GET MORE DETAILS

మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి.

మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి.



 కార్తీకమాసం శుక్షపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి కైశిక ద్వాదశి అనీ అంటారు. అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, హరిబోధినీ ద్వాదశి అనీ, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అనీ, యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొందింది. అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు కనుక 'మధన ద్వాదశి” అని వాడుకలో ఉంది. 

క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని 'బృందావని ద్వాదశి'గా పిలుస్తారు. చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు. పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభ తిథి. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసీని శ్రీలక్ష్మీగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. బృందావనం అంటే మన ఇంట్లో వుండే తులసి దగ్గరకు వస్తారు. ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా వెలిగించక పోయినా ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది అని అంటారు. 

ఈ ద్వాదశి రోజున దీపదానం చేస్తే.ఒక దీపాన్ని దానం చేస్తే 'ఉప పాతకములు" నశిస్తాయి. పది దీపాల్ని దానం చేస్తే 'మహా పాతకములు” నశిస్తాయి. వంద దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది. వందకు పైగా దానం చేస్తే “స్వర్గాధిపత్యం” లభిస్తుంది. ఈరోజు దీపదర్శనం లభిస్తేనే ఆయుర్దాయం, బుద్ధిబలం, ధైర్యం, సంపద కలుగుతాయి.

బృంద ద్వాదశి గురించి ఒక పురాణ కథ ఉంది

పూర్వము కాలనేమి అనే రాక్షసుడికి గుణవతి అయిన ఒక కుమార్తె ఉండేది. అమె పేరు “బృంద”. ఆమెను జలంధరుడు అనే రాక్షసునికి ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలానికి జలంధరుడు దేవతలపై యుద్దానికి వెళ్ళాడు. దేవతలు అతన్ని జయించలేకపోయారు. అందుకు కారణం పతివ్రత అయిన బృందయే అని గ్రహిస్తారు. ఆ విషయం విష్ణువుకు తెలియజేస్తారు.

బృంద పాతివ్రత్యం చెడితేనేగాని జలంధరుని జయించడం కష్టమని గ్రహించిన విష్ణువు జలంధరుని రూపంలో బృంద దగ్గరకు వెళతాడు. వచ్చింది భర్తే అని భమపడిన బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలేస్తుంది. దాంతో జలంధరుడు ఇంద్రుని చేతిలో మరణిస్తాడు. అది తెలిసిన బృంద కోపంతో విష్ణువును శిలవు (రాయి) కమ్మని శపిస్తుంది. అయితే విష్ణువు తన భక్తురాలైన బృందను శాంతింపజేసి, ఆమెను అనుగ్రహిస్తాడు. ఆమె తులసి చెట్టుగా అవతరించి అన్ని లోకాల వారి చేత పూజలందుకుంటుందని వరమిస్తాడు. ఆ విధంగా బృంద తులసి చెట్టుగా పూజలందుకుంటోందని చిలకమర్తి తెలిపారు.

 దూర్వాస మహర్షి వారి చేత శపించబడి వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు ఆలోచనతో రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మథనం  ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని మధించినరోజు కాబట్టి ఇది ‘క్షీరాబ్ది ద్వాదశి’ అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక  పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు చుక్కలు మునుల మీద, దేవతలమీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చినుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.

క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనే ఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీ రూపంతో అలంకరిస్తారు. సుగంధ ద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.

'క్షీరాబ్ది ద్వాదశి' రోజున తులసి తప్పనిసరిగా పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. . శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి. తులసికోటలో లక్ష్మీనారాయణులు కొలువై వుంటారు గనుక, ఈ రోజున చేసే తులసి పూజ మరింత విశేషమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది క్షీరాబ్ధి శయన వ్రతంలో తులసినీ, విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు. సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందంపై శ్రీ విష్ణువు పటాన్ని గానీ, విగ్రహాన్ని గానీ ఉంచి ఆచరించే వ్రతం వల్ల ఐదోతనం ప్రాప్తించి సుఖసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. భారతీయ సంప్రదాయంలో తులసికి అధిక ప్రాధాన్యం ఉంది. దేవతార్చనకు తులసిదళం అతి శ్రేష్టం. తులసి మొక్క శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. నువ్వుల్లో నూనెలాగ, పెరుగులో వెన్నలా, ప్రవాహంలో నీటిలాగా, ఇంధనంలో అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసిమొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మోపనిషత్తు తెలుపుతోంది. తులసి సాక్షాత్తు లక్షీ దేవి అవతారం. తులసి మొక్కనుంచి వచ్చే తావి వల్ల పరిసరాలు శుభ్రంగా మారతాయి. అందుకే తులసి మొక్కను పవిత్రమైందిగా పరిగణిస్తారు. భారతీయ సంస్కృతిలో ప్రతి ఇంట్లోను తులసికోట నిర్మించడం ఆచారంగా వస్తోంది. స్మృతి కౌస్తుభం ప్రకారం కార్తీక ద్వాదశి మొదలు పౌర్టమి వరకు తులసి కల్యాణం జరపాలని చెబుతారు. దశావతారాల్లోని శ్రీకృష్ణావతారంలో తులసికీ శ్రీ కృష్ణునికీ కార్తీక ద్వాదశి నాడు వివాహం జరిగిందని పురాణ కథనం. తులసి కల్యాణానికి దేవదీపావళి అని పేరు. దీపావళి నాటిలాగ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంటినిండా ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. శ్రీకృష్ణుడు సర్వదా తన సొత్తుగా భావిస్తూ గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింపజేసిన వ్రతం తెలిసిందే.  తులసి దళం బరువుకు మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామకు గర్వభంగం కలిగిన కథ మరిచిపోలేనిది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉసిరికాయలతో కూడిన కొమ్మను తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం ఆచారంగా వస్తోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

భక్తి శ్రద్ధలతో తులసిని పూజించి, దీపదానాలు చేయడం వలన సమస్త దోషాలు నశిస్తాయనీ, అపమృత్యు భయాలు తొలగిపోతాయని  ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజు తెల్లవారు జామునే పుణ్యస్త్రీలు తలంటు స్నానం చేయాలి. తులసి కోటను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించాలి. తులసికోట దగ్గర దీపం పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత పూజా మందిరం చెంత యధావిధిగా నిత్య పూజను జరపాలి. మరలా సాయంత్రం తులసి పూజ అయ్యేంత వరకూ ఉపవాసం వుండాలి. సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించిన దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. 

సిరిసంపదలకు ఏమాత్రం పొంగిపోక కేవలం విష్ణు పాదచరణమే శాశ్వతమని భావించే అంబరీష చక్రవర్తి... ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమ నిష్ఠలతో ఆచరించాడు. అంబరీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దుర్వాసుడు.. ఈ రోజు లోకాలన్నింటికీ నీ భక్తి గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది.. క్షీరాబ్ది ద్వాదశి పుణ్య తిథి రోజు నీ కథా శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుజ్యాన్ని పొందతారని అనుగ్రహించాడు. అవసరం వచ్చినప్పుడు పది అవతారాలుగా లోకరక్షణకోసం తాను అనుభవిస్తానని శ్రీమహావిష్ణువు. దీనివల్ల భక్తులకు పరమాత్మ ఎప్పుడూ బంధీనే అనే అంశం మనకు స్పష్టమవుతుంది. ఇలా ఎవరైతే ఈ ద్వాదశి రోజున ఈ కథను విన్నా, లేక చదివినా అనేక పాపాలు నశించి, పుణ్యఫలం కలుగుతుంది.

Post a Comment

0 Comments