GET MORE DETAILS

సినీ పాటల రచయిత "కందికొండ" ఇకలేరు

సినీ పాటల రచయిత "కందికొండ" ఇకలేరు



“మళ్ళీ కూయవే గువ్వా.మోగిన అందెలమువ్వ. తుళ్ళి పాడవే పువ్వా. గుండెల సవ్వడి మువ్వా.” – ఈ పాట అప్పట్లో కుర్ర కారు గుండెలను మీటింది.

పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ లోని ఈ పాటతోనే గీత రచయిత కందికొండ యాదగిరి చిత్రసీమకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే తన కవితాశోభను జనానికి పరిచయం చేయగలిగారు కందికొండ. దర్శకుడు పూరి, సంగీత దర్శకుడు చక్రి సైతం ఆయనలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ అదే చిత్రంలో “నీకోసం వేచి వేచి చూసిన వైనం.” అనే పాటనూ రాసే అవకాశం కల్పించారు. అక్కడ నుంచీ తనదైన బాణీ పలికిస్తూ కందికొండ యాదగిరి తన పాటల పల్లకిలో ప్రేక్షకులను ఊరేగించారు.

పాటే లోకం...!

కందికొండ యాదగిరి 1973 అక్టోబర్ 13న వరంగల్ జిల్లా నాగుర్లపల్లిలో జన్మించారు. తెలంగాణ జానపదాలు పాడుకుంటూ, పాటలపై మక్కువ పెంచుకున్నారు కందికొండ. మాతృభాష తెలుగుపై విపరీతమైన అభిమానం పెంచుకొని, తెలుగు సాహిత్యంలోని పలు ప్రయోగాలను అధ్యయనం చేస్తూ పయనించారు. ఉస్మానియా యూనివర్సిటీలో చేరి, “సిట్యుయేషనల్ సాంగ్స్ ఫ్రమ్ తెలుగు సినిమా” (తెలుగు సినిమాల్లోని సందర్భోచిత గీతాలు) అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచే వచ్చిన సంగీత దర్శకుడు చక్రితో కందికొండ చదువుకొనే రోజుల్లోనే పరిచయం ఏర్పరచుకొన్నారు. అప్పట్లోనే కందికొండ తన ప్రాంతంపై అభిమానంతో అనేక పాటలు రాశారు. తమ ప్రాంతంలోని మట్టి మనుషుల వెతలను కళ్ళకు కట్టినట్టుగా కథలు రాశారు. కథలు, కవితలతో సాగిన కందికొండ చక్రి ప్రోత్సాహంతో చిత్రసీమలో గీత రచయితగానూ తనదైన బాణీ పలికించారు. చక్రి స్వరకల్పనలోనే కందికొండ పలు సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. అలాగే కందికొండను దర్శకుడు పూరి జగన్నాథ్ సైతం విశేషంగా ప్రోత్సహించారనే చెప్పాలి.

పరవశింపచేసిన తీరు :

'ఇడియట్’లో కందికొండ కలం పలికించిన “చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే.” పాట అప్పట్లో కుర్రాళ్ళ నోళ్ళలో నాట్యం చేసింది. ‘పోకిరి’లోని “గల గల పారుతున్న గోదారిలా.” గీతం యువతను భలేగా ఆకట్టుకుంది. అందులోని “జగడమే.” పాట యూత్ ను కట్టి పడేసింది. ఈ నాటికీ పోటీతత్వం పొడసూపిన ప్రతిసారీ ఆ గీతాన్ని మీడియా జనం విశేషంగా ఉపయోగించుకుంటున్నారు. “నీలి నీలి ముత్యమల్లె.” (ఆడుతూ పాడుతూ), “చెన్నై చంద్రమా.” (అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి), “రామా.రామా. నీలి మేఘశ్యామా.” (శివమణి), “మధురమే మధురమే.” (సత్యం), “అక్కడ్ బక్కడ్.”(సూపర్), “ఓ మేఘమాలా.”(సదా మీ సేవలో), “ఐ వన్నా స్పైడర్ మేన్.” (స్టాలిన్), “చినుకులాగా.” (అల్లరి పిడుగు), “నిన్నే నిన్నే.” (దేశముదురు), “మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా.” (మున్నా), “గుండె గోదారిలా.” (మస్కా), “వన్ మోర్ టైమ్.” (టెంపర్) – వంటి కందికొండ పాటలు జనం మదిలో నిలచిపోయాయి. ఆయన కలం నుండి చివరగా జాలువారిన గీతం ఈ మధ్యే శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘కోతలరాయుడు’లోని “ఓ తలపై.” అంటూ సాగుతుంది.

వందలాది పాటలను పలికించిన కందికొండ తెలుగు చిత్రసీమ పాటల పర్వంలో తనకంటూ ఓ స్థానం సంపాదించారు. పసందైన పాటలు పలికిస్తూ సాగుతున్న తరుణంలో కందికొండను కేన్సర్ మహమ్మారి పట్టుకుంది. ఆయన సన్నిహితులు, ప్రభుత్వం తగిన సాయం అందించినా, చివరకు కందికొండ మార్చి 12న తుదిశ్వాస విడిచారు. ‘మళ్ళి కూయవే గువ్వా.’ అంటూ చిత్రసీమలో ప్రవేశించిన కందికొండ పాటను ప్రేమించిన వారందరూ ఆయన ఇక లేరన్న వార్త తెలిసి శోకంలో మునిగారు. ఈ పాటల గువ్వ మళ్ళీ కూయాలనే అందరూ అభిలషించారు. కానీ, ఇప్పటికే మధురం పంచిన కందికొండ కలం అభిమానుల గుండెల సవ్వడిలో ఓ మువ్వలా ఒదిగిపోయింది. ఆయన పాట గుర్తుకు వచ్చిన ప్రతీసారి ఆ మువ్వ మోగుతుంది. మళ్ళీ గువ్వ కూస్తుంది!

Post a Comment

0 Comments