GET MORE DETAILS

కనుమరుగౌతున్న చిత్తడి నేలలు - ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం(వెట్ ల్యాండ్స్)

కనుమరుగౌతున్న చిత్తడి నేలలు - ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం(వెట్ ల్యాండ్స్)




యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

వివిధ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడానికి భూమి ఒక విలువైన వనరు. భూమి వినియోగం అనేది భూమి మరియు దాని వనరులను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని సూచిస్తుంది. భూమి వినియోగం దాని భౌగోళిక స్థానం, జనాభా సాంద్రత, సామాజిక-ఆర్థిక కారకాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.భూమిలో అనేక రకాల నేలలు వుంటాయి.వీటిలో చిత్తడి నేలలు ఒకటి.

భౌగోళికపరంగా , జీవ వైవిధ్య పరంగా చిత్తడినేలలు ఎంతో కీలకమైనవి . సముద్ర తీరప్రాంతాలలొనైనా , నదీ ప్రాంతాలలోనైనా సంవత్సరం లో అధిక కాలము నీరు నిలిచివుండి , తోతు తక్కువగా ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలుగా పిలుస్తారు . మంచినీటి , ఉప్పునీటి సరస్సులు , మడ అడవులలు కలిగిన సాగర సంగమ ప్రాంతాలు , బురద కయ్యలు , ఉప్పునీటి కయ్యలు , ప్రవాహాలు కలిగిన ప్రాంతాలు వంటివన్నీ చిత్తడి నేలల కిందకే వస్తాయి .

జలవనరులు మానవాళి మనుగడకు ఎంతో కీలకం . అందుకే మానవ సంస్కృతి నదీ తీరాలలోనే విలసిల్లినది . సింధు , గంగానది , కృష్ణానదీ , గోదావరీ నదీతీరాలలోనే విలసిల్లినది .నేడు మహానగరములుగా భాసిల్లుతున్న కలకత్తా , ముంబయి , చెన్నై , టొకియో, న్యూయార్క్ వంటివన్నీ జలవనరుల ఆధారముగా ఎదిగినవే , అన్ని దిక్కులనుండి అక్కడికి ప్రజలను ఆకర్షించడానికి మూలము ఆ నగరాల ఆర్ధికసంపద అయితే , ఆ ఆర్ధిక సంపదను అందించినది ఆ ప్రాంతాలలో ఉన్న చిత్తడి నేలలే . ఒక ప్రాంత ఆర్ధికవ్యవస్థలో చిత్తడి నేలలు కీలక పాత్ర వహిస్తాయి. సముద్రతీరంలో ఉన్న చిత్తడినేలలు ఆ ప్రదేశానికి స్థిరత్వాన్నిస్తాయి . అలల తాకిడికి ఆ ప్రాంతం దెబ్బతినకుండా రక్షిస్తాయి . నదులప్రాంతంలో అయితే చిత్తడినేలలు వరదముంపుల నుండి రక్షిస్తాయి .చిత్తడినేలలు అనేక వందల రకాల మొక్కలు , జంతువులకు మెరుగైన ఆశ్రయాన్నిస్తాయి .

1971 ఫిబ్రవరి 2న చిత్తడి నేలల మీద ప్రపంచ దృష్టి మళ్ళించే సదస్సు ఇరాన్‌ దేశములో రామ్‌సార్ పట్టణములో జరిగింది . కాస్పియన్‌ సముద్రతీరం మీదున్న అ రామ్‌సార్ జరిపిన చర్చల ఫలితంగా ప్రపంచం లోని దేశాలన్నీ తమ తమ దేశాల్లోని కీలక చిత్తడి నేలలను గుర్తించి వాటి పరిరక్షణ కు అవసరమైన చర్యలు చేపట్టాలనితీర్మానం చేసారు.ప్రత్యేక చట్టాలతో వాటిని రక్షించాల్సిన భాద్యత ప్రభుత్వాలపైన పెట్టింది . అయినా చిత్తడి నేలల మీద దృస్టి 1997 వరకు కేంద్రీకరించబడలేదు .

తొలిసారిగా ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని 1997 లో ఫిబ్రవరి 02 న జరిపారు . నాటి నుండి ప్రతియేటా ఈ దినోత్సవం జరుగుతోంది . ఒక్కొక్క సంవత్సరము ఒక కొత్త అంశం మీద దృష్టి పెడుతూ ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు . ఈ ఏడాది చిత్తడి నేలలు-మానవ సంక్షేమం అనే ఇతివృత్తంగా జరుపుతున్నారు.అడవుల నరికివేత,పెరుగుతున్న వాతావరణ కాలుష్యం తదితర కారణాల వల్ల చిత్తడి నేలలు తమ స్వరూపాన్ని కోల్పోతున్నాయి.వీటిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Post a Comment

0 Comments