GET MORE DETAILS

క్రాంతిమయ పర్వదినమే సంక్రాంతి

 క్రాంతిమయ పర్వదినమే సంక్రాంతి



తెలుగు సంస్కృతి వివిధ రూపాల్లో ప్రత్యక్షమయ్యే గొప్ప క్రాంతిమయ పర్వదినం సంక్రాంతి. తెలుగువారు ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరస విన్యాసాలతో జరుపుకొనే సజీవ చైతన్యమే ఈ సంక్రాంతి. మన కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఏవైనా పొరపొచ్చాలు, బేదాభిప్రాయా లు ఉంటే అవి తొలగిపోయి అందరూ కలిసి మెలిసి జరుపుకునే అద్భుత రోజులే ఈ పండగలు . ఈ “సంక్రాంతి” అనడం లో “సం” అంటే మిక్కిలి “క్రాంతి” అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని “సంక్రాంతి” గా పెద్దలు వివరణ చెబుతూ ఉంటారు. అన్నదాతలు సంవత్సరమంతా కష్టపడి చేసిన వ్యవసాయ ఫలితం ధాన్యలక్ష్మి రూపంలో ఇళ్ళకు చేరి, తద్వారా ధనలక్ష్మి నట్టింట కొలువుదీరే పండుగ మన సంక్రాంతి పండుగ. ఆనందాన్ని మనసునిండా నింపుకొని, అనురాగ బంధాల మధ్య ఎంతో శ్రద్ధగా ఈ పండుగ జరుపుకొంటారు. “సంక్రాంతి” లేదా “సంక్రమణం” అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంధంలో “సంక్రాంతి”ని “తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః” అని అభివర్ణించారు.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే లేక చేరే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించి న ప్పటి నుండీ మొదలై, ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమై న అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణ ము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకుని ఉండే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. అంచేతే మహా భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన కురువృద్ధుడై న భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకూ ఆగి, ఉత్తరాయణంలో రథసప్తమి నాడు ప్రారంభించి, రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ, చివరకు భీష్మ ఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు. ఆది శంకరాచార్యుడు ఈరోజు నే సన్యాసం పుచ్చుకున్నాడు. అంతటి మహత్తరమైన పర్వదినం మకర సంక్రాంతి లేక పెద్ద పండుగ. ఈ పండగను భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణాలలోనే కాక, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిషా, పంజాబ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో కూడా పాటిస్తారు. మనకు వచ్చే పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి పాటించడం జరుగుతుంది. గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్స రం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియను కాలెండరు ప్రకారం అవన్నీ వేరువేరు రోజుల్లో వస్తాయి.

తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు వరుసగా వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా మధ్య దినమైన రోజును ‘సంక్రాంతి’ అని పిలుచుకుంటాం. పుష్య మాసంలో వచ్చే ఈ పండుగ పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. పుష్యం అనగా పోషణ శక్తి గలదని అర్థం. స్నానం దానం, పూజ అనే మూడు విధులు ఈ దినాలలో నిర్వర్తించాలి. సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష దైవం. కాల చక్రానికి అనుగుణంగా సంచరిస్తూ ఉండే దేవతా స్వరూపం. ఉత్తరాయణంలో సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశి లోకి వచ్చే రోజు మకర సంక్రమణం జరుగు రోజు. అదే మకర సంక్రాంతి. సంక్రాంతి రోజునే శ్రీ మహావిష్ణువు అసురులను మంధర పర్వతం కింద పూడ్చారు. ధర్మస్థాపన జరిగి అధర్మమును రూపు మాపిన రోజు సంక్రాంతి. సూర్యోదయాకి ముందే నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. ఆయన ను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు, శీతకాలం బాధలు నివారించుకోవడానికి స్నాన జలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించే విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి. నువ్వులు ఉష్ణవర్థకమైనవే కాకుండా బలవర్ధక మైనట్టివి.

సంక్రాంతి రోజున పాలు పొంగించి మిఠాయిలు తయారు చేస్తారు. అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయి న వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదలడం ఆచారం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణా లు ఇవ్వాలి అని విధి. కానీ, మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇచ్చినా, ఇవ్వక పోయినా..ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇవ్వాలి.

మహిళలు ఎంతో అందంగా రంగ వల్లులు తీర్చిదిద్దే రోజు సంక్రాంతి. దానికి ఆరోగ్య రీత్యా, ఖగోళ శాస్త్ర రీత్యా ఎంతో ప్రాముఖ్యం ఉందని పెద్దలు చెప్తారు. రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతంగా భావిస్తే… ఒక పద్దతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం గా చెప్తారు. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యుని స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితిశక్తికి (స్టాటిక్ ఫోర్స్) చుక్కలు గతిశక్తి (డైనమిక్ ఫోర్స్) కు సంకేతాలనీ.. శ్రీచక్ర సమర్పణా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు. మన నేటి మహిళ లు కాంక్రీట్ జంగిల్స్ లో నివసిస్తూ రంగవల్లుల సంస్కృతిని మరచిపోకుండా రంగవల్లుల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు.

మట్టి తో ఒక బొమ్మను చేసి (సంక్రాంతి పురుషుడు), సంవత్సరాన్ని బట్టి ఒక వాహనాన్ని చేసి దానిపై కూర్చుండ జేసి, మేళ తాళాల తో, సంక్రాంతి మూడు రోజుల్లో పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు. ఇంకా.. గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించితే.. హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయ ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తరతమ భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం. గంగిరెద్దు ముందు వెనుకల చెరో ప్రమధునితో, ఎత్తైన మూపురం శివలింగ ఆకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆ ప్రదేశం ధర్మభద్దమైనదని అర్ధం. “జుగోప గోరూప ధరామివోర్విం” దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేల నుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మభద్దమే నంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభ సహిత శంకర పరివారం. ఇన్ని పరమార్ధాలు గల హరిదాస బృందం ఆ పర్వదినాన మన ఇంట అడుగు పెడితే పావన మే కదా!

సంక్రాంతి నాడు దేవతలకూ, పితృ దేవతలకూ ఏఏ పదార్థాలను దానం చేస్తామో అవి అత్యధికంగా జన్మజన్మల కి సిద్ధిస్తాయని ఓ నమ్మకం. మగపిల్లలు పతంగులు (గాలి పటాలు) ఎగురవేసి ఆనంది స్తారు. తమ తమ ఇంటి ఆచారం ప్రకారం కొందరు స్త్రీలు సావిత్రీ వ్రతం లాంటి నోములను నోచుకుంటారు. దీనివల్ల కుటుంబసౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, సౌభాగ్యం సిద్ధిస్తుందని వారి నమ్మకం. ఇరుగు పొరుగులను పిలిచి పండు తాంబూలాలను, నువ్వుండలను ఇచ్చి పెద్దల దగ్గర ఆశీర్వాదాలను తీసుకొంటారు. కొందరు సంక్రాంతి నాడు రాముని పూజచేస్తారు. రామునిలాగా ధర్మమార్గంలో నడవడానికి శక్తి కలగాలని రామాయణాన్నీ పఠిస్తారు. బలిచక్రవర్తికి ఉన్న త్యాగ గుణం అలవడాలన్న కోరికతో వామన పురాణాన్ని కూడా వింటారు. తెలంగాణ అంతా నువ్వుల ఉండలను చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చు కుంటారు. ఇవే కాక ఈరోజున కూష్మాండం, కంబళి, ధాన్యాదులు, లోహాలు, తిలలు, వస్త్రాలు, తైలదీప దానాలు చేస్తే మంచిదని శాస్త్ర వచనం. బూడిద గుమ్మడి కాయను దానంచేసిన వారికి భూదానం చేసిన ఫలం వస్తుంది. పెరుగును దానం చేయడం వల్ల అనారోగ్య బాధలు తీరుతాయి. బుద్ధి వికాసం కలుగుతుంది. సంక్రాంతికి కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువును తీర్చి పేరంటాలూ చేస్తారు.

పండ్రెండు సంవత్సరాలు బాలునిగా, వీర పద్మాసన భంగిమలో కూర్చుని, కుడిచేతి ని చిన్ముద్రగా చేసుకుని ఆ కొండమీద వెలిసిన హరిహర పుత్రుడు స్వామి అయ్యప్పను ఉద్దేశించి దీక్షాధారణ చేసిన అయ్యప్పలందరూ శబరిమలై చేరి మకరవిళక్కును నిర్వర్తించి మకరజ్యోతి దర్శనం చేసుకోవడం సంక్రాంతి పండుగ ప్రత్యేకత. పుష్యమాసములో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రొజున గోదాకల్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తి గావించి తరిస్తారు. అంతేకాక సంక్రాంతినాడు, కొత్త అల్లుళ్ళ రాక, బావామరదళ్ళ పరిహాసాలు కేవలం మన తెలుగు లోగిళ్ళలోని ప్రత్యేకత.

సంక్రాంతికి ముందు రోజు ‘భోగి’ పండుగ జరుపుకుంటా రు. మూల మూలల చెత్తా, పనికిరాని వస్తువులూ ఒకచోట చేర్చి, భోగి మంటలు వేసి, ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు. ఇళ్ళలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తాయి. పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడ లు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న చిన్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టు బట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.

 సంక్రాంతి మరుసటి రోజు ‘కనుమ’. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతే కాదు, వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ.

పండుగలు మన హైందవ జీవన స్రవంతిలో ప్రముఖ భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి. ప్రతి పండుగ వెనుకా తప్పక ఒక సందేశం దాగి వుంటుంది. వైజ్ఞానికంగా మన మహర్షులు ఎంతో పరిశోధించి ఏర్పరచిన ఈ పండుగలన్నీ మానావాళికి హితాన్ని బోధించేవే! సంక్రాంతి పండుగ జరుపుకోవడంలో కూడా ఎన్నో ప్రయోజనాలు న్నాయి. ఇంత చక్కని ఆనందాలను మనకుఅందించే “సంక్రాంతి” పండుగలను మనం ఘనంగా జరుపుకుని మహారాణిలా వచ్చే ఆ పౌష్య లక్ష్మినీ..సంక్రాంతి లక్ష్మీని.. మన ముంగిటలోన నిలుపుకుందాం. 

సంక్రాంతి సంబరాలు :

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి.

నెల రోజులపాటు జరుపుకునే పండగ సంక్రాంతి. మనం జరుపుకునే పండుగలన్నీ ఏదో దైవానికి సంబంధించినవే.!

కానీ సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ. రైతుల పండుగ. కళాకారుల పండుగ. ఈ పండుగ కు మూలపురుషుడు రైతన్న. ఆరుగాలం పంటపొలాలలో శ్రమించే రైతన్న చేసుకునే పండుగ ఇది.

తన పంట కోతకొచ్చినప్పుడు ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకు పొలంలో కష్టపడిన రైతన్నకు కళాకారులు అందరూ అండగా నిలబడతారు. వాళ్ళ వివరాలు తెలుసుకుందాం.

బుడబుక్కలవాడు :

ఈ పండుగ కళారూపాలలో తొలి తాంబూలం బుడబుక్కలవానిది.

పగలంతా కష్టపడిన రైతన్న రాత్రికి నడుం వాలిస్తే కళ్ళంలోని ధాన్యాన్ని దొంగలు తరలించుకు పోకుండా తొలిఝూములో ఊరి పొలిమేరలలో సంచరిస్తూ క్రొత్తవాళ్ళను గ్రామంలోకి చొరబడనీకుండా 'కట్టు' కట్టి కట్టడి చేసేవాడు బుడబుక్కలవాడు. ఇతను తొలిఝామంతా పంటకు కాపలా కాసి రెండోఝాము ప్రవేశిస్తుండగా జంగం దేవరకు ఆ పని అప్పచెబుతాడు.

జంగందేవర :

సాక్షాత్తూ శివుని అవతార అంశలుగా భావించే ఈ జంగందేవరలు శంఖ నాదాలతో ఢమరుక శబ్దాలతో రైతుల కళ్ళాలకు ఊరి ప్రజానీకానికి శుభం పలుకుతూ పరమశివుని ఆశీస్సులను అందించే కాపాలికుడు ఈ జంగందేవర!

 హరిదాసు :

'హరిలో రంగ హరి' అంటూ శ్రీకృష్ణుని గాధలను కీర్తిస్తూ ఇంటింటి ముంగిటికీ వచ్చి పొలం వెళ్ళిన రైతుల క్షేమసమాచారాలను వాళ్ళ ఇళ్ళలో తెలుపుతూ హరినామసంకీర్తనామృతాన్ని దోసిళ్ళతో అందించి దోసెడు బియ్యాన్ని కృష్ణార్పణమంటూ స్వీకరిస్తాడు.ఆ యదుకులేశుని ఆశీస్సులను తన ద్వారా మనకు అందిస్తాడు.

గంగిరెడ్లు :

హరిదాసు ఇంటిలోని వారిని పలకరించి ఇంటి ఆడపడుచులు వేసిన రంగవల్లులపై కృష్ణపరమాత్మ ఆశీస్సులు కురిపించాక అయ్యగారికి దండపెట్టు, అమ్మగారికి దండం పెట్టు, బాబుగారికి దండంపెట్టు, పాపగారికి దండం పెట్టూ అంటూ బసవన్నల చేత దండాలు పెట్టించి,రైతు బ్రతుకుకు అంతా తానై నడిపే ఎడ్లను అలంకరించి ఇంటి ముంగిట్లో ఎడ్ల ఆట ఆడించి ఇంట్లోని చిన్నా పెద్ద అందరినీ అలరించిన గంగిరెద్దుల వాళ్ళు సన్నాయి ఊదుకుంటూ వెళ్ళిపోతారు

పిట్టలదొరలు:

గంగిరెడ్లు, డూడూ బసవన్నలు వెళ్ళాక మనలను నవ్వులలో ముంచెత్తే కబుర్ల పోగు, కోతలరాయుడు పిట్టలదొర వస్తాడు. తనకు ఆరేబియా సముద్రంలో ఆరువేల ఎకరాల భూమి ఉందని,బంగాళాఖాతంలో బంగ్లాలున్నాయని ఆ బంగ్లాలకు వెళ్ళడానికి సరైన దారిలేక ఈమధ్యనే బొప్పాయి కలపతో బ్రహ్మాండమైన బ్రిడ్జి కట్టించాననీ అవన్నీ పిల్లలు అడిగితే ఇచ్చేస్తానని డంబాలు పోతాడు.పిల్లలందరికీ నవ్వుల పువ్వులు పంచుతాడు

సోదెమ్మ :

సోదెమ్మ వెళ్ళిన తరువాత మన భవిష్యత్ ఫలాలను చెబుతానంటూ

'సోదె చెబుతానమ్మా సోదె చెబుతాను ఉన్నదున్నట్టు చెబుతాను లేనీదేమీ చెప్పను తల్లీ' అంటూ మన భవిష్యత్తులో  జరగబోయే వాటి గురించి తనకు తోచింది చెప్పి ఇంత ధాన్యం, పాతచీర,రవికల గుడ్డ పెట్టించుకుని పోతుంది.

భట్రాజులు :

ఆరు నెలల కష్టానికి ఫలితం వచ్చేవేళలో ధాన్యాన్ని ఇంటికి తరలించే సమయంలో రైతుల కళ్ళాలలోకి వెళ్ళి రైతుని ఆతని వంశాన్ని ఆతని పెద్దలనూ పొగడుతూ ఆ రైతు కుటుంబం నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవిస్తూ పద్యాలల్లి ఆశీస్సులను వెదజల్లి ఓ కుంచెడో రెండు కుంచాలో ధాన్యాన్ని కొలిపించుకుని భుజాలకెత్తుకుంటారీ భట్రాజులు.

కొమ్మదాసర్లు :

అన్ని పనులు పూర్తి చేసుకున్న తరువాత కాస్త నడుం వాల్చి విశ్రాంతి తీసుకుందామనుకుంటే ఈ కొమ్మదాసరోడు వచ్చి పెరట్లో చెట్టుకొమ్మనెక్కి 'అప్పయ్య గోరో పడతా పడతా నే పప్పుదాకలో పడతా,పడతా పడతా నే పాతరగోతిలో పడతా' అంటూ అల్లరి చేస్తాడు.అమ్మలక్కలు,పిల్లలు చెట్ల క్రింద జేరి క్రిందకు దిగమని బ్రతిమాలతారు.ఆ పాతరగోతి మీద పాతబట్టలు పరచమని చెప్పి వాటిని పట్టుకెడతాడు.

పూర్వం పండిన పంటను ఇంటికి తెచ్చి పెరట్లో గొయ్యి తవ్వి ఆగోతిలో తాటాకులు కొబ్బరాకులు పరిచి వాటిపైన గడ్డి పరిచి మెత్తను తయారుచేసి ఆపైన ధాన్యం పోసి నిలవచేసే వారు. దీనినే పాతరగొయ్యి అంటారు. పొద్దన్నుంచి పని చేసి చేసి అలసి సొలసి నిద్రపోతారేమో ఇదే సందని దొంగలు ఆ గోతిని తవ్వి పండిన పంటనంతా దోచుకుపోవచ్చు.మీ పాతరగొయ్యి సరిగా ఉందో లేదో ఓ సారి చూసుకోండి అని చెప్పడానికి ఈ కొమ్మదాసరి వస్తాడు.

ఈవిధంగా ఇంతమంది కళాకారులు నెలరోజుల పాటు రైతుల పంటలకు కాపలా కాస్తూ రైతుల క్షేమాన్ని కాంక్షిస్తూ మన పొలాలకు పహారా ఇస్తారు.

మనకింత సాయం చేసిన వాళ్ళకు మనమేమిస్తున్నాము ???

నాలుగు గుప్పెళ్ళ బియ్యం, నాలుగు పాత గుడ్డపీలికలు.ఇంటిల్లిపాది మంచిని కోరుకుంటూ మన ముంగిటికొచ్చే కళాకారులను ఆదరించండి!!!

వెండితెరపై, బుల్లితెరపై ఓ సారి కనబడిన వాళ్ళందరికీ వేలు,లక్షలు పోసి వాళ్ళ వెకిలి చేష్టలను ఆనందించేకన్నా మన సౌఖ్యాన్ని, మన సౌభాగ్యాన్ని కోరుకునే ఈ పల్లె కళాకారులను అక్కున జేర్చుకుందాం.

Post a Comment

0 Comments