హరే కృష్ణ అంటే ఏంటి ?
మనం తరచూ భగవంతుడియొక్క ఈ నామాన్ని వింటూ ఉంటాం. హరే కృష్ణ అంటే కేవలం ఏదో ఒక మతం వాళ్ళకో, ఒక సంస్థకో, కొంతమంది భక్తులకో సంబంధించినది కాదు. కలియుగంలో సమస్త మానవాళిని ఉద్దరించేసే భగవానుడియొక్క దివ్య మంత్రం.
ఇద్దరు భక్తులు కలిసినపుడు ఒకరినొకరు ‘హరే కృష్ణ’ అంటూ పిలుచుకుంటూ ఉండటం సాధారణంగా చూస్తూ ఉంటాం. అసలు హరే కృష్ణ అంటే ఏంటో ఒకసారి చూద్దాం.
’హరి’ అంటే తేలికైన అర్ధం ఏంటంటే ఎటువంటి పాపములనైనా, ఎటువంటి దోషములనైనా హరించగలిగినవాడు,
’కృష్ణ’ అంటే భగవంతుడు, సర్వ జగన్నియామకుడు. ‘క్రిష్’ అంటే అనిర్వచనీయమైన ఆనందం (మోక్షం), అటువంటి మోక్షాన్ని ప్రసాదింపగలవాడు కాబట్టి ఆయన్ని ‘కృష్ణ’ అంటారు.
సృష్టిలో కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. కానీ ‘పంచమహా పాతకాలు’ అంటే బ్రాహ్మణ హత్య, బంగారం దొంగతనం చెయ్యటం, మందు తాగడంలాంటి మహా పాతకాలులాంటి వాటికి ప్రాయశ్చిత్త కర్మలు లేవు.
యోగి అయినా, జ్ఞాని అయినా, ఎంతటి గొప్పవారైనా ఆ ప్రారబ్ధ కర్మలు మాత్రం అనుభవించవలసిందే.
సృష్టిమొత్తం మీద అలా పోగొట్టగల నామం ఏదైనా ఉంది అంటే అది కేవలం ‘కృష్ణ’ నామం మాత్రమే, కృష్ణ కథలు మాత్రమే! అందుకే ప్రత్యేకంగా భాగవతాన్ని తీసుకొనివచ్చారు వ్యాసులవారు.
కలియుగంలో కేవలం ‘భాగవతం’ చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన, కృష్ణ నామం స్మరించినంత మాత్రాన పంచ మహాపాతకాలే కాదు సమస్త పాపరాశి ధ్వంసమై కృష్ణలోకమైన మోక్షాన్ని చేరుకుంటారు.
చాలామంది భక్తులు రోజుకి కొన్ని వేలసార్లు కృష్ణ నామం పారాయణం చేస్తూ ఉంటారు. జననమరణ చక్రం అనే సంసార సముద్రంలో నావ వంటిది ‘హరే కృష్ణ’ నామం.
"కోట్లజన్మల తర్వాత ఏ ఒక్కడో మాయాపూరితమైన జగత్తుని వదిలి నన్నే స్మరించుకుంటూ నాకు దాసుడవుతున్నాడు. అటువంటి వాడియొక్క యోగక్షేమాలు నేనే వహిస్తున్నాను” అని భగవద్గితలో(7.19) కృష్ణుడు మనకి అభయం ఇచ్చారు.
అలా ఆ పరాత్పరుడియొక్క ‘హరేకృష్ణ’ నామాన్ని ప్రతిరోజు స్మరించుకోవడం మన జన్మజన్మాంతరంగా కలిగిన అదృష్టం.
అందునా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ‘సోషల్ మీడియా’ ద్వారా ఆధ్యాత్మిక గ్రూపులలో ప్రతిరోజూ కృష్ణ నామాన్ని స్మరించుకోవటం, కృష్ణుని చిత్రపటాలని చూడటం కూడా ఆధ్యాత్మికతలో, భక్తిలో ఒక భాగమే. ప్రతిరోజు క్రింద ఉన్న కృష్ణ మంత్రాన్ని స్మరించుకోవడం ఉత్తమం.
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే (108 సార్లు)
కర్మఫలితంగా ఎటువంటి ఆపదలు మనల్ని, మనకుటుంబ సభ్యులను బాధించకుండా ఉండాలని, కృష్ణపరమాత్మ మనల్ని అనుగ్రహించాలని ఆయన పాదపద్మములను నమస్కరిస్తూ...
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - లోకా సమస్తా సుఖినోభవన్తు!
.jpeg)
0 Comments