GET MORE DETAILS

ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట...!!

 ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట...!!





సాధారణంగా స్నానం చేసే సబ్బు ఖరీదు ఎంత ఉంటుంది. మహా అయితే రూ. 30, 40 ఉంటుంది. మరీ ఖరీదైంది ఐతే వంద రూపాయలు ఉంటుంది. ఐతే ఈ సబ్బు ఖరీదు వందలు కాదు వేలు అస్సలే కాదు ఏకంగా లక్షల్లో ఉంటుందట. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బట కూడా! స్నానం చేసే సబ్బే కదా.. ఏమైనా బంగారంతో తయారు చేశారా? ఎందుకంత ఖరీదని అనుకుంటున్నారా! అవును.. ఇది మామూలు సబ్బు కాదు.. నిజంగానే బంగారంతో తయారు చేస్తారు. ఆ విశేషాలు తెలుసుకుందాం..


ఎక్కడా తయారు చేస్తారంటే...


లెబానోన్‌లోని ట్రిపోలీకి చెందిన ఒక కుటుంబం నడిపే సబ్బుల ఫ్యాక్టరీలో ఈ విధమైన సబ్బులు తయారవుతున్నాయి. 15వ శతాబ్ధం నుంచి ఈ విధమైన సబ్బులు వడకంలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఐతే 2013 లో ఈ ఖరీదైన సబ్బులను మొదట తయారు చేశారు. దీనిని ఖతార్ అధ్యక్షుడి భార్యకు బహుమతిగా ఇచ్చినట్లు మీడియా నివేదికలు తెలుపుతున్నాయి. ఈ లగ్జరీ సబ్బు పేరు ‘ఖాన్‌ అల్‌ సబౌన్‌’ సోస్‌. బాడర్‌ హసీన్‌ అండ్‌ సన్స్‌ కంపెనీ కేవలం చేతులతోనే ఈ సబ్బులను తయారు చేస్తుందట. ప్రత్యేకమైన నూనెలు, సహజ సువాసనలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడంలో ఈ కంపెనీ ప్రసిద్ధి. ఈ కంపెనీ ఉత్పత్తులు కేవలం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రత్యేక షాపుల్లో మాత్రమే అమ్ముతారు.


బంగారం, వజ్రాల పొడితో తయారీ...


ఈ ఖరీదైన సబ్బుకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఒక ఖాన్‌ అల్‌ సబౌన్‌ సబ్బు తయారీకి 17 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, 3 గ్రాముల వజ్రాల పౌడర్‌లో సహజమైన నూనెలు, సహజసిద్ధమైన తేనె, ఖర్జూరం కలిపి తయారు చేస్తారట. చూడ్డానికి అచ్చం జున్ను ముక్కలా ఉంటుందీ లగ్జరీ సబ్బు. దీని ధర కూడా చుక్కల్లో ఉంటుంది. ఒక సబ్బు ఖరీదు అక్షరాల 2 లక్షల 7 వేల రూపాయలు. 


ఈ సబ్బు ప్రత్యేకత అదే...


ఈ సబ్బు వాడిన వారికి ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కలుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉంది. ఐతే దీనిని రుజువుచేసే ఆధారాలేవీ లేవు. అంత ఖరీదైన సబ్బు వాడేవారు కూడా ఉంటారా? అని అనుకుంటే పొరపాటే. ముఖ్యమైన విఐపీలు, సెలబ్రెటీలు మాత్రమే వీటిని వాడుతారట. ముఖ్యంగా దుబాయ్‌లో నివసించే సంపన్న కుటుంబాలు ఎక్కువగా ఈ సబ్బులను వాడుతారు.


ఆ మధ్య ఖరీదైన వాటర్‌ బాటిల్‌ ధర రూ. 45 లక్షల రూపాయలని విన్నాం. ఇప్పుడు రెండున్నర లక్షల స్నానం సబ్బు.. రోజూ వాడే మామూలు వస్తువులకు కూడా ఇంత ధర పలుకుతుందంటే నమ్మలేకపోతున్నాం కదా!

Post a Comment

0 Comments