GET MORE DETAILS

కారుందా? బాగుందా..? వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోండి

 కారుందా? బాగుందా..? వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోండి


హైదరాబాద్ పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వేపై వెళుతున్న కారు ఇంజిన్ ఒక్కసారిగా పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్  వెంటనే పక్కకు నిలిపి పరిశీలిస్తుండగానే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది.

వేసవి వచ్చేసింది. భానుడు భగ్గుమంటున్నాడు. రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా ఎండలు ఉండొచ్చని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఇప్పుడే మీ కారును సరి చూసుకోండి. తగిన జాగ్రత్తలు చేపట్టకపోతే వాహనాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, సాంకేతిక లోపాలతో మంటలు చెలరేగే అవకాశాలున్నాయి.

ఇంజిన్ వేడెక్కకుండా...

ఎండాకాలం కార్లలో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం ఇంజిన్ వేడెక్కడం. గంటల తరబడి వాహనాలు నడిపితే వైర్లు, పైపులు దెబ్బతిని మంటలు వ్యాపించే ప్రమాదముంది. ఇంజిన్ ఆయిల్ తక్కువ ఉన్నా త్వరగా వేడెక్కుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

బ్యాటరీ భద్రమేనా...?

కార్లలో బ్యాటరీ ఎక్కువగా వినియోగమయ్యే పరికరాలను అమర్చుకోకపోవడమే మంచిది. కంపెనీ నుంచి వచ్చే పరికరాలు కాకుండా బయట కొని బిగించేవి నాణ్యంగా ఉండవు. ఎండ వేడికి త్వరగా కరిగిపోయి, షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. దీంతోపాటు బయటి వేడికి కారులోని బ్యాటరీ ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోతుంది. ఈ పరిస్థితి రాకుండా ముందే చెక్ చేసుకోవాలి.

టైర్లు ఓకేనా...?

టైర్ల కండిషన్ సరిగా లేకుంటే బ్రేక్ లైనర్లు సరిగా పనిచేయక స్ట్రక్ అయి మంటలు వస్తాయి. ఇలా జరగకుండా నాణ్యత పరీక్షలు చేయించాలి. అరిగిపోతే వెంటనే మార్చుకోవాలి. సరిపడా గాలి అవసరం ఎక్కువున్నా, తక్కువున్నా ప్రమాదమే..

ఫుల్ ట్యాంక్ వద్దు:

చాలామంది ఇంధనాన్ని ట్యాంక్ నిండా నింపుతారు. సాధారణ సమయంలో ఇబ్బంది లేకున్నా... ఎండాకాలంలో పుట్యాంక్ చేయించడం వల్ల వేడికి రసాయన చర్య జరిగి పేలిపోయే ప్రమాదముంది.

ఈవీలతో మరింత జాగ్రత్త:

• బ్యాటరీ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వాహనాలు త్వరగా వేడెక్కే స్వభావం కలిగి ఉంటాయి.

• అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈవీల్లో ఎక్కువ దూరం ప్రయాణించకపోవడం ఉత్తమం.

• సాధ్యమైనంత వరకు ఈనీలు నీడలోనే పార్క్ చేయాలి. లేదంటే ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది.

• ఈవీలను ఎండలో ఉంచి ఛార్జింగ్ చేయకూడదు.

• సీఎన్జీ వాహనాలతోనూ ఎండాకాలంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సిలిండర్లలో ఏదైనా చిన్న లీకేజ్ ఏర్పడితే ఫ్యూజ్ ఎగిరిపోయేలా బీఎస్6 వాహనాల్లో సౌకర్యం ఉంది. కానీ, అలా అన్నిసార్లూ జరగకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సీఎన్ జీని ఎప్పుడూ పూర్తిగా నింపకూడదు. తరచూ హైడ్రో టెస్టింగ్ చేయించాలి.

ఏసీ ఎక్కువగా వాడుతున్నారా?

• ఇంజిన్, రేడియేటర్లలో దుమ్ము చేరడం వల్ల కూలెంట్ లో వేడి నీరు చల్లబడదు. దీంతో ఇంజిన్ త్వరగా వేడెక్కుతుంది. వేసవి ప్రారంభంలోనే ముందు జాగ్రత్తగా రేడియేటర్లను శుభ్రం చేసుకోవాలి.

• స్ప్రేలు, పెర్ఫ్యూమ్, శానిటైజర్ వంటి మండే స్వభావమున్న వస్తువులను కారులో పెట్టకూడదు. వీటికి ఎండ వేడి తగిలితే అగ్ని ప్రమాదం జరిగే అవకాశముంది.

• ఎండాకాలం కారులో ఏసీ ఎక్కువగా వాడుతుంటారు. దీంతో విద్యుత్తు సరఫరా ఎక్కువై త్వరగా వేడెక్కుతుంది. దాన్నుంచి బయటపడాలంటే కార్లను నీడలో పార్క్ చేయాలి.

• డీజిల్, పెట్రోల్ ట్యాంక్ మూతను గట్టిగా మూసేయాలి. ఎండ వేడికి అక్కడక్కడ పగుళ్లు ఏర్పడతాయి. దాని నుంచి ఇంధనం లీకయ్యే ప్రమాదముంది. సరి చూసుకోండి.

• ఇంజిన్ ఆయిల్, ట్రాన్స్ మిషన్, బ్రేక్, పవర్ స్టీరింగ్, విండ్ షీల్డ్ ఫ్లూయిడ్స్ రేడియేటర్ కూలెంట్ వంటివి కారు చల్లగా ఉండేలా చేస్తాయి. వాటి స్థాయి ఎప్పుడూ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కూలెంట్ వాటర్ కి బదులుగా సాధారణ నీరు పోసినా ప్రమాదమే.

• విద్యుత్తు వైర్లు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. రాపిడి జరిగి వైర్లు పైకి తేలే ప్రమాదముంది. వాటి నుంచి నిప్పు రవ్వలు వస్తాయి.

• వేడిగా ఉన్న కారు దగ్గర ఎట్టిపరిస్థితుల్లోనూ పొగ తాగవద్దు. ఇంధనం నింపేటప్పుడు తప్పనిసరిగా ఇంజిన్ ఆపేయాలి.

• వాహనాన్ని క్రమం తప్పకుండా. సర్వీసింగ్ చేయించాలి.

అగ్నిమాపక పరికరం ఉండాలి:

కారు కొనుగోలు చేసినప్పుడే దాదాపు అన్ని కంపెనీలు అగ్నిమాపక పరికరాన్ని యజమానులకు ఇస్తాయి. కారులో అనవసర వస్తువులను, హంగులను ఉంచుకుంటున్న యజమానులు, డ్రైవర్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే అగ్నిమాపక పరికరాన్ని మాత్రం. ఉంచుకోవడం లేదు. ఇంజిన్లో పొగలు వస్తున్నట్లు కనిపిస్తే వెంటనే పక్కన నిలిపేసి, ఇంజిన్ ఆఫ్ చేయాలి. దగ్గర్లోని అగ్నిమాపక కేంద్రానికి పోన్ చేయాలి. అగ్నిమాపక పరికరం లేకుండా సొంతంగా మంటలార్పే ప్రయత్నం చేయొద్దు.

Post a Comment

0 Comments