GET MORE DETAILS

డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీలకు ఇక ప్లాస్టిక్‌ కార్డులు - చిప్‌ లేకుండా క్యూఆర్‌ కోడ్‌తో జారీకి నిర్ణయం

డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీలకు ఇక ప్లాస్టిక్‌ కార్డులు - చిప్‌ లేకుండా క్యూఆర్‌ కోడ్‌తో జారీకి నిర్ణయం



డ్రైవింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సులు (డీఎల్‌), వాహనాల రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఇచ్చే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ (ఆర్సీ)లను ఇకపై ప్లాస్టిక్‌ కార్డులతో ఇవ్వనున్నారు. ఇప్పటివరకు స్మార్ట్‌కార్డులు ఇస్తుండగా, ఇకపై క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పీవీసీ ప్లాస్టిక్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని రవాణాశాఖ కార్యాలయాల్లో కలిపి నెలకు 3 లక్షల డీఎల్‌లు, ఆర్సీలు జారీ అవుతుంటాయి. చాలాకాలంగా రాష్ట్రంలో చిప్‌తో కూడిన స్మార్ట్‌కార్డులు జారీ చేస్తున్నారు. అయితే ఆ చిప్‌లో వివరాలను రీడ్‌ చేసే యంత్రాలు రవాణాశాఖ అధికారులు, పోలీసుల వద్ద లేవు. ఈ స్మార్ట్‌కార్డుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. మరోవైపు గుత్తేదారులకు రూ.కోట్లలో బకాయిలు చెల్లించకపోవడంతో మూడేళ్లుగా రాష్ట్రంలో స్మార్ట్‌కార్డుల సరఫరా నిలిచింది. అప్పుడప్పుడు కొంత మొత్తం విడుదల చేయడంతో మధ్యలో కొన్ని కార్డుల చొప్పున గుత్తేదారు సరఫరా చేశారు. చివరకు ఏడాదిన్నరగా కార్డుల సరఫరా నిలిచింది. దీంతో అన్ని జిల్లాల్లో వేలాది కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది రవాణాశాఖ కమిషనర్‌గా కొద్ది నెలలు పనిచేసిన కాటమనేని భాస్కర్‌.. ప్లాస్టిక్‌ కార్డుల జారీపై దృష్టి పెట్టారు. విజయవాడ, విశాఖపట్నంలలో ప్రయోగాత్మకంగా వీటిని సరఫరా చేశారు. తాజాగా గత వారం అన్ని జిల్లాల రవాణా అధికారులతో ఆ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న సమీక్షించి చివరకు ప్లాస్టిక్‌ కార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

కార్డులపై క్యూఆర్‌ కోడ్‌ : తెలంగాణలో కొద్ది నెలల కిందటి నుంచి చిప్‌లేని ప్లాస్టిక్‌ కార్డులు ఇస్తున్నారు. మన వద్ద కూడా అలాంటివే ఇవ్వాలని, అందులో నకిలీవి తయారుకాకుండా వాటిపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించాలని నిర్ణయించారు. ఇలాంటి కార్డుల సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రతిపాదనను త్వరలో ఆర్థిక శాఖకు పంపనున్నట్లు రవాణాశాఖ వర్గాలు తెలిపాయి.

Post a Comment

0 Comments