GET MORE DETAILS

దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు...! _ వెల్లడించిన నెదర్లాండ్స్‌ అధికారులు

 💥 దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు...! _ వెల్లడించిన నెదర్లాండ్స్‌ అధికారులు




ఆమ్‌స్టర్‌డామ్‌: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన దేశాలు.. మళ్లీ ప్రయాణ ఆంక్షల బాటపట్టాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో ప్రయాణికులకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు బయటపడుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 

దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ బయటపడగానే నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. అయితే అప్పటికే దక్షిణాఫ్రికా నుంచి బయల్దేరిన విమానాలను మాత్రం అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే ఆ ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు, క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దక్షిణాఫ్రికా నుంచి రెండు విమనాలు ఆమ్‌స్టర్‌డామ్‌కు చేరుకోగా.. అందులోని ప్రయాణికులకు వైరస్‌ పరీక్షలు నిర్వహించారు. అందులో 61 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డచ్‌ ఆరోగ్య అధికారులు వెల్లడించారు. అయితే వీరికి సోకింది ఒమిక్రాన్‌ వేరియంటా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. ఇందుకోసం వీరి రక్తనమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. 

ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిఫోల్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన రెండు విమానాల్లో దాదాపు 600 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 61 కేసులు బయటపడగా.. ఇంకా కొందరి ఫలితాలు రావాల్సి ఉంది. పాజిటివ్‌ వచ్చిన ప్రయాణికులను షిఫోల్‌లోని ఓ హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వీరికి సోకింది ఒమిక్రాన్‌ వేరియంటా లేదా అన్నది తెలుసుకునేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. 

ఓవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ బయటపడటం కలకలం సృష్టిస్తోంది. దీనిలోకి అధిక మ్యుటేషన్ల కారణంగా వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతుండటంతో మరో ఉద్ధృతికి కారణమవ్వొచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన దేశాలు.. మళ్లీ ఆంక్షల బాట పట్టాయి. దక్షిణాఫ్రికా సహా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాల రాకపోకలపై కొన్ని దేశాలు నిషేధం విధించాయి.

Post a Comment

0 Comments