GET MORE DETAILS

హీమోఫిలియాతో ప్రమాదం (ఏప్రిల్ 17 ప్రపంచ హీమోఫీలియా డే)

 హీమోఫిలియాతో ప్రమాదం (ఏప్రిల్ 17 ప్రపంచ హీమోఫీలియా డే)



 కొంతమందికి చిన్న దెబ్బ తగిలి గాయమైనా అది నిరంతర రక్తస్రావానికి కారణమై ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. ఇలా రక్తం సహజంగా గడ్డకట్టడంలో విఫలమయ్యే పరిస్థితిని 'హీమోఫీలియా' అంటారు.   శరీరానికి గాయమైనప్పుడు రక్తం ఆగకుండా స్రవించే వ్యాధిని హీమోఫిలియా అంటారు.ఈ వ్యాధిని రాజుల రుగ్మత అనికూడా అంటారు. బ్రిటీష్‌ రాజవంశీయులు తమ రక్తం చాలా విలువైనదని, అదెప్పుడూ కలుషితం కాకూడదని తమ దగ్గరి బంధువులనే వివాహం చేసుకు నేవారు. ఇలా కొన్ని తరాలు గడిచాక దగ్గరి సంబంధాలతో జన్యువులుబలహీనమయ్యాయి. దాంతో రక్తం గడ్డకట్టించే జన్యువుల్లో లోపం వల్ల రాజవంశీయుల్లో మగపిల్లలకు ఒక జబ్బు వచ్చింది. అదేమిటంటే... చిన్నగా తేలికపాటి గాయమైనా దాని నుంచి ఆగకుండా రక్తం ప్రవహించేది.  ఎక్కువగా మేనరిక వివాహాలు చేసుకునే కుటుంబాల్లో  ఈ వ్యాధి కన్పిస్తోందని వైద్య, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో ఎల్లప్పుడూ జరిగే రక్త ప్రవాహానికి ఏవైనా ఆటంకాలు ఏర్పడితే సహజంగా రక్తస్రావం అవుతుంది. ఐతే, దానిని నిలువరించడానికి ఒక వ్యవస్థకూడా రక్తంలో ఉంటుంది. తన చుట్టూ వలలాంటిదాన్ని నిర్మించుకుని, ఆ వల పోగులు క్రమంగా మందమైపోతూ రక్తస్రావాన్ని ఆపుకునే ఆ వ్యవస్థను 'రక్తం గడ్డకట్టడం' (క్లాటింగ్‌) అంటారు. అయితే కొంతమందిలో ఇలా రక్తం గడ్డకట్టే వ్యవస్థ సరిగా పనిచేయదు. అదే 'హీమోఫీలియా'. ఏదైనా చిన్న దెబ్బ తగలగానే రక్తస్రావం జరగడం అందరికీ అనుభవమే. కొందరిలో ఎలాంటి దెబ్బ తగలకపోయినా అంతర్గతంగా రక్తస్రావం అవుతుంది. ఈ రక్తస్రావం ఒక్కోసారి ప్రాణాంతకమూ కావచ్చు. ఈ రక్తస్రావ రుగ్మతలనే 'బ్లీడింగ్‌ డిజార్డర్స్‌' అంటారు. ఇందులో హీమోఫీలియా అనేదే అత్యంత తీవ్రమైన పరిస్థితి.

హీమో ఫీలియా వ్యాధి గ్రస్తులలో ఆగకుండా రక్తస్రావం జరగటం. శరీరంపై  రక్తం పేరుకుపోయినట్లుగా నీలం రంగు మచ్చలు ( ఎక్కిమోటిక్‌ ప్యాచెస్‌)కన్పిస్తాయి. సూది మొన లాంటి, ఎర్రని చిన్న చిన్న మచ్చలు శరీరంపై అక్కడక్కడా ఉంటాయి.తెగిన గాయం ఎంత చిన్నది అయినా ఆగకుండా రక్తం కారుతూ ఉంటుంది.  టీకా వేయించినప్పుడు ఆ ప్రాంతంలో చర్మం కింద రక్తం గడ్డకట్టి నల్లగా కనిపిస్తుంది.కొంతమంది పిల్లల్లో టీకా, ఇంజక్షన్‌ వేసిన చోట రక్తస్రావం మొదలై ఆగదు.ముక్కు నుంచి రక్తస్రావం (ఎపిస్టాసిస్‌) అవుతూ ఉంటుంది.

జింజివైటిస్‌ లాంటి చిగుళ్లవ్యాధి లేకపోయినా, బ్రష్‌ తగలకపోయినా చిగుళ్ల నుంచి ఆగకుండా రక్తం కారుతుంటుంది. ఏదైనా శస్త్రచికిత్స చేసినప్పుడు రక్తస్రావం ఆగదు.

హీమోఫీలియా వ్యాధికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఇది జెనిటిక్‌ వ్యాధుల విభాగంలో అత్యంత ప్రమాదమైనదిగా భావిస్తున్నారు. మేనరికం పెళ్లిళ్లు చాలా వరకూ ఇలాంటి వ్యాధులకు కారణమౌతున్నాయి.జన్యు పరమైన అస్తవ్యస్థత వలన రక్తస్రావానికి సంబంధించిన హీమోఫీలియా లాంటి వ్యాధులు వస్తాయి. అందులో ప్రధానమైనవి ప్లేట్‌లెట్‌ ఫంక్షన్‌ డిజార్డర్స్‌. ఇదేకాకుండా ఫ్యాక్టర్‌1, ఫ్యాక్టర్‌ 2 లోపం కూడా మేనరికం వల్లనే సంక్రమిస్తుంది. వీళ్లకు పుట్టిన పిల్లల్లో రక్తం గడ్డకట్టించాల్సిన ప్రక్రియ సరిగా జరగదు. ఇది హీమోఫీలియాకు దారితీస్తుంది.

  హీమోఫీలియాలో అనేక రకాలున్నా ఇందులో హీమోఫీలియా-ఏ అనేది 75 శాతం మందిలో కనిపించే ఎక్కువగా విసృతంగా ఉన్న జబ్బు. ప్రతి 5000 మందిలో ఒకరికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

హీమోఫీలియా-ఏ , హీమోఫీలియా-బి అన్న జబ్బులు మానవ జన్యువుల్లో ఎక్స్‌ క్రోమోజోమ్‌తో ముడిపడి ఉంటాయి.కేవలం జన్యుపరమైన లోపాల కారణంగానే కాకుండా, అంతర్గతంగా చేసుకునే వివాహాల వల్లనే కాకుండా, దాదాపు 30 శాతం కేసుల్లో జన్యుమార్పులు (మ్యూటేషన్స్‌) వల్ల కూడా ఇది వస్తోంది.

హీమోఫీలియాను నిర్ధారించడానికి వ్యాధి లక్షణాలతో పాటు అనేక ఇతర విషయాలను కూడా పరిశీలిస్తారు. చర్మాన్నీ, చిగుళ్లనూ పరిశీలిస్తారు. శరీరంపైన గాయాలను పరీక్షిస్తారు. 2 మి.మీ. కంటే తక్కువ పరిమాణంలో ఉండే మచ్చలను పరిశీలిస్తారు. కంట్లో రక్తస్రావం అయ్యిందేమో చూడటానికి 'ఫండస్‌' పరీక్ష చేస్తారు. కీళ్లల్లో రక్తస్రావం అయ్యిందేమోనని కూడా కొన్నిసార్లు పరిశీలిస్తారు. అవసరాన్ని బట్టి మలద్వారాన్ని పరీక్షిస్తారు. ఎఫ్‌బీసీ, బ్లడ్‌ ఫిల్మ్‌, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ అనే పరీక్షల వల్ల ఒక్కోసారి ల్యూకేమియా, లింఫోమా లేదా థ్రాంబోసైటోపీనియా లేదా అబ్‌నార్మల్‌ ప్లేట్‌లెట్స్‌ వంటి కండిషన్స్‌ ఉన్నాయేమో తెలుస్తుంది.

కాలేయం పనితీరు తెలుసుకునే ఎల్‌ఎఫ్‌టీ పరీక్షలు చేస్తారు. అనేక దశల్లో రక్తం గడ్డకట్టే తీరును తెలుసుకునే వైద్య పరీక్షలు ప్రోథ్రాంబిన్‌ టైమ్‌, 'యాక్టివేటెడ్‌ పార్షియల్‌ థ్రాంబోప్లాస్టిన్‌ టైమ్‌ వంటివి చేస్తారు. ఐసోలేటెడ్‌ అబ్‌నార్మల్‌ ఏపీటీటీ ఉంటే హీమో జబ్బులను నిర్ధారిస్తారు. ఎనిమిది, తొమ్మిది ఫ్యాక్టర్ల పరీక్ష కోసం ప్రత్యేకంగా నిర్దిష్టమైన పరీక్షలు ఉన్నాయి. వీటివల్ల హీమోఫీిలియా తీవ్రత ఎంత ఉందో అంచనా వేస్తారు. విటమిన్ కె లోపం వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చని వైద్యులు చెబుతున్నారు.అయితే ఇది అరుదైన వ్యాధి. అందరికి రాదు. ఏది ఏమైనా ఆగకుండా తీవ్రంగా రక్తం కారుతుంటే వెంటనే వైద్య ఆరోగ్య నిపుణులని కలవడం మంచిది.

గమనిక: ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే రాయబడింది.

Post a Comment

0 Comments