భారతదేశంలో రూపాయి నోటు ఆవిర్భవించి 104 సంవత్సరాలు పూర్తయింది.
భారతదేశంలో రూపాయి నోటు ఆవిర్భవించి 104 సంవత్సరాలు పూర్తయింది. తొలి రూపాయి నోటు నవంబరు 30, 1917 తేదీన కింగ్ జార్జి 5 చక్రవర్తిగా ఉన్నప్పుడు భారతదేశంలో చెలామణీలోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రారంభం కాకపోవడంతో.. కేవలం గవర్నమెంటు ఆఫ్ ఇండియా పేరు మీదే ఆ నోటు వాడుకలోకి వచ్చింది. ఈ క్రమంలో రూపాయి నోటుకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
1917లో తొలిసారిగా రూపాయి నోటు వాడుకలోకి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో నాణెములను ముద్రించడం టంకశాలకు కష్టమవడంతో.. ప్రత్యమ్నాయం కోసం బ్రిటీష్ ప్రభుత్వం ఆలోచించి పేపర్ కరెన్సీ ముద్రించడానికి శ్రీకారం చుట్టింది.
అయితే 1926లో మళ్లీ నోట్లను రద్దుచేసి, నాణెముల వైపు మొగ్గు చూపింది బ్రిటీష్ ప్రభుత్వం. తిరిగి 1940లో నోట్ల ముద్రణ ప్రారంభించింది. 1940లో ఆ విధంగా పూర్తిస్థాయిలో వాడుకలోకి వచ్చిన రూపాయి నోటు స్వాతంత్య్రం వచ్చాక కూడా చెలామణీ అయ్యింది. 1994లో తొలిసారిగా రూపాయి నోట్ల ముద్రణను ఆపేశారు. తిరిగి 2015లో మళ్లీ ముద్రించడం ప్రారంభించారు.
రూపాయి నోటుకి ఒక ప్రత్యేకత ఉంది.. అదేంటో మీకు తెలుసా..దానిపై ఆర్బీఐ గవర్నరు సంతకం పెట్టరు. కేవలం ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం మాత్రమే నోటుపై ఉంటుంది.
తొలిసారిగా భారత్‌లో రూపాయి నాణెములు చెలామణీలోకి వచ్చాక.. వాటిని వెండితో తయారుచేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వెండి ఖరీదు విపరీతంగా పెరగడం కూడా.. పేపర్ కరెన్సీ వాడుకలోకి రావడానికి కారణమైందని చరిత్రకారులు చెబుతున్నారు.
ఇప్పటికి రూపాయి నోటు అనేక డిజైన్లు మారింది. పలు మార్పులకు కూడా నోచుకుంది.
0 Comments