లింగార్చన
శివలింగం శివశక్తుల సమ్మేళనం. ఎల్లప్పుడూ ప్రచండమైన ఊర్థస్సు వెలువడుతూ ఉంటుంది. అటువంటి ఊర్థస్సును తట్టుకునే శక్తి సామాన్యులకు ఉండదు కనుకనే శివ లింగానికి తమాము జలధారలతో అభిషేకాలు జరుపుతారు. ఈ జలధారలనుండి వెలువడే సూక్ష్మమైన ఓంకారమే నిర్గుణ బ్రహ్మముగా చెప్పబడుతుంది. ఈ విధమైన మంత్రపూర్వక ధారాభిషేకము భక్తియుక్తులతో జరపడం వలన జీవుడు నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలడు.
శిలా నిర్మితమైన శివలింగాలు మాత్రమే కాక మానవ శ్రేయస్సుకొరకు సమాజ శ్రేయస్సుకొరకు నిర్మించి ఎంతో శుభదాయకమైన మరెన్నో శివలింగాలు మన పురాణాలలో తెలియపరచబడినవి. వాటిలో అతి ముఖ్యమైనవి మరియు మానవ కళ్యాణం కొరకు ఉపయోగపడేవి 30 శివలింగాలు. వాటి నిర్మాణ వివరాలు మరియు వివిధ రూపాల్లో ఉన్న ఆ శివలింగాలను పూజించడం వల్ల మనకు కలిగే లాభాలను చూద్దాం.
1. గంధ లింగం: రెండు భాగాలూ కస్తూరి, నాల్గు భాగాలూ గంధం మరియు మూడు భాగాలు కుంకుమతో చేసే ఈ గంధ లింగాన్ని పూజించడం వలన శివసాయిజ్యం ప్రాప్తిస్తుంది.
2. పుష్ప లింగం: అనేక రకాలైన సుగంధ భరితమైన పుష్పాలతో నిర్మింపబడి ఈ పుష్పాలింగ ఆరాధనా వలన రాజ్యాధిపత్యం కలుగుతుంది
3. నవనీతలింగం: వెన్న తో తయారుచేయబడే ఈ నవనీత లింగార్చన వలన కీర్తి మరియు సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది
4. రజోమయ లింగం: పుష్పముల పుప్పొడితో తయారుచేయబడే ఈ రజోమయలింగాన్ని అర్చించడం వలన మంచి విద్యాధరులు కాగలరు. శివసాయుజ్యం పొందగలరు.
5. ధాన్య లింగం: యవలు, గోధుమలు, వరి పిండి తో నిర్మింపబడి ఈ ధాన్య లింగార్చన వలన సకల సంపదలు వృద్ధి చెందడమే కాక సంతాన వృద్ధి కూడా కలుగుతుంది
6. తిలిపిష్టోత్థలింగం: నూగుపిండి (నువ్వుల పిండి) తో చేసిన ఈ లింగార్చన వలన అభీష్ట సిద్ధి కలుగుతుంది.
7. లవణ లింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి కలుగుతుంది.
8. కర్పూరరాజ లింగం: ఈ కర్పూర రాజ లింగార్చన వలన ముక్తి కలుగునని నమ్మకం.
9. భస్మ మయ లింగం: భస్మం తో తయారుచేయబడే ఈ భస్మ మయ లింగార్చన వలన సర్వ సిద్ధులూ లభిస్తాయి
10. శర్కరామయ లింగం: పంచదార పలుకులతో తయారుచేయబడే ఈ లింగార్చన వలన సుఖప్రాప్తి కలుగును
11. సద్భోత్థ లింగం: ఈ లింగార్చన ప్రీతిని కలిగిస్తుంది
12. పాలరాతి లింగం: పాలరాతితో తయారుచేయబడే ఈ లింగార్చన వలన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది
13. వంశాంకురమయ లింగం: వెదురు మొలకలతో తయారుచేసే ఈ వంశాంకురమయ లింగార్చన చేయడం వలన వంశవృద్ధి కలుగుతుంది
14. కేశాస్తి లింగం: వెంట్రుకలు (కేశములు) మరియు ఎముకలతో తయారుచేయబడే ఈ లింగార్చన శత్రునాశనం చేస్తుంది
15. పిష్టమయ లింగం: విద్యాప్రాప్తి కొరకు పిండి తో తయారుచేయబడే పిష్టమయ లింగార్చన చేస్తారు
16. దధిదుగ్ధ లింగం: ఈ లింగార్చన కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేస్తుంది
17. ఫాలోత్థలింగం: ఈ లింగార్చన ఎంతో ఫలప్రదమైనది
18. ధాత్రి ఫలజాత లింగం: ధాత్రిఫలజాత లింగార్చన ముక్తిని ప్రసాదిస్తుంది
19. గోమయలింగం: కపిల గోవు నుండి లభ్యమైన గోమయముతో ఈ లింగాన్ని తయారుచేస్తారు. మట్టిలో పడకుండా పట్టి, తయారుచేయడానికి వాడతారు. గోమయలింగార్చన వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది
20. దూర్వాకాండజలింగం: గరిక తో తయారుచేయబడిన ఈ లింగార్చన వలన అపమృత్యుభయం తొలగుతుంది.
21. వైడూర్య లింగం: వైఢూర్యాలతో తయారుచేయబడే ఈ లింగార్చన శత్రునాశనానికి, దృష్టిదోషం హరించడానికి సహకరిస్తుంది
22. ముక్తాలింగం: ముత్యాలతో చేయబడే ఈ లింగార్చనవలన ఇష్టసిద్ధి కలుగుతుంది
23. సువర్ణనిర్మిత లింగం: బంగారం తో తయారుచేసే ఈ లింగార్చన ముక్తి ప్రదాత
24. రజత లింగం: వెండి తో చేయబడే ఈ రజతలింగార్చన సంపదలను కలిగిస్తుంది
25. ఇత్తడి – కంచు: కాంస్యం తో తయారుచేయబడిన ఈ లింగార్చన ముక్తి ప్రసాదించును
26. ఇనుము – సీసము లింగం : ఈ లింగార్చన శత్రునాశనాన్ని కలిగిస్తుంది
27. అష్టధాతులింగం: ఈ అష్టధాతులింగార్చన చర్మ రోగాలను నివారించును. సర్వ సిద్ధులను కలిగిస్తుంది
28. తుసశోత్త లింగం: ఈ లింగాన్ని మారణ క్రియకు పూజిస్తారు
29. స్పటిక లింగం: సర్వ సిద్ధికరం, కార్య జయం కొరకు స్పటిక లింగార్చన చేస్తారు
30. శీతాఖండ లింగం: పటికబెల్లం తో తయారుచేసే ఈ లింగార్చన ఆరోగ్య సిద్ధిని కలుగజేస్తుంది
పైన పేర్కొన్నవే కాక ఇంకా ఎన్నో రకాల శివలింగాలు ఉన్నాయి. మన పురాణ ప్రకారము వర్ణ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యతను అనుసరించి ఏ ఏ వర్ణాలవారు ఏ లింగాన్ని అర్చించాలి అనే విషయాల వివరణ దొరుకుతుంది. ఈ వివరాలననుసరించి బ్రాహ్మణుల రస లింగాన్ని, క్షత్రియులు బాణ లింగాన్ని, వైశ్యులు స్వర్ణ లింగాన్ని మరియు ఇతరులు శిలాలింగాన్ని అర్చించాలి.
సృష్టి స్థితి లయ కారకుడైన త్రిమూర్తులలో మహేశ్వరుడు లయకారకుడు. అందువలన ఆయన ఎంతో సాత్విక స్వభావం కలవాడని చెప్తారు. ఈ సాత్విక స్వభావం కారణం వలననే మహేశ్వరుడికి భోళా శంకరుడని పేరు. శివుడు అనుగ్రహిస్తే ఎంత కరుణిస్తాడో ఆగ్రహిస్తే అంత ప్రళయ కారకుడు. మిక్కిలి భక్తి యుక్తులతో కొలిస్తే శివుడు వెంటనే కరుణించి వరాలను అనుగ్రహిస్తాడు కనుకనే శివుడిని భక్త సులభుడని కూడా అంటారు.
పరమేశ్వరానుగ్రహాన్ని పొందడానికి శివ రాత్రిని మించిన పర్వ దినం మరొకటి లేదు. శివరాత్రినాడు హిందువులందరూ మహేశ్వరుని ఎంతో నిష్ఠతో శ్రద్ధాభక్తులతో పూజించి ప్రార్ధిస్తారు.
శివుడిని చూసినా తలచుకున్నా లేదా ఆయన నివాస స్థలమైన మరుభూమిని చూసినా మనకు వైరాగ్యభావం కలుగుతుంది. శివుని ప్రసన్నం చేసుకోవడానికి అనేకరకాలైన భక్ష్య భోజ్యాలను నివేదించవలిసిన అవసరం లేదు. శివుడు అభిషేక ప్రియుడు. అందువలన శివునిపై మనసు లగ్నం చేసి అభిషేకం చేసినందువలన ఆ భక్త సులభుడు తేలికగా అనుగ్రహిస్తాడు.
లయకారకుడైన శివుడు కేవలం లయాన్ని చెయ్యడమే కాక భక్త జన సంరక్షణకు లోక కళ్యాణం కొరకు ఎటువంటి అవతారాన్నైనా దాల్చగలడు. సాగర మధనం లో పుట్టిన హాలాహలాన్ని తన గరళంలో దాచుకుని గరళకంఠుడైనాడు. అదే విధంగా గంగావతరణం లో గంగను తన జటాజూటమందు బంధించి గంగాధరుడయ్యాడు. అటువంటి భక్త సులభుడైన శివుని మనస్ఫూర్తిగా పూజించి ఆ పరమేశ్వర కృపకు పాత్రులమవడం శుభకరం శ్రేయస్కరం.
ఓం నమః శివాయ.
0 Comments