తిరుమల ఆలయంలో ధృవబేరం అంటే ఏమిటి ?
ఈ దివ్య తిరుపతి స్థలమలందు మా శేవకుండయిన శెట్టి వల్లభసెట్టి కుమారుడు పాపిసెట్టింన్ని అధికారము నెట్టి మేము యర్రందిరుమలరాజయ్యదేవ మహారాజులుం గారికి పుణ్యముగాను సేయించిన శేవలు కోనేరు దేవుళాము మండప్రాకారాలు గోపురాలు పంచ్ఛభేరవిగ్రహాలు దివ్యాభరణములు తేరు మొదలైన దశవాహనాలు.
(SII IV 709)
పై 1486 ACE నాటి శాసనం ప్రకారం దివ్యతిరుపతిలో యర్రం తిరుమల దేవమహారాయలకు పుణ్యం కలగాలని శెట్టివల్లభశెట్టి కుమారుడైన పాపిశెట్టి కోనేరు త్రవ్వించి, దేవాలయానికి మండపాలు గోపురాలునిర్మించి పంచభేరవిగ్రహాలు, దివ్యాభరణాలు పదిరకాలైన ఉత్సవ వాహనాలను ఏర్పాటు చేశాడు.
ధృవబేరం, కౌతుకబేరం, బలిబేరం, స్నపనబేరం, ఉత్సవబేరం ఈ ఐదింటిని కలిపి పంచబేర విగ్రహాలు అంటారు.
(1) ధృవబేరమంటే దేవాలయంలోని మూలవిగ్రహం. ఈ విగ్రహం స్థిరంగా వుంటుంది. ఒకసారి ప్రతిష్టించిన తరువాత కదల్చటానికి వీలులేదు. రోజంతా జరిగే దర్శనాలు ఈ దృవబేరానికే జరుగుతాయి.614 వ సంవత్సరం నాటికే ఈ దృవబేరం వెలసివున్న గర్భగుడి (ఆనందనిలయం) జీర్ణోద్దారణను సామవై అనే పల్లవరాణి పూర్తి చేసింది.
(2) కౌతుకబేరం -- రోజువారి దేవదేవుడికి జరిగే పూజలన్ని ఈ దేవుడికే చేయడం జరుగుతుంది. దీపదూప నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. తిరుమలలో ఈ విగ్రహన్ని పల్లవరాణి సామవై ప్రతిష్టించింది.
(3) బలిబేరం -- ఇదికూడా శ్రీవారి విగ్రహమే. 14 వ శతాబ్దివరకు బలిబేరాన్ని తిరుమల ఆలయంలో ఉత్సవానికి మాత్రమే ఉపయోగించేవారు. ఇదో వెండివిగ్రహం.అన్ని విధాల మూలవిరాట్టును పోలివుంటుంది. ఇపుడు ఉత్సవ విగ్రహం కాదు.
(4) స్నపనభేరము -- ఉగ్ర శ్రీనివాసమూర్తినే స్నపన మూర్తిగా కీర్తిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన ఉగ్ర శ్రీనివాసుడు ఏడాకి ఒక్క రోజు మాత్రమే ఆలయం వీడి బయటకు వస్తాడు. ఇవి పంచలోహ విగ్రహాలు. పూర్వం ఉత్సవాలలో ఈ మూర్తులను ఊరేగించేవారు. 14వ శతాబ్ధంలో బ్రహ్మోత్సవ సందర్భంగా కొన్ని విపరీత సంఘటనలు జరిగినందువల్ల ఉగ్ర శ్రీనివాసమూర్తుల ఊరేగింపును ఆపివేశారు. అయితే, కార్తికమాసంలో వచ్చే కైశిక ద్వాదశినాడు ఉదయత్పూర్వం ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపుగా బయటవచ్చి సూర్యోదయానికి ముందే ఆలయానికి చేరుకుంటాడు.
ఉత్సవ బేరం - మలయప్పస్వామిని ఉత్సవమూర్తిగా పిలుస్తారు. కల్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణసేవ, వారోత్సవం, మాసోత్సవం, వార్షికోత్సవాలలో భక్తులకు దర్శనమిచ్చేది మలయప్పస్వామే. ఉగ్రశ్రీనివాసమూర్తి తరువాత ఉత్సవాలలో శ్రీదేవి, భూదేవి సమేతంగా పాల్గొనే మలయప్పస్వామి పంచలోహ విగ్రహాలు మలయప్పకోనలో లభించినందు వల్ల ఈమూర్తికి మలయప్పస్వామని పేరు వచ్చిందంటారు. 1339లో ఈ మూర్తుల ప్రస్తావన వెలుగుచూసింది.
పురాతన వైష్ణవక్షేత్రాలన్నింటిలోనూ పంచభేర విగ్రహాలు వుండేవి.
0 Comments