హోలీ పౌర్ణమి : కామదహనం - మరియు హోలీ
ఫాల్గున శుద్ధ త్రయోదశి కామదహనము, పున్నమినాడు హోలికా పూజను చేయవలెను. ఫాల్గున మాస శుద్ధ త్రయోదశి నాడు లేక ప్రదోషకాలము వరకూ
వ్యాపించిన పున్నమి రోజున 'భద్ర' కరణము రహితమైన ఆ రోజున లేదా చతుర్దశి నాడు కామదహనము, పున్నమి రోజు హోలికా పూజ చేయవలెను.
ప్రదోష వ్యాపినీ గ్రాహ్య
పూర్ణిమా ఫాల్గునీ సదా |
తస్యాం భద్రా ముఖం త్యక్త్వా
పూజ్యా హోలా నిశాముఖే ||
సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేసిన తరువాత శివుడు రుద్రుడై వీరభద్రుణ్ణి, భద్రకాళిని సృష్టించి యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి అహంకారాన్ని, గర్వాన్ని అణిచాడు.
ఒకనాడు తారకాసురుడు అనే రాక్షసుడు ఘోరతపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అయితే అప్పటికే సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేసినదనీ శివుడు భార్యాహీనుడైనాడని తెలిసి తనకు శివపుత్రుని చేత మరణం కావాలని కోరతాడు తారకాసురుడు.
భార్యావియోగంలో శివుడు మరల వేరొకరిని వివాహమాడడని, తానిక అమరుడినని భావించిన తారకుడు విజృంభించి ముల్లోకాలను జయించి దేవతలు, జనులు, ఋషులను బాధించసాగాడు.
పర్వతరాజు హిమవంతుడు, మేనాదేవి దంపతులు సంతానానికై అమ్మవారి కోసం తపస్సు చేస్తారు. వారి తపానికి మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా " నీవే మాకు పుత్రికగా రావాలి! " అని కోరతారు. సరెనన్న జగజ్జనని ఆ తరువాత పార్వతీదేవిగా హిమవంతుడికి జన్మిస్తుంది. శివుడు భార్యావియోగంతో రుద్రుడైనా మరల శాంతించి తపస్సులోకి వెళ్ళిపోతాడు. హిమవంతుని పుత్రికయైన హైమావతి చిన్ననాటి నుండే అపరశివభక్తి కలదై ఆయననే మనస్సునందు నిలుపుకొని రోజూ శివపూజ చేసేది. హిమాలయాలలో తపములో నున్న శివుడిని పూజించడానికి రోజూ వెళ్ళేది. కానీ తపములోనున్న శివుడు ఒక్కసారైనా పార్వతీదేవిని చూడడు.
ఈలోగా తారకాసురుడు పెట్టే బాధలను భరించలేని దేవతలు, నారదుడు ఇంద్రుడి వద్దకు వెళతారు. అప్పుడు అందరూ కలిసి పార్వతీ, శివుల కళ్యాణం అయితే తప్ప వారికి పుత్రుడుదయించి తారకాసురుడిని చంపగలడని తొందరగా శివపార్వతుల కళ్యాణం కోసం ప్రయత్నం చేయమని అభ్యర్థిస్తారు. నారదుని సలహా మేరకు వెంటనే ఇంద్రుడు మన్మథుడిని పిలిచి శివుడి తపస్సు భంగపరిచి పార్వతీదేవిని శివునకు దగ్గర చేయమని వారి కళ్యాణానికి బాటలు వేయమని ఆదేశిస్తాడు. శివుడి కోపాన్ని ఎరిగిన కామదేవుడు మొదట ఈ పనికి భయపడినా ఇంద్రుడి ఆజ్ఞవలన చేసేది లేక సరేనంటాడు.
తన మిత్రుడైన వసంతుడితో సహా బయలుదేడానికి సిద్ధపడతాడు. ఇదివరకే శివుడి కోపం గురించి తెలిసిన మన్మథుడి భార్య రతీదేవి మన్మథుని కార్యాన్ని ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది.కానీ ఎంత చెప్పినా మన్మథుడు వినిపించుకోడు.
వసంతుడితో సహా ఆ శివుడు తపస్సు చేసే ప్రాంతానికి చేరిన మన్మథుడు శివుడిపై పుష్పబాణాలు వేస్తాడు. ఆ బాణాలవలన శివుడు చలించి అప్పుడే పూజార్థమై వచ్చిన పార్వతీదేవిని చూసి మోహిస్తాడు. కానీ వెంటనే తేరుకుని తన తపస్సు భంగపరచినది ఎవరు అని అన్ని దిక్కులా పరికించిచూడగా ఓ మూలన భయపడుతూ కనబడతాడు మన్మథుడు. వెంటనే రుద్రుడై మూడోకన్నును తెరిచి కామదేవుడైన మన్మథుడిని భస్మం చేస్తాడు.
ఆ కాముడు భస్మమైన రోజు ఫాల్గుణ శుద్ధ చతుర్దశి అని అంటారు.
ఆ రోజు ప్రజలు కామదహనంగా జరుపుకుంటారు. తెల్లవారి హోళిపండుగగా, కాముని పున్నమిగా జరుపుకుంటారు. మరల దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించగా తిరిగి మన్మథుడిని అనంగుడిగా మారుస్తాడు శివుడు. అప్పుడు అందరూ వసంతోత్సవం జరుపుకున్నారని అదే హోళి అని అంటారు.
హోలీ : పురాణకాల పర్వం హోలీ
ఉత్తరభారతంలో హోలీని రెండు రోజుల పండగగా చేసుకుంటారు. మొదటి రోజును హోలికా దహన్ లేదా చోటీ హోలీ అని రెండో రోజును రంగ్ వాలీ హోలీ. ధులేటి , ధుళంది , ధూళి వందన్ వంటి పేర్లతో పిలుస్తారు. వీరు రెండో రోజుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దీనిని విభేదాలను మరిచి స్నేహం పెంపొందించుకునే సమయంగా కూడా భావిస్తారు. ఈ రోజు రంగులు చల్లుకోవడంలో తెలిసినవారు , కొత్తవారు అనే భేదం లేకుండా అందరినీ వర్ణ ప్లావితం చేయడం జరుగుతుంది.
హోలీ లేదా రంగుల పండుగగా మనం జరుపుకునే పండగ అసలు పేరు హోళికా పూర్ణిమ. ఇది రెండు రోజుల పండగ అయినందున కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో రెండో రోజు చేస్తారు. ఇది ఈనాడు రంగులు చల్లుకునే ఉత్సవంగానే మారిపోయింది గాని ఈ రోజున ఆచరించాల్సిన వేరే విధి విధానాలూ ఉన్నాయి , ఉదయాన్నే కట్టెలు , పిడకలు రాశిగా పోసి నిప్పును రాజేసి దానిపైకి హోళికా అనే శక్తిని అవహింపజేసి ‘శ్రీ హోళికాయైనమః’ అని పూజించి మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణం చేస్తూ ‘వందితాసి సురేంద్రేణ బ్రాహ్మణాశంకరేణచ , అతస్త్వాం పాహినో దేవి భూతే భూతి ప్రదో భవ’ అనే శ్లోకం చదవాలని పెద్దలు చెబుతారు. ఆ తర్వాతే రంగులను చల్లడం , రంగునీటితో ఉత్సవం జరుపుకోవడం చేయాలని శాస్త్త్ర వచనం.
హోలీ పండగకు సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నిప్పుల్లో పడేసి కాల్చాలనుకోవడం అందుకు ప్ర్రహ్లాదుని అత్త హోళిక పూనుకోవడం ప్రహ్లాదునితో బాటు అగ్నిలో దూకడం కథ అందరికీ తెలసిందే. అయితే ఆమె కూడా పునీతురాలైంది కనుక హోలీ రోజు ఉదయాన్నే అగ్నిని రగిల్చి ఆమెను ఆవాహన చేయడం , హోళికాయైనమః అని స్మరించే ఆచారం వచ్చిందని అంటారు. మరో పక్క హోళిక మరణించిన తిథి ఇదే అయినందున ఈ రోజు హోలీ పండగ చేసుకుంటారని అంటారు. ఈ మంటనే చెడుపై మంచి విజయంగా కొందరు అభివర్ణిస్తారు. హోళిక చెడుకు సంకేతమని అగ్నిజ్ఞానాగ్ని అని వారి భావన.
ఉత్తర భారతంలో కృష్ణుడు పెరిగిన ప్రదేశంగా భావించే వ్రజభూమిలో మరో కథ ప్రచారంలో ఉంది. కృష్ణుడు నల్లగా ఉండడం , రాధ ఇతరులు తెల్లగా ఉండడం చూసి వారిని ఈ ఒక్క రోజు రంగులుల పూసుకుని నల్లగా మారాలని కోరాడని భావిస్తారు.
ఈ రంగులు , రంగు నీరు చల్లుకోవడంతో బాటు నృత్యగానాదులతో ఊరేగింపులు నిర్వహించడం , దీనిలో పానీయాలు అందించడం కూడా జరుగుతూంటుంది. కొన్ని ప్రాంతాల్లో భంగు కలిపిన పానీయాలు తాగి మైమరచిపోతుంటారు. హిందువుల ప్రాచీన పండగ అయిన హోలీని దక్షిణాసియాలోని చాలా ప్రాంతాల్లో హిందుయేతరులు సరదా పండగగా కూడా చేసుకుంటూంటారు.
ముఖ్యంగా భారత్ , నేపాల్ , ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో హిందువులు ఉన్న తావుల్లో జరుపుకోవడం జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఈ పండగను యూరప్ , అమెరికాల్లో సైతం నిర్వహిస్తున్నారు. అక్కడ ఈ పండగను వసంత రుతువులో వచ్చే రంగుల పండగగా అక్కడి భారతీయులు భావిస్తారు. అంతేకాక ఈ రోజు ఇతర దేశాల వారి పండగలు ఉండడంతో ఇది వాటితో కలిసి అంతర్జాతీయ పండగగా పేరు పొందింది.
0 Comments