GET MORE DETAILS

కార్తీక పురాణం - 14 : : కార్తీక పురాణము - పదునాల్గవ అధ్యాయము

కార్తీక పురాణం - 14 : : కార్తీక పురాణము - పదునాల్గవ అధ్యాయము
కార్తీక పూర్ణిమాదినమందు వృషోత్సర్గమును(ఆబోతు, అచ్చుపోయుట) చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీకవ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది. కార్తీక పూర్ణిమనాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును జేయువానికి కోటిమారులు గయాశ్రాద్ధమును జేసిన ఫలముగలుగును. రాజా! స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తీక పూర్ణిమనాడు నల్లని గిత్తను, గిత్తదూడను లేక ఆబోతును విడుచునా, అట్లయిన మనము తృప్తిబొందుదుమని కోరుచుందురు. ధనవంతుడుగాని, దరిద్రుడుగాని కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయనివాడు యమలోకమందు అంథతమిస్రమను నరకమును బొందును. కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయక గయాశ్రాద్ధ మాచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, హాలయము పెట్టినను పితరులకు తృప్తిలేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయుట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి. కాబట్టి కార్తీకపూర్ణిమనాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పనియేమున్నది? కార్తీకమాసమందు అన్ని పుణ్యములకంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవఋణ మనుష్యఋణ పితృ ఋణములనుండి విముక్తుడగును. ఈరోజు దక్షిణతో గూడ ధాత్రీఫలమును(ఉసిరి) దానమిచ్చువాడు సార్వభౌముడగును. అనగా భూమికి ప్రభువగును. కార్తీకపూర్ణిమనాడు దీపదానమాచరించువాడు విగతపాపుడై పరమపదము నొందును. దీపదానమాచరించువాని మనోవాక్కాయ కృతపాపములన్నియు నశించును. ఈరోజు ఈశ్వర లింగదానమాచరించువాడు ఈజన్మమందు అనేక భోగములననుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అగును. ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తీకమాసమందు లింగానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు. (ఈశ్వరలింగము - బాణము). కార్తీకవ్రతము అనంత ఫలప్రదము. సామాన్యముగ దొరకనిది. కనుక కార్తీకమాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృశేషమును, తినగూడని వస్తువులను భక్షించు, శ్రాద్ధాన్నమును సేవించుట అనగా భోక్తగానుండుట, తిలదానము గ్రహించుట ఈఅయిదును విడువవలెను. కార్తీకమాసమందు సంఘాన్నమును, శూద్రాన్నమును, దేవార్చకులయన్నమును, అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును విథవాన్నమును భుజించరాదు. కార్తీకమాసమున అమావాస్యయందును, పూర్ణిమయందును, పితృదినమందును, ఆదివారమందును, సూర్ చంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు. కార్తీక ఏకాదశినాడు రాత్రింబగళ్ళును, వ్యతీపాత వైధృతి మొదలైన నిషిద్ధ దినములందును జ్రాత్రి భుజించరాదు. అప్పుడు చాయానక్తమును జేయవలెను గాని రాత్రి భోజనము చేయగూడదు. చాయానక్తమే రాత్రి భోజనఫలమిచ్చును. కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీకవ్రతము చేయువాడు చాయా నక్తమునే గ్రహించవలెను. చాయానక్తమనగా తన శరీరము కొలతము రెట్టింపునీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడు యతి విధవలకు చాయనక్తము విహితము. సమస్త పుణ్యములను యిచ్చు కార్తీకమాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములగును. ఆపాపవిస్తారము నేనెట్లు చెప్పగలను. చెప్పుటకు కూడా అశక్తుడను. కాబట్టి విచారించి కార్తీకవ్రతమును ఆచరించవలెను. కార్తీకమామందు ౧. తలంటుకొనుట ౨. పగలునిద్రయు, ౩. కంచుపాత్రలో భోజనము, ౪. మఠాన్న భోజనము, ౫. గృహమందు స్నానము, ౬. నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, ౭. వేదశాస్త్ర నింద యీ ఏడునూ జరుపగూడదు. తలంటుకొనుట-తైలాభ్యంగము.

ఈమాసమందు శరీర సామర్ధ్యముండియు, గృహమందు ఉష్ణోదక స్నానమాచరించినయెడల ఆస్నానము కల్లుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తులయందు రవియుండగా కార్తీకమాసమందు నదీస్నానము ఖ్యము. సర్వశ్రేష్ఠము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీస్నానమే చేయవలెను. అట్లు నదియుండనిచో తటాకమందుగాని, కాలువలయందుగాని, బావులవద్దగాని స్నానము చేయవలెను. తటాక కూపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలెను. ఇది గంగయందును, గోదావరియందును, మహానదులయందును అవసరము. (లేక) గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాకస్నానము కర్తవ్యము. గంగకు నమస్కరించవలెను. కార్తీకమాసము ప్రాతస్నానమాచరించి వాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను. పగలు చేద్యదగిన వ్యాపారములన్నియు చేసికొని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోను, ఫలోదకములతోను, కుశోదకముతోను మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోను పూజించవలెను. తరువాత శంకరుని ఆవాహనము చేయవలెను. శంకరాయ ఆవాహనము సమర్పయామి తరువాత ౨.వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి, ౩. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి, ౪. లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి, ౫. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి ౬. గంగాధరాయ స్నానం సమర్పయామి. ౭.ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి ౮. జగన్నాధాయ ఉపవీతం సమర్పయామి ౯. క


పాలధరిణే గంధం సమర్పయామి. ౧౦. ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి. ౧౧. పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి. ౧౨. తేజోరూపాయ దీపం సమర్పయామి ౧౩. లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి. ౧౪. లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి ౧౫. భవాయ ప్రదక్షిణం సమర్పయామి. ౧౬. కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను. పైనజెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు

శ్లో!! పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంఘ్రి పంకజః!

అర్ఘ్యం గృహాణ దైత్యారేదత్తంచేదముమాపతే!!

అను మంత్రముతో అర్ఘ్యము నివ్వవలెను. ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును. సంశయము లేదు. రాజా! తనశక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈప్రకారము కార్తీకమాసమంతయు బ్రాహ్మణులతో గూడి నక్తవ్రతమును జేయువాడు వేయి సోమయాగమును, నూరు వాజపేయయాగములు, వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలమును బొందును. కార్తీకమాసమునందీ ప్రకారముగా మాస నక్తవ్రతమాచరించు వాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్తవ్రతము వలన పుణ్యమధికమగును. సమస్త పాపములు నశించును. ఇందుకు సందేహము లేదు. చతుర్దశియందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును బెట్టిన యెడల పితరులందరు తృప్తినొందుదురు. కార్తీకమాసమున శుక్ల చతుర్దశినాడు ఫలదానమాచరించువాని సంతతికి విచ్ఛేము గలుగదు. సందేహము లేదు. చతుర్దశినాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించు వాడు కైలాసమునకు ప్రభువగును. సమస్తపాపములను బోగొట్టునదియు, సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయిన కార్తీకవ్రతమును జేయువాడు విగతపాపుడై మోక్షమొందును. పవిత్రకరమైన యీ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తమును జేసుకొన్న వారగుదురు.


ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే చతుర్దశాధ్యాయస్సమాప్తః


ఓం నమఃశివాయ

Post a Comment

0 Comments