GET MORE DETAILS

మనం ఎందుకు మానసికంగా అలసిపోతామంటే...!

మనం ఎందుకు మానసికంగా అలసిపోతామంటే...!



రాము ఉదయాన్నే లేచాడు, లేవగానే మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంది. 10 నిమిషాల్లో నిన్నటి కి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు, ఈ రోజు చేయాల్సిన పనులు గుర్తొచ్చాయి.

నిన్న వచ్చిన ఒక సమస్య గురించి ఆలోచన మొదలైంది. " అలా జరిగి ఉండకూడదు కదా" అంటూ అతని ఆలోచనల్లో రెసిస్టెన్స్ మొదలైంది.

అంతలో ఇంటి గేటు దగ్గరికి వెళ్లి న్యూస్ పేపర్ అందుకున్నాడు. హెడ్ లైన్స్ లో ఏదో విషాదం గురించి రాయబడి ఉంది. ఒక్కసారిగా మనసు వ్యాకుల పడింది. " ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి" అనుకుంటూ మళ్లీ జరుగుతున్న పరిణామాల మీద రెసిస్టెన్స్ మొదలైంది.

ఆఫీసుకు బయలుదేరాడు. రోడ్డు మీద విపరీతమైన ట్రాఫిక్. ఒకళ్ళ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించడంలేదు. అందర్నీ తిట్టుకుంటూ, వ్యవస్థ ఇలా ఉండకూడదు అనుకుంటూ తిరస్కరిస్తూ ఆలోచనలు చేస్తున్నాడు.

ఆఫీస్ కి వెళ్ళగానే బాస్ ఏదో విషయంలో అవమానంగా మాట్లాడాడు. ఆ ఒత్తిడి దిగమింగుకోలేక "ఈ చెత్త ఆఫీసర్ దగ్గర పనిచేయాల్సి వస్తోంది" అంటూ ఆ పరిస్థితిని కూడా రెసిస్ట్ చెయ్యడం మొదలుపెట్టాడు.

ఇలా అన్ని రకాలుగా మానసికంగానూ, శారీరకంగాను అలిసిపోయి ఇంటికి వచ్చాక.. "నాన్నా నాకు బొమ్మ గన్ కొనిపెట్టవా" అంటూ పిల్లాడు మారాం చేస్తున్నాడు. అది భరించలేక " అలిసిపోయి ఇంటికి వస్తే కొద్దిగా అయినా ఒక్కరంటే ఒక్కరు మాట వినరు" అనుకుంటూ తనపై తాను జాలి చూపించుకుంటూ, ఆ పరిస్థితిని కూడా అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనుకుంటూ రెసిస్ట్ చేశాడు.

ఇప్పుడు చెబుతాను.. కొండ మీద నుంచి ఓ బండరాయి కింద పడుతుంటే, అది కింద పడకూడదు అని ఒక మనిషి దానికి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే సాధ్యమవుతుందా? రెసిస్టెన్స్ కూడా అలాంటిదే. జీవితం అన్న తర్వాత మనం అనుకోనివి చాలా జరుగుతాయి. వాటిని ఒక ప్రేక్షకుడిలా జడ్జ్ చెయ్యకుండా వదిలేస్తే ప్రశాంతత వస్తుంది. అన్నిటినీ పట్టుకుంటే, వాటిని అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని రెసిస్ట్ చేస్తే చాలా మానసిక శక్తి వృధా అవుతుంది. దాంతో మానసికంగా అలసట వస్తుంది.

ఏ వ్యక్తి అయితే రెసిస్ట్ చేయకుండా, జరిగేవి జరిగినట్లు యాక్సెప్ట్ చేస్తాడో ఆ వ్యక్తి మానసికంగా అలిసిపోడు. ఎంత పని అయినా చేయగలుగుతాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉండగలుగుతాడు.

Post a Comment

0 Comments