GET MORE DETAILS

సివిల్స్ లో మెరిసిన ఆణిముత్యాలు

 సివిల్స్ లో మెరిసిన ఆణిముత్యాలురెండు సార్లు ప్రిలిమ్స్‌ కూడా దాటలేదు. మూడో ప్రయత్నంలో ఫస్ట్‌ ర్యాంక్‌

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ (Civils) - 2022 తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

ఇందులో గ్రేటర్‌ నోయిడాకు చెందిన ఇషితా కిశోర్‌ (Ishita Kishore) ఆల్‌ ఇండియా (AIR) ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. తొలి రెండు ప్రయత్నాల్లో కనీసం ప్రిలిమ్స్‌ కూడా పాసవ్వని ఇషితా మూడోసారి సివిల్స్‌కు అర్హత సాధించడమే గాక ఏకంగా టాపర్‌గా నిలవడం విశేషం.

గ్రేటర్‌ నోయిడాలోని బాల్‌ భారతి స్కూల్లో చదివిన ఇషిత (Ishita Kishore).. 2017లో దిల్లీలోని శ్రీరామ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ సమయంలో దుబాయిలో జరిగిన గ్లోబల్‌ మిలీనియం సమ్మిట్‌లో ఆమె ఇండో-చైనా యువ ప్రతినిధిగా పాల్గొన్నారు. చదువు పూర్తవ్వగానే లండన్‌లోని ఎర్నెస్ట్‌ అండ్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ అనే ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ సంస్థలో రిస్క్‌ అడ్వైజర్‌గా పనిచేశారు. అయితే ఉద్యోగం ఆమెకు సంతృప్తినివ్వలేదు. సివిల్‌ సర్వీసెస్‌ మీద ఆసక్తితో యూపీఎస్సీ (UPSC) పరీక్షలపై దృష్టి సారించారు. తొలి ప్రయత్నంలో సివిల్స్‌ ప్రిలిమ్స్‌ (Civils Prelims) పరీక్షలోనే ఉత్తీర్ణత సాధించలేదు. అయినా నిరాశ పడకుండా రెండోసారి ప్రయత్నించారు. అప్పుడూ ప్రిలిమ్స్‌ కూడా దాటలేకపోయారు. గతేడాది ముచ్చటగా మూడోసారి సివిల్స్‌ పరీక్ష హాజరయ్యారు. ఈసారి ప్రిలిమ్స్‌ గట్టెక్కడంతో తనపై తనకు నమ్మకం పెరిగింది. దీంతో మరింత కష్టపడి చదివి మెయిన్స్‌ (Mains), ఇంటర్వ్యూను క్రాక్‌ చేయడమే గాక.. దేశవ్యాప్తంగా తొలి ర్యాంక్‌ సాధించారు.

మిలిటరీ కుటుంబం నుంచి వచ్చి...

దేశానికి సేవ చేయాలన్న ఆలోచన ఆమెకు వారసత్వంగా సంక్రమించింది. ఇషితా (Ishita Kishore)ది మిలిటరీ కుటుంబం. ఆమె తండ్రి భారత వాయుసేనలో ఉన్నతస్థాయి అధికారి. ''నా కుటుంబాన్ని చూసిన ప్రతిసారి ఈ దేశం కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన నాలో పెరిగేది. నేను పెరిగిన వాతావరణం అలాంటిది. అందుకే సివిల్స్‌ సర్వీసెస్‌లో చేరాలనుకున్నా'' అని ఇషితా ఓ సందర్భంలో వెల్లడించారు. ఇషితాకు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువే. ఫుట్‌బాల్‌, తైక్వాండో, బాస్కెట్‌బాల్‌ వంటి ఆటల్లో ఆమె చురుగ్గా ఉంటారట.

''యూపీఎస్సీ పరీక్షలో ఈసారి తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం ఉంది. కానీ ఏకంగా ఫస్ట్‌ ర్యాంక్‌ వస్తుందని ఊహించలేకపోయా. ఐఏఎస్‌లో చేరి దేశానికి సేవ చేయాలన్నదే నా కల. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన నా తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మెయిన్స్‌ పరీక్షల కోసం చాలా కష్టపడ్డా. గత ప్రశ్నాపత్రాలను చూసి ప్రాక్టీస్‌ చేశా. వార్తాపత్రికల నుంచి నోట్స్‌ తయారు చేసుకుని రివిజన్‌ చేసుకున్నా. ఇవన్నీ నేను సివిల్స్‌ సాధించేలా చేశాయి'' అని ఇషితా (Ishita Kishore) ఆనందం వ్యక్తం చేశారు.


సివిల్స్ లో సిక్కోలు యువతి సత్తా
ఒప్పంగికి చెందిన కళ్యాణికి 285వ ర్యాంకు

సిక్కోలు కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది.


యుపిఎస్‌సి మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో సిక్కోలు యువతి సత్తా చాటింది. శ్రీకాకుళం రూరల్‌ మండలం ఒప్పంగికి చెందిన చల్లా కళ్యాణి 285వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. చిన్ననాటి నుంచి పేదరికం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా పట్టుదలతో చదివి అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఈమె తండ్రి అసిరినాయుడు మేస్త్రిగా పనిచేస్తున్నారు. తల్లి సత్యవతి గృహిణి. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, కళ్యాణి రెండో కుమార్తె. పెద్ద కుమార్తె సరళకు వివాహమైంది. చిన్న కుమార్తె రమ ఎమ్మెస్సీ చదివి ఉన్నతోద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్నారు. 2021లో ప్రకటించిన గ్రూప్‌-1 ఫలితాల్లో సబ్‌ ట్రెజరీ అధికారిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె గుంటూరులో శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొందుతూనే మరోవైపు సివిల్స్‌కు సాధన సాగించి విజయం సాధించారు. కుమార్తె సివిల్స్‌లో ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తల్లిదండ్రులకు బంధువులు, స్నేహితులు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.


సివిల్స్‌లో మెరిసిన తురువోలు ఆణిముత్యంహేమంత్‌కు 469వ ర్యాంకు

గ్రామస్థుల సంబరాలు

చీడికాడ, కఠోర శ్రమ, రెండేళ్ల సాధన ఫలించింది. సాధించాలనే తపనతో ఆ యువకుడు ఉన్నత లక్ష్యంవైపు బలమైన అడుగులు వేశారు. ఉన్నత కొలువు సాధించాలన్న కల సాకారమైంది. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌లో చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన బొడ్డు హేమంత్‌ సత్తా చాటారు.

చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన బొడ్డు సత్తిబాబు, బాల దంపతుల పెద్ద కుమారుడు హేమంత్‌. వారిది వ్యవసాయదారుల కుటుంబం. తండ్రి విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగి, తల్లి బాల ఇంజినీరింగ్‌ కళాశాలలో అధ్యాపకురాలు. తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులు కావడంతో పిల్లలు ఇద్దర్ని ఉన్నత చదువులే చదివించారు. పెద్ద కుమారుడు హేమంత్‌ చదువుల్లో రాణించి అఖిల భారత సివిల్‌ సర్వీస్‌లో ఆలిండియాలో 469వ ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపి తల్లిదండ్రుల కల నెరవేర్చారు.


హేమంత్‌కి మిఠాయిలు తినిపిస్తున్న తల్లిదండ్రులు సత్తిబాబు, బాల

విద్యాభ్యాసం ఇలా...

చిన్నప్పటి నుంచీ హేమంత్‌ చదువులో చురుగ్గానే ఉండేవాడు. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా పిల్లల చదువు అంతా.. బయటనే సాగింది. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు విశాఖలోని శివ శివాని స్కూల్‌లో చదివారు. తర్వాత ఆరు నుంచి పది వరకు డాక్టర్‌ కె.కె.ఆర్‌.ఎస్‌ గౌతం స్కూల్‌, ఇంటర్మీడియట్‌ విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో చదివారు. తర్వాత ఇంజినీరింగ్‌పై మక్కువతో ముంబయిలో బీటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు. చదువు పూర్తవ్వగానే క్యాంపస్‌ ఇంటర్య్వూలో ఎంపికై.. ఏడాది పాటు ఉద్యోగం చేశారు. చిన్నప్పటి నుంచీ సివిల్స్‌ సాధించాలనేది అతడితో పాటు తల్లిదండ్రుల కల. దీంతో హేమంత్‌ ఏడాది పాటు ఉద్యోగం చేసిన అనంతరం దిల్లీలో సివిల్స్‌ సాధనకు శిక్షణ తీసుకున్నారు. తొలి ప్రయత్నంలో మెయిన్స్‌కు అర్హత సాధించలేకపోయారు. నిరుత్సాహం చెందకుండా కఠోర శ్రమతో సివిల్స్‌-2022లో మలి ప్రయత్నం చేశారు. ఈ దఫా 469వ ర్యాంకు సాధించడంతో మారుమూల పల్లెటూరైన తురువోలు కీర్తి దేశంలోనే మార్మోగింది. గ్రామానికి చెందిన కుర్రాడు సివిల్స్‌ ర్యాంకు సాధించిన విషయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

ఇష్టపడి చదివితే లక్ష్యసాధన...

ఐఏఎస్‌ కావడమే నా లక్ష్యం. నా కల సాకారం చేసుకునేందుకు ఎంత కష్టమైనా ప్రయత్నిస్తూనే ఉంటా. ఇప్పడొచ్చిన ర్యాంకుకు ఏ సర్వీస్‌ వచ్చినా.. ఉన్నత లక్ష్యం కోసం పరీక్ష రాస్తూనే ఉంటాను. సివిల్స్‌లో ర్యాంకు సాధించేందుకు నా తల్లిదండ్రులు, గురువులు, బంధువులు, స్నేహితులు వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చు. నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు ఇష్టంతో చదివితే విజయం తప్పకుండా వరిస్తోంది. అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళిక ప్రకారం చదవాలి.

బొడ్డు హేమంత్‌, 

సివిల్స్‌ ర్యాంకర్‌, 

తురువోలు

Post a Comment

0 Comments