GET MORE DETAILS

పదిరోజుల్లో 10వేలు...73,350కి చేరిన బంగారం ధర

పదిరోజుల్లో 10వేలు...73,350కి చేరిన బంగారం ధర



• తులం 73,350

• మరో ఆల్‌టైమ్‌ హైకి బంగారం ధర

• జెట్‌ స్పీడ్‌తో పెరుగుతూపోతున్న రేట్లు

• ఒక్కరోజే రూ.1,050 పైకి

• కిలో వెండి రూ.86,300

పసిడి ధరలు పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డును సృష్టిస్తూ హల్‌చల్‌ చేస్తున్నాయి. వరుసగా నాల్గో రోజూ మునుపెన్నడూలేని మరో స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం కనీవినీ ఎరుగని రీతిలో తులం 24 క్యారెట్‌ బంగారం ధర రూ.73,000 మార్కును దాటింది. బులియన్‌ మార్కెట్‌లో తొలిసారి 10 గ్రాములు రూ.73,350 పలికింది. క్రితం రోజుతో పోల్చితే ఒక్కరోజే రూ.1,050 ఎగబాకడం గమనార్హం.

స్పాట్‌ మార్కెట్‌లో రూ.75వేలకు...

ఢిల్లీ స్పాట్‌ మార్కెట్‌లో స్థానిక పన్నులతో కలిపితే తులం పుత్తడి రూ.75వేలపైకే చేరింది. శుక్రవారం ఒకానొక దశలో 10 గ్రాములు రూ.75,500గా నమోదైనట్టు మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ 10 గ్రాములు రూ.1,090 ఎగిసి రూ.73,310గా ఉన్నది. 22 క్యారెట్‌ రూ.1,000 పుంజుకొని రూ.67,200కు చేరింది. అయితే స్పాట్‌ మార్కెట్‌లో 24 క్యారెట్‌ రూ.75,450కిపైగా పలికింది. ఇక ఫ్యూచర్‌ మార్కెట్లలోనూ పసిడి కాంతులు విరజిమ్ముతున్నాయి.

వెండి ధరలూ రయ్‌... రయ్‌...

వెండి ధరలూ దౌడు తీస్తున్నాయి. కిలో వెండి ధర రూ.86,300కు చేరింది. ఢిల్లీలో ఒక్కరోజే రూ.1,400 పెరిగింది. ఇక హైదరాబాద్‌లో రూ.1,500 ఎగిసి రూ.86,500ను తాకింది. సాధారణ కొనుగోలుదారులతోపాటు పారిశ్రామిక వర్గాల నుంచి పెరిగిన డిమాండే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదిలావుంటే గ్లోబల్‌ మార్కెట్‌లో ఔన్సు పుత్తడి 48 డాలర్లు పెరిగి 2,388 డాలర్లను చేరింది. వెండి కూడా ఔన్సు 28.95 డాలర్లకు వెళ్లింది.

ధరలు పెరిగితే ఇబ్బందే...

మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా పెరుగుతూపోతే.. వ్యాపారం సాగదని జ్యుయెల్లర్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌తో అమ్మకాలు మందగించాయని ప్రముఖ ఆభరణాల వర్తక సంస్థ సెన్కో గోల్డ్‌ లిమిటెడ్‌ అంటున్నది. డిమాండ్‌ పడిపోయిందని కోల్‌కత్తాకు చెందిన ఈ కంపెనీ పేర్కొంటున్నది. 'గడిచిన 30 రోజుల్లో బంగారం ధరలు దాదాపు 10 శాతం ఎగబాకాయి. ఇక గత 6 నెలల్లో 23-25 శాతం పుంజుకున్నాయి. దీనివల్ల రిటైల్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతిన్నది. ఇండస్ట్రీ వాల్యూమ్స్‌ 15-20 శాతం దిగజారాయి' అని సెన్కో గోల్డ్‌ ఎండీ, సీఈవో సువంకర్‌ సేన్‌ అన్నారు. అయితే స్థానిక పండుగలతో మార్కెట్‌ కొంత పుంజుకోవచ్చన్న ఆశాభావం ఉన్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నగదుపై ఉన్న ఆంక్షలు తమ అమ్మకాలను ప్రభావితం చేయవచ్చన్న అనుమానాలనూ వ్యక్తం చేశారు. మొత్తానికి ధరలు స్థిరంగా ఉంటేనే అమ్మకాలు బాగా జరుగుతాయని మెజారిటీ రిటైలర్లు చెప్తుండటం గమనార్హం.

విపణిలో పసిడి ధరల పెరుగుదలకు కారణాలు

• అంతర్జాతీయ మార్కెట్‌లో పరుగులు పెడుతున్న రేట్లు

• ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోతలు ఆలస్యమవుతాయన్న అంచనాలు

• దేశీయ స్టాక్‌ మార్కెట్ల ఒడుదొడుకులు

• మదుపరుల దృష్టిలో సురక్షిత పెట్టుబడి సాధనం

• పెండ్లిళ్ల సీజన్‌తో పెరిగిన డిమాండ్‌

Post a Comment

0 Comments