GET MORE DETAILS

చెఱువు అంటే ఏమిటి ? ఎలా నిర్మించాలి ?

 చెఱువు అంటే ఏమిటి ? ఎలా నిర్మించాలి ?జి.బి.విశ్వనాథ.

9441245857. 

అనంతపురము.

చెఱువు నిర్మాణం సప్తసంతానాలలో ఒక్కటిగా మన పూర్వీకులు, పాలకులు పెర్కొనడం జరిగింది. చెఱువు నిర్మాణం పుణ్యకార్యముగా కూడా భావించడం జరిగింది. అప్పటి పాలకులైన రాజులు, రాణులు,దండనాయకులు, అమరనాయకులు, మహామండలేశ్వరులు, మండలేశ్వరులు, రాచకార్యకర్తలు, గ్రామాధికారులు, వర్తకులు, సామంతులు ఎన్నో చెఱువులను  నిర్మించి గ్రామాభివృద్ధికి వ్యవసాయాభివృద్ధికి ఆర్థికాభివృద్ధికి దోహదం చేశారు.ముఖ్యంగా దక్షిణభారతదేశములోనే విజయనగర ప్రభువులకాలములో అనేకానేక చెఱువులను నిర్మించడం జరిగింది. దేశంలోనే తమిళనాడులో చెఱువులు ఎక్కువగా వున్నాయి.అటుతరువాత కర్ణాటకాంధ్రరాష్ట్రాలు తరువాతి స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.

అలాంటి చెఱువు నిర్మాణం గురించి తెలిపేశాసనము నకలు ఒక్కటి  ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాఖలోని ఎపిగ్రఫి( శాసనపరిశోధన ) నందు నిష్ణాతుడైన డా॥ కే.మునిరత్నమురెడ్డిగారి దృష్టికి రావడం జరిగింది. ఆ శాసనవివరాలను డా॥ రెడ్డిగారు ఇలా వివరిస్తున్నారు.

నెల్లూరు జిల్లా పొదలకూరు దగ్గరలోని మరపూరు నందు దొరికిన రాతిఫలకంలోని శాసనాన్ని చదివి ఇది శాలివాహనశకము 1560 అనగా 24 .3.1638  ACE కి చెందిన శాసనపాఠము తెలుగులో వుందని,  ఆ సమయములో వెలుగోటి సంస్థానానికి రాజైన వెంకటపతి ఈ 

చెఱువును నిర్మించి, నిర్వహణకోసం వరిపంటలో కొంత భాగాన్ని రైతులవద్దనుండి వసూలు చేయాలని గ్రామకరణాన్ని ఆదేశించినట్లుగా ఈ శాసనం తెలియచేస్తోందని డా॥కే.మునిరత్నంరెడ్డి తెలియచేశారు.

చెఱువులు నిర్మించడానికి ఈ రోజులలో మంచి సాంకేతికత వుంది, అయినా మనపాలకులు చెఱువులను నిర్మించడంలేదు, పైగా ప్రజలు పూర్వీకులు కట్టించిన ఈ చెఱువులను యధేచ్చగా ఆక్రమించి అమ్ముకొని వాటిని కనుమరుగుచేస్తున్నారు. 

చెఱువును ఎలా నిర్మించాలో తెలిపే శాసనము  పోరుమామిళ్ళ చెఱువుపైనుంది. ఆ శాసనాన్ని వేయించినవాడు భాస్కరభవదుర. ఈయన ఉదయగిరిని కేంద్రంగా పాలిస్తున్న యువరాజప్రతినిధి.  భాస్కరభవదుర గురించి చాలామంది చరిత్రప్రియులకు కూడా తెలియదు. ఇంతకు ఈ భాస్కరభవదుర ఎవరో చూద్దామా!

విజయనగరసామ్రాజ్య నిర్మాతలైన హరిహరబుక్కరాయలలో హరిహరుని మరణాంతరము మొదటి బుక్కరాయలు 1356లో పట్టాభిషక్తుడై 1377 వరకు పాలించాడు.ఇతనికి ఏడుగురు కొడుకులుండేవారు. వారెవరంటే (1) హరిహరరాయలు (2) కంపరాయలు ఇతనే కుమారకంపరాయలుగా ప్రసిద్ధి, మధురలో తురుష్కపాలకుల ఆగడాలను అకృత్యాలను తట్టుకోలేక ప్రజలు బుక్కరాయలను ఆశ్రయిస్తే మధుర మీనాక్షి కరుణతో కుమారకంపరాయలు మధురపై దాడి చేసి మధుర సులతానును ఓడించి వధించి, సులతానుల దౌష్ట్యానికి  పాడైపోయిన మధురదేవాలయాలను పున:ప్రతిష్టించాడు. ఈ విజయ విషయాలన్ని ఇతని భార్య అయిన గంగాదేవి మధురావిజయంలో  పెర్కొంది. 

హరిహరరాయల మూడవకుమారుడు చిక్కకంపరాయలు (4) సంగముడు (5) విరూపన్న (6) భాస్కరుడు (7) మల్లినాథుడు.వీరిలో ఐదవవాడికే భాస్కరభవదురుడని పేరు. ఇతనే పోరుమామిళ్ళచెఱువును నిర్మించి అక్కడో శాసనాన్ని శాలివాహనశకం 1291 అనగా 1369 ACE లో ఏర్పాటు చేశాడు. చెఱువును ఏ విధంగా నిర్మించాలో అందులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎలాగంటే....

(౧) చెఱువును నిర్మించే వ్యక్తి సచ్ఛీలుడైవుండాలి.అంతేకాదు చెఱువు నిర్మాణానికి ధనముఎంతో అవసరము కదా ! అందువలన చెఱువు నిర్మించేవ్యక్తి ధనవంతుడైకూడా వుండాలి.

(౨) పాత:శాస్త్రం అంటే చెఱువు నిర్మాణం తెలిసిన ఇంజనీరులుండాలి.

(౩) చెఱువునిర్మాణానికి నేల కటినంగా ఉండాలి.

(౪) చెఱువు నిర్మాణం తరువాత ఆ చెరువుకు  నీటిని అందించగల నది వుండాలి, ఆ నది మూడుయోజనాల పొడుగుతో వుండాలి.అంత పెద్ద నది అయితే తప్ప చెఱువుకునీటి సరఫరా కాదు.

(౫) చెఱువునిర్మాణానికి ఆ చివర ఈ చివర కొండల దాపు ఉండాలి.

(౬) చెఱువుపై నిర్మించే ఱాతిగోడ పటిష్టంగా వుండాలి, అటుఇటుగల కొండల చివర వరకు వుండాలి.

(౭) కొండల అంచులు మెతువుగా (Soft) గా వుండరాదు.

(౮) చెఱువు గర్భం అంటే నీరు నిలిచే స్థానం వెడల్పుగా వుండి, లోతుగా వుండాలి.

 (౯) చెఱువు కిందిభాగము పంటపొలాలకు నీరుసాగే భూములు సారవంతమైన పల్లపు నేలలు వుండాలి.

(౧0) చెఱువు నిర్మాణానికి అవసరమైన బలిష్టమైన పొడుగాటి రాళ్లు వుండాలి.

(౧౧) పర్వతప్రాంతాలనుండి నీరు తెచ్చే  ఏఱులు వుండాలి.

(౧౨) చెఱువు నిర్మాణానికి సిద్ధహస్తులైన పరిజనము మరియు పశుసంపదలుండాలి.

ఇక సప్తసంతానలంటే ఏమిటో చూద్దాం.

(1) తటాక నిర్మాణము

(2) నిక్షేపాలు అంటే పెద్దలు దాచివున్న సంపదలు 

(3) అగ్రహారాలు, గ్రామాలనిర్మాణం 

(4)  దేవాలయాల నిర్మాణం 

(5) తోటలువనాలు పెంచుట 

(6)  కావ్యరచన

(7) స్వంత సంతానముPost a Comment

0 Comments