GET MORE DETAILS

రాష్ట్రంలో మరో ఉద్యోగుల సంఘం ఆవిర్భావం : : బెజవాడలో ఏపీ జీఈఎస్‌ ఆవిర్భావ సభ

 రాష్ట్రంలో మరో ఉద్యోగుల సంఘం ఆవిర్భావం : : బెజవాడలో ఏపీ జీఈఎస్‌ ఆవిర్భావ సభ




అధ్యక్షుడిగా రాజారావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు


 రాష్ట్రంలో మరో ఉద్యోగ సంఘం ఆవిర్భవించింది. విజయవాడ వేదికగా ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ (ఏపీ జీఈఎస్‌) ఏర్పాటైంది. సంఘ ఆవిర్భావ సమావేశానికి 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం ఎంపికైంది. అధ్యక్షుడిగా వినుకొండ రాజారావు, ప్రధాన కార్యదర్శిగా కొండపల్లి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అనంతరం అధ్యక్షుడు వినుకొండ రాజారావు మాట్లాడుతూ గత రెండున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుతం ఉన్న నాలుగు సంఘాలు చొరవ చూపలేదన్నారు. ఉద్యోగుల హక్కులను ఈ సంఘాల నాయకులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా, ఓడీల కోసం, తమ సొంత అజెండాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. వారు ఉద్యోగుల ప్రతినిధులుగా కాకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు సంఘాలను ప్రశ్నించటానికే తాము కొత్తగా ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం తమ సంఘం కృషి చేస్తుందన్నారు. సీపీఎస్‌ రద్దు జగన్మోహనరెడ్డి మానసపుత్రిక అని, దీనిని వెంటనే అమలు చేయాలన్నారు. పీఆర్‌సీని తక్షణం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

Post a Comment

0 Comments