GET MORE DETAILS

తెలుగు భాష

 తెలుగు భాష



తెలుగు మాట్లాడ వెరతురు ! తెలుగు వారు

తెలుగు వారము మన మని!తలప రేల

తేనెలూరెడి మనభాష ! తెలుగు భాష

పలుకు పలుకున తేనెలు! చిలుకు ననుచు


పలుకుటేగాని నోరార ! పలుక రైరి

ఆంగ్ల భాషన్న వ్యామోహ ! మయ్యె నేడు

ఆంగ్ల మైనను వచ్చునా !యనిన సున్న

చక్కగ పలుకుటేరాదు ! నిక్కముగను


అతుకు లతికిన మాటలు ! వెతుకు కొనుచు

గతుకు గతుకుల బాటపై ! వెతలు పడుచు

వాహనములు నడిపి నట్లు ! పలుకు టేల

పలుక కున్నను దక్కును ! పరువు గను

మిన్నకుండిన గౌరవ ! మన్న మిగులు


అన్ని భాషలు నేర్వగ ! నడ్డు లేదు

కాదనెడి హక్కెవరికైన ! లేనె లేదు

ఆంగ్లమెరిగిన వారితో ! నాంగ్ల మందు

మాటలాడుటెవరికైన! మంచిదయ్య


ఆంగ్లమేరాని మనతెలు ! గయ్యలెదుట

మాటలాడుట తగదయ్య ! మాను టొప్పు

అమెరికావెళ్ళి పెండ్లాడి ! యచటనున్న

కన్న తల్లిని మరతురా ! కఠినులైన


మాతృభాషయు నట్టిదే ! మాన్యులార

మాతృభాషను కలనైన ! మరువకండి

మరువకండి మరువ కండి ! మాతృభాష

ఉగ్గు పాలతో నేర్చిన ! ఉచిత భాష


అమ్మ ప్రేమతో నేర్పిన ! అమృత భాష

సుధలు కురిపించు మదిలోన ! మధురభాష

పండితులు పామరులు గూడ ! పలుకు భాష

జుంటి తేనియ కన్నను !.జున్ను కన్న


పాల మీగడ కన్నను ! పాలకన్న

పటికబెల్లము కన్నను ! పంచ దార

కన్న తెలుగు మాధర్యమే ! మిన్నయౌర

పద్య రచనలో వెలిగెడి ! ప్రధమ భాష


చెలగి యవధాన విద్యలో ! వెలుగు లీను

తెలుగు భాషొక్కటే దీని ! తీరు వేరు

ద్వంద్వ నానార్ధ నర్మగ ! ర్భముల నొప్పు

ముచ్చటైన తెలుగు భాష ! ముద్దు లొలుకు


మదిని పులకింప జేసెడి ! మధుర భాష

కృష్ణరాయలు పోషించి ! కీర్తి గాంచె

బ్రౌనుదొర బ్రహ్మ రధమును ! పట్టుటన్న

తెలుగు జాతికి గొప్పని !.తెలుసు కొనుడు


తెలుగు భాషామ తల్లికి !వెలుగు నింప

తెలుగు ఖ్యాతిని పెంచాలి ! తెలుగు వారు

పెంచువారలు మీరేల ! త్రుంచు వారు

కారు కారాదు కలనైన ! పౌరులార!


తెలుగు మృతభాష కారాదు! వెలుగు లుడిగి

తెలుగు తల్లికి జైజైలు! పలుక వలెను

దిక్కులన్నిపిక్కటిలగ! నొక్క మారు

కోరు చున్నాడు బెజ్జంకి! కోర్కె మీర

Post a Comment

0 Comments