమైనట్టే.

సమస్యల్ని పరిష్కరించే నేర్పుండాలి :

ఏ సంస్థయినా అభ్యర్థుల్లో సమస్యల్ని పరిష్కరించే నేర్పు, ప్రతిభ చూస్తుంది. విద్యార్హతలతో పాటు మంచి ప్రవర్తన, నైపుణ్యాలుంటే అడ్డేముంది?

-వెంకట్‌ కాంచనపల్లి,సీఈవో, సన్‌టెక్‌ ప్లేస్‌మెంట్‌

అదనపు అర్హతలు సంపాదించాలి :

కొత్త సాంకేతికతల్ని, నైపుణ్యాలను ఆకళింపు చేసుకునేవారినే అవకాశాలు తడతాయి. ఇందుకు ఇన్‌స్టిట్యూట్లకే వెళ్లక్కర్లేదు. ప్రపంచప్రసిద్ధ స్టాన్‌ఫర్డ్‌, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ యూనివర్సిటీలు, ఐఐటీల భాగస్వామ్యంతో... కోర్సెరా, ఎడెక్స్‌, మూక్స్‌, స్కిల్‌షేర్‌, మాస్టర్‌క్లాస్‌, ఉడాసిటీ, ప్లూరల్‌సైట్‌ వంటి వేదికలు అందించే ఆన్‌లైన్‌ కోర్సులను పూర్తిచేసి ప్రొఫైల్‌కు బలం చేకూర్చుకోవచ్చు. ఆదిలాబాద్‌లో ఉన్నా, ఆమదాలవలసలో ఉన్నా, ఇంట్లోంచే పాఠాలు వినొచ్చు. కొన్ని కోర్సులు ఉచితం. మరికొన్నింటికి తక్కువ ఫీజులే.

బట్టీ వద్దే వద్దు :

అన్ని రంగాల్లో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి టెక్నాలజీలపై అవగాహన ఉన్నవారిదే పైచేయి. బట్టీ విధానాన్ని విడిచిపెట్టి, క్రిటికల్‌ థింకింగ్‌ పెంచుకుంటేనే ఇది సాధ్యమవుతుంది.

- బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, సైయెంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌

ఇవీ ఉండాల్సినవి...

సామాజిక నైపుణ్యాలు :

* మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యం ఉండాలి. విషయాన్ని ఇతరులకు అర్థమయ్యేలా వివరించగలగాలి. ఇతరులు చెప్పేది గ్రహించగలగాలి.

* బృందంతో కలిసి పనిచేయాలి.

*సానుకూల దృక్పథం, సరైన ప్రవర్తన తప్పనిసరి.

* ఏ ప్రాంతానికైనా, ఏ దేశానికైనా వెళ్లి పనిచేసేందుకు సిద్ధపడాలి.

సాంకేతిక నైపుణ్యాలు :

* సంస్థలు ఎక్కువగా అడిగే సాంకేతిక పరిజ్ఞానాలపై పట్టుండాలి.

* విండోస్‌, లైనక్స్‌, మ్యాక్‌, ఉబుంటు వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ తెలుసుండాలి

*కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ భాషలపై పట్టు

* కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, వాటిపై పట్టు సాధించాలి

* డేటా అనాలసిస్‌, టెక్నికల్‌ రైటింగ్‌ టెక్నిక్స్‌ తెలిస్తే మేలు


మనం వెనక్కి వెళ్లి ఆరంభాన్ని మార్చలేం. కానీ, ఉన్నచోటు నుంచే సరికొత్తగా ఆరంభించగలం.

- సి.ఎస్‌.లూయిస్‌

మనం ఏదైనా గొప్ప పనిచేయడానికి సరైన మార్గం... ముందుగా దాన్ని ప్రేమించడం.

- స్టీవ్‌ జాబ్స్‌

మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే అది మీకు చికాకు పుట్టించదు. మీరు చేయగల వాటికి పరిమితుల్లేవు.

- డాక్టర్‌ స్యూస్‌

Post a Comment

0 Comments