ఏలినాటి శని ఎన్నేళ్లు వుంటుంది. పరిహారం ఏంటి ?
సమస్త ప్రాణకోటి పాపకర్మల ఫలాన్ని వెనువెంటనే కలిగించే దేవుడు శనీశ్వరుడు.
జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శని భగవానుడు యమధర్మరాజుకు అగ్రజుడు.
ఇద్దరూ న్యాయాధిపతులే. అయినా వీరిలో ఈ లోకంలోని జీవుల పాపపుణ్యాలను బట్టీ ఇక్కడే దోషాలను పరిహరించే బాధ్యతను నిర్వర్తిస్తున్న శనికి విశిష్ట స్థానం ఉంది.
ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు వుంటుంది. ఏలినాటిని ఏడునాడు అని కూడా అంటారు. నాడు అంటే అర్ధభాగం అని అర్థం. జాతకచక్రంలో 12 రాశులుంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది.
12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ప్రవేశిస్తుంది.
ఒక్కోస్థానంలో శని రెండున్నర సంవత్సరాలు వుంటాడు. దీంతో మొత్తంగా ఏడున్నర సంవత్సరాలు శని వుంటాడని అర్థం.
శని పాపగ్రహం అందుకనే కష్టాలు కలుగుతాయి.
ఈ గ్రహం మన రాశిలో వున్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, ఒక వేళ వచ్చినా వెళ్లిపోవడం, మంచిస్థానం నుంచి అథమస్థానానికి వెళ్లిపోవడం... తదితరాలు జరుగుతాయి. శని మన రాశిలో ప్రవేశించినా కొన్ని మంచిపనులు చేసేందుకు దోహదం చేస్తాడు. ఉదాహరణకు వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి. అయితే వీటి వెనుక చాలా ఇబ్బందులు వుంటాయి. వివాహం జరిగితే చాలా ఖర్చవుతుంది.
అలాగే ఇంటి నిర్మాణం పూర్తి చేయడమో లేక ఇంటిని కొనుగోలు చేస్తే అనంతరం ఆర్థిక వనరులకు కటకట ఏర్పడుతుంది.
ఒక ఉద్యోగి ఇంటిని కొనుగోలు చేస్తే అతడి నెల జీతం నుంచి నెలవారీగా వాయిదాలు కట్టవలసివుంటుంది. దీంతో జీతం తగ్గుతుంది. అందుకనే ఇల్లుకట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు.
ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఇలా మన జాతకంలో ఏ దోష ప్రభావం ఉన్నా దానినుంచి కొంత ఉపశమనం పొందాలంటే శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందడమే ఏకైక మార్గం. ఇందుకోసం శాస్త్రాల్లో పేర్కొన్న చిన్నపాటి తరుణోపాయాలను తప్పక పాటించాలి. ప్రతి శనివారం శనిదేవుడిని ఆరాధించడం, నవ గ్రహాల్లో ఆయన విగ్రహం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చేయాలి. శనివారంతోపాటు త్రయోదశి, అమావాస్య కలసివచ్చినప్పుడు శనీశ్వరుడిని తప్పక ఆరాధించాలి. పరమేశ్వరుడి పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. పక్షులకు ఆహారం వేయాలి.
ముఖ్యంగా కాకులకు ఆహారం పెడితే మంచిది. యాచకులకూ వికలాంగులకూ పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు. ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించడం మంచిది.
.jpeg)
0 Comments