GET MORE DETAILS

ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం, 2022 : పెనుభూతం కోరలనుంచి ప్రజలారా మిమ్మల్ని మీరు కాపాడుకోండి

ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం, 2022 : పెనుభూతం కోరలనుంచి ప్రజలారా మిమ్మల్ని మీరు కాపాడుకోండి



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోయిన నెలలో అమల్లోకి తెచ్చిన AP ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, 2022 (ఆంధ్ర ప్రదేశ్ భూమి హక్కుల చట్టం, 2022) ప్రజల పాలిట యమపాశం కాబోతుంది. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవిన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడబోతున్నాయి.

పైన తెలిపిన చట్టం ప్రకారం భూ ప్రాధికార సంస్థ, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (TRO) నియమితమైన తరువాత ప్రజల తాలూకు స్థిరాస్తులన్నీ అట్టి TRO పరిధిలోకి పోతాయి. 

మీ అమ్మాయికి మీరు పొలం ఇస్తూ దానపట్టా దస్తావేజు వ్రాయించాలంటే TRO నుంచి అనుమతి పొందాలి, 

మీ అవసరాలకి మీ ఆస్తి అమ్ముకోవాలంటే TRO అనుమతి కావాలి. మీరు బాకీ రాబట్టుకోవడానికి కోర్టు నుంచి తనఖా డిక్రీ పొందితే దాన్ని TRO దగ్గర తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. సదరు డిక్రీని అమలుపరచమని కోర్టుకు వెళ్లాలంటే TRO నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. మీరు స్థిరాస్తి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాత దాన్ని TRO దగ్గర తిరిగి నమోదు చేయించుకోవాలి. మీ ఆస్తికి సంబంధించి TRO చేసినదే తుది నిర్ణయం. దానిని మీరు సాధారణ సివిల్ కోర్టులలో సవాలు చేయడం కుదరదు. మీ ఆస్తిని గాని TRO ఎట్టి పరిస్థితులలోనైనా తన వద్దనున్న వివాదాల నమోదు రిజిస్టర్ లో కనుక చేర్చినట్లైతే సదరు చేరికను మీరు హై కోర్టులో తప్ప క్రింది కోర్టులలో సవాలు చేయడానికి వీలుకాదు. 

TRO నియమితమైన తరువాత పెండింగులో ఉన్న దావాలను కూడా TRO పరిధిలో ఉంచి నమోదు చేయించుకోవాలి. మీకు బిన్నంగా ఏదైనా కోర్టు తీర్పు వచ్చిన తరువాత మీరు సదరు తీర్పును పై కోర్టులో అప్పీల్ చేయాలనుకుంటే TRO దగ్గర ముందు నమోదు చేయించుకుని సదరు ధృవపత్రమును సదరు అప్పీలుతో జతపరచి మాత్రమే అప్పీలు చేసుకోగలుగుతారు. పై సందర్భాల్లో TRO గనుక మీ వివాదాన్ని నమోదు చేసి సర్టిఫికెటు ఇవ్వకపోయినట్లైతే మీరు వేసిన దావాకాని, అప్పీలు కానీ చెల్లకుండా పోతాయి.  

మీ ఆస్తికి సంబంధించి మీరెవరికైనా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే సదరు విషయాన్ని TRO దగ్గర నమోదు చేయించుకోవాలి. ఇన్ని మాటలు అనవసరం. మీ ఆస్తికి సంబంధించి ఇక ముందు మీరు ప్రతిక్షణం TRO కనుసన్నల్లో బ్రతకాల్సుంటుంది. సదరు TRO మాత్రం స్థానిక శాసనసభ్యుడు లేదా పార్లమెంట్ సభ్యుడు చేతిలో ఉంటాడు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ. ఇక ముందు ప్రతీ పౌరుడు బ్రతుకు బానిస బ్రతుకుగా మారిపోబోతుంది. 

రిజిస్ట్రేషన్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు అందరూ కలిసి లక్ష మందికి పైగా చేయలేని పనుల్ని ప్రభుత్వం నియమించబోయే ఏ మాత్రం న్యాయ పరిజ్ఞానం లేని ఐదు లేక ఆరు వందలమంది TROలు చక్కబెట్టగలరనుకోవడం హాస్యాస్పదం. ఇదెలా అంటే రోగులు ఎక్కువయ్యారని ఆసుపత్రులన్నింటిని మూసేసి పసర మందులిచ్చే, తాయత్తులుకట్టే నాటు వైద్యుల దగ్గరికి రోగాన్ని నయం చేయించడానికి పంపించినట్టవుతుంది. కంటి ముందున్నది పెను ఉపద్రవం. కానుకోకుంటే జరిగేది సకల వినాశనం. ఈ సమస్య ప్రజలందరిది. పరిష్కరించుకోవాల్సిన బాధ్యత గల మన న్యాయవాదులకే కాదు ప్రజలందరిది కూడా…ఇకనైనా రాష్ట్రప్రభుత్వం చట్టాన్ని సవరించేందుకు తగుచర్యలుచేపట్టాలని మనవి.

సదా సమాజ సేవలో...

శ్రీ వి. జయకుమార్ న్యాయవాది,

చిత్తూరు.

&

అధ్యక్షులు,

లీగల్ అవేర్నెస్ సర్వీసెస్సొసైటీ, చిత్తూరు.

9490504359.

Post a Comment

0 Comments