GET MORE DETAILS

అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి - నవభారత నిర్మాణ సారధి - డాక్టర్.బాబు జగజీవన్ రామ్ (ఏప్రిల్ 5 డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి)

అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి -  నవభారత నిర్మాణ సారధి - డాక్టర్.బాబు జగజీవన్ రామ్ (ఏప్రిల్ 5 డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి)



యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

దేశంలో బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే,డా. బి. ఆర్. అంబేద్కర్ ఎనలేని కృషి చేశారు. అణగారిన వర్గాల వారికి సరైన న్యాయం జరగాలంటే రాజ్యాధికారం బడుగు బలహీన వర్గాల వారి చేతుల్లో ఉండాలని అంబేద్కర్ బలంగా విశ్వసించారు. ఈ సూత్రాన్ని నమ్మి, ఆచరించిన వారిలో బాబు జగజ్జీవన్ రాం ఒకరు.అయితే సాంప్రదాయ రాజకీయ పార్టీలలో పని చేసే టప్పుడు కొన్ని పరిమితులకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది.ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు.

జగజ్జీవన్ రాం నాయకత్వం, వ్యక్తిత్వం, సేవ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు, సంస్థకు గొప్ప బలాన్ని చేకూర్చిపెట్టాయి.భారత రిపబ్లిక్‌ తొలి లోక్‌సభ (1952)లో ప్రవేశించిన జగ్జీవన్‌రామ్‌ వరుసగా ఎనిమిదిసార్లు గెలిచారు. ముప్ఫైమూడు సంవత్సరాు కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి సాగించారు.

పండిట్ నెహ్రూ నుంచి కార్యదక్షుడిగా మన్ననలను పొంది, అగ్రశ్రేణి నాయకుల్లో ఒకడుగా, భారత స్వాతంత్య్ర ఉద్యమం లోను, నవభారత నిర్మాణంలో ఉదాత్తమైన పాత్ర నిర్వహించిన బాబూ జగ్జీవన్ రామ్, 1908, ఏప్రిల్ 5న బిహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లా, చాంద్వా గ్రామంలో బసంతీదేవి, శోభిరామ్ దంపతులకు జన్మించారు. అప్పటి ఆచారాల ప్రకారం 8వ ఏటనే బాల్యవివాహం జరిగింది. ప్రాథమిక పాఠశాల విద్య ముగిసిన తర్వాత 1928లో ఆయన కాశీని వదలి కలకత్తాకు వెళ్లి అక్కడ 1931లో బిఎస్సీ డిగ్రీని పొందారు.చదువుకునే రోజుల్లో మదన్ మోహన మాలవ్యా, పండిత గోవింద వల్లభ పంత్‌లతో పరిచయం ఏర్పడింది. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత బాబూ రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి దళితుల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

1933లో భార్యా వియోగం జరగడంతో, 1935 జూన్‌ ఒకటిన కాన్పూర్‌కి చెందిన సంఘసేవకుడు డాక్టర్‌ బీర్బల్‌ కుమార్తె ఇంద్రాణిదేవితో జగ్జీవన్‌రామ్‌ వివాహం జరిగింది. ఇంద్రాణిదేవి స్వాతంత్య్ర సమరయోధురాు మాత్రమేగాక, విద్యావేత్తకూడా. స్వాతంత్య్రోద్యమ కామంతా తోడుగా పోరాడిన వీరిద్దరికీ ఇరువురు సంతానం. కుమారుడు సురేష్‌. కుమార్తె మీరా. తండ్రి జగ్జీవన్‌రామ్‌ ఆదర్శాతో కుమార్తె మీరాకుమార్‌ కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా దేశానికి సేవందించారు. 

బీహార్ రాష్ట్ర హరిజన సేవా సంఘ కార్యదర్శిగా పనిచేసారు. బీహార్‌లో భూకంపం సంభవించినప్పుడు మహాత్మాగాంధీతో పాటు జగ్జీవన్ రామ్ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు..డాక్టర్ రాజేంద్రప్రసాద్, టక్కర్ బాబాల ఆశీర్వాదంతో రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి నాటి శాసనసభకు ఎన్నికయ్యారు.

1935 ఇండియా చట్టం కింద రాష్ట్రాల్లో మంత్రివర్గాలు ఏర్పడినప్పుడు బిహార్ రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన మొదటిసారి పార్లమెంటరీ కార్యదర్శి అయ్యారు. 1937లో బిహార్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొని హజారిబాగ్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు జయప్రకాశ్ నారాయణ్‌తో పరిచయం ఏర్పడింది. 

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జగ్జీవన్ రామ్, జయప్రకాశ్ నారాయణ్‌లు బిహార్ త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్నారు. 

1946లో నెహ్రూ నాయకత్వంలో అవిభక్త భారత్‌లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో కార్మికశాఖను నిర్వహించారు. 1947లో అంతర్జాతీయ కార్మిక సమావేశంలో పాల్గొని తిరిగివస్తుండగా, బస్రా సమీపంలో ఆయన ప్రయాణం చేస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన ఆయన నెల రోజులపాటు బ్రిటీష్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. 

 1948లో హైదరాబాద్‌లో జరిగిన దళిత వర్గాల మహాసభకు ముదిగొండ లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, జగ్జీవన్ రామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1952లో నెహ్రూ మంత్రివర్గంలో తపాలాశాఖను, 1956లో రైల్వేశాఖను నిర్వహించారు. తదనంతరం వ్యవసాయశాఖ మంత్రిగా దేశంలో హరిత విప్లవానికి కారణభూతుడై ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి ‘‘భారత ఆహార సంస్థ’’  (ఎఫ్‌సిఐ), సెంట్రల్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారు.నెహ్రూ అనంతరం లాల్‌బహదూర్ శాస్ర్తీ, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో మళ్లీ కార్మిక, ఉపాధి కల్పనాశాఖలు లభించాయి. 1967లో వ్యవసాయశాఖకు మారి  వ్యవసాయశాఖను సమర్ధవంతంగా నిర్వహించారన్న పేరు సంపాదించుకున్నారు. 

కాంగ్రెస్ రెండుగా చీలినప్పుడు ఇందిరాగాంధీ పక్షాన ఉంటూ 1969లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంపికయ్యారు. తర్వాతికాలంలో ఆయన రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.1976లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి, మంత్రిపదవికి రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని స్థాపించారు. 1977 లో మొరార్జీదేశాయ్‌ ప్రధానమంత్రిగా కేంద్రంలో జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో జగ్జీవన్‌రామ్‌ కేంద్ర రక్షణ శాఖామంత్రిగా విధు నిర్వహించారు. అంతేగాక, 1979 జనవరి 24న డిప్యూటీ ప్రధానమంత్రిగా జగ్జీవన్‌రామ్‌ బాధ్యత స్వీకరించారు.

బాబూ జగ్జీవన్ రామ్ ప్రజాభిమానం కలిగిన నాయకులు.సమాజం దళిత జాతుల పట్ల అవలంభించే అంటరానితనం, వారికీ జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం జరపటానికి దళిత ప్రజలను సంఘటిత పరుస్థూ ఒక కార్యకర్తగా అయన ప్రజా జీవనంలోకి అడుగుపెట్టారు.

1930 లో గాంధీజీ సత్యాగ్రహోద్యం ఆరంభించినపుడు జగజీవన రామ్ పాల్గొన్నారు. ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. ఒకవైపు సత్యాగ్రహం, మరోవైపు దళిత సమాజ సంస్కరణ కార్యక్రమం చేపట్టారు.

 1977 మార్చి 6న గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగాన్ని వినడానికి గత 38 ఏళ్లలో ఎన్నడూ రానంతమంది జనం వచ్చారు. బాబూజీ గొప్ప వక్త. ఆయనకు ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చిసత్కరించింది.అలుపెరుగని తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానికి ఇక సెలవంటూ, 1986, జులై 6న తుదిశ్వాస విడిచారు.జీవిత మంతా దేశ సేవకు అంకితం చేసి నవ భారత నిర్మాణంలో నాల్గు దశాబ్దాలు అవిరళ కృషి చేసిన బాబూ జగజ్జీవనరాం పాత్ర చిరస్మరణీయమైనది.

సమాజంలో ఎందరో జన్మిస్తున్నారు మరియు గతిస్తూనే ఉన్నారు. కాని, కొందరు మాత్రమే, కార్యం కోసం జన్మించి, ఆ కార్యాన్ని పూర్తి చేసి, బౌతికంగా ఈ లోకానికి దూరమై, ప్రజల హృదయాలలో నిత్యమూ జీవించే ఉంటారు. వారినే కారణ జన్ములు అంటారు. ఆ కోవకు చెందిన మహానుభావుడే, భరతమాత ముద్దుబిడ్డ, నవ భారత నిర్మాణ సారధి, డాక్టర్ బాబు జగజీవన రామ్. ఆది జాంబవ వంశంలో, జాంబవ అంశతో జన్మించి, సర్వజనులను సమాన దృష్టితో చూసిన, బ్రహ్మజ్ఞాని. పరిపాలనలో దిట్ట, సుక్షత్రియ చక్రవర్తి బాబుజీ.

స్వాతంత్య్ర భారతదేశ మొదటి కార్మికశాఖ మంత్రిగా, కార్మికుల కోసం, ఎన్నో రకాల భద్రతా సౌకర్యాలు కల్పించి, ఉద్యోగులను ప్రభుత్వ బిడ్డలుగా చూసుకున్న గొప్ప మానవతా మూర్తి బాబుజి.

తపాలాశాఖ మంత్రిగా అప్పటివరకు నలభై వేలు గా ఉన్న పోస్ట్ ఆఫీస్ లను 2,20,000 పైగా పెంచి, ప్రతి ఆఫీస్ లో పోస్ట్ మాస్టర్ మరియు తపాలా ఉద్యోగి నియమించి. తపాలా ఉద్యోగికి సైకిల్, యూనిఫామ్ మరియు గొడుగు సౌకర్యం కలిపించిన మహనీయ మంత్రి బాబుజి.

విమానయానశాఖ మంత్రిగా, 18 ప్రైవేట్ విమాన సంస్థలను, ఒక్క సంతకంతో, ఎయిర్ ఇండియాగా జాతీయ కరణం చేసిన, గొప్ప సామజిక సామ్యవాది బాబుజి.

రైల్వే శాఖ మంత్రిగా, గిరిజనులు అనబడేవారు, గిరికే పరిమితం కాకుండా, అడవులలో దొరికే ఉత్పత్తులను, రైల్ ప్రయాణికులకు అమ్ముకునే విధముగా, వారికి ఉచిత పాస్ లు ఇచ్చి, సభ్యసమాజంలో కలిసిపోయే విధముగా సహరించటం జరిగింది. అదే విధముగా, రైల్వే సంస్థలలో గిరిజనులకే కాంటీన్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. రిజర్వేషన్స్ చక్కగా అమలు కావాలంటే, నియామక కమిటీ లలో ఆయావర్గాల ప్రతినిధులు ఉండేలాగా చేసిన, గొప్ప సామజిక విప్లవ వాది బాబుజి.

వ్యవసాయ శాఖ మంత్రిగా, హరిత విప్లవానికి నాంది పలికిన పితామహుడు. శాస్త్రవేత్తలతో, మీ పరిశోధన ఫలితాలు, రైతులకు మార్గదర్శికంగా ఉండాలని, నిర్దేశించిన గొప్ప పరిపాలనా శాస్త్రవేత్త. దేశంలో కొన్ని ప్రాంతా లలోనే పంట పండేది. అక్కడ రైతుల నుండి పంటను ప్రభుత్వమే సేకరించి, గోదాములలో దాచిపెట్టి (Food Corporation of India), ఆహారం కోసం అలమటిస్తుండే ప్రాంతాలలో ప్రజా పంపిణి వ్యవస్థ (Ration shop) ద్వారా, కుటుంబానికి సరిపడు ఆహార పదార్థాలను, తక్కువ రేటుకు ప్రభుత్వమే పంపిణి చేసేవారు. ఆ విధముగా ప్రజలను కరువు కాటకాల నుండి కాపాడిన అన్నదాత మన బాబుజి. 

పునరావాస శాఖ మంత్రిగా రాజుల మాన్యాలు, రాజభరణాలు రద్దుచేయించి, భూమి లేని పేదలకు భూములు పంచిపెట్టిన భూదాత మన బాబుజి. ఆ భూములకు వ్యవసాయ అవసరాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వ టానికి ముందుకు రాకపోతే, బ్యాంకులను జాతీయం చేయించి, రైతులకు రుణాలు ఇప్పించిన, ధీశాలి బాబుజి. 

రక్షణ మంత్రిగా భారతదేశం ఎల్లవేళలా గొప్పగా చెప్పుకునే విజయం, పాకిస్తాన్ తో యుద్ధం.

   ఈ తరం మరిచిన గొప్ప జాతీయవాది మన బాపూజీ

Post a Comment

0 Comments