GET MORE DETAILS

విదేశీ భాషలు.. విశేష అవకాశాలు....!

 విదేశీ భాషలు.. విశేష అవకాశాలు....!
ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారికి ఉన్న దారుల్లో విదేశీ భాషలూ పరిగణించదగినవే. వివిధ సంస్థలు యూజీ స్థాయిలో వీటిని అందిస్తున్నాయి. ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులకూ అవకాశం ఉంది. యూజీ తర్వాత పీజీ, ఆపై పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు లేదా ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. వీటిని పూర్తిచేసుకున్నవారికి ఎన్నో రంగాలు, విభాగాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. నియామకాల్లో విదేశీ భాషలు వచ్చినవారికి కొంత ప్రాధాన్యమూ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌ తర్వాత నేర్చుకోదగ్గ విదేశీ భాషలు, కోర్సులు, అవకాశాల వివరాలు తెలుసుకుందాం!

ఇంటర్‌ తర్వాత విదేశీ భాషల్లో చేరడానికి చాలా మార్గాలున్నాయి. దేశంలో పలు విశ్వవిద్యాలయాలు తమ ప్రాంగణాల్లో ఆనర్స్‌ విధానంలో బీఏ ఫారిన్‌ లాంగ్వేజ్‌ కోర్సులు అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు అందించే సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరి అనంతరం డిప్లొమా, ఆ తర్వాత అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా పూర్తిచేసుకోవచ్చు. లేదా డిగ్రీలోని మూడు ఐచ్ఛిక సబ్జెక్టుల్లో ఒకటిగా నచ్చిన విదేశీ భాషను ఎంచుకునే అవకాశం ఉంది. యూజీలో రెండో భాషగా ఫారిన్‌ లాంగ్వేజ్‌ తీసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన విధానంలో వీటిని నేర్చుకోవచ్చు.

విశ్వవిద్యాలయాల్లో బీఏ ఆనర్స్‌ కోర్సులో చేరినవాళ్లు మూడేళ్ల పాటు సంబంధిత భాషకు చెందిన అంశాలు నేర్చుకుంటారు. ఈ విధానంలో ఇంగ్లిష్‌ మినహా, ఇతర ఏ సబ్జెక్టులూ ఉండవు. విదేశీ భాష నుంచి ఆంగ్లంలోకి అనువాదం చేయడం, ఆ భాషకు చెందిన వ్యాకరణం, రచనలు మొదలైనవి తెలుసుకుంటారు. ఆ భాష చరిత్ర, సాహిత్యాలను అధ్యయనం చేస్తారు. ముందుగా ఆయా భాషల్లో వినడం, చదవడం, మాట్లాడడం, రాయడాన్ని నేర్పుతారు. ఆ భాషకు చెందిన దేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలపైనా అవగాహన కల్పిస్తారు. యూజీ పూర్తయిన తర్వాత పీజీ, ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ పూర్తిచేసుకోవచ్చు. ఎక్కువ విశ్వవిద్యాలయాలు పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అందిస్తున్నాయి. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో యూజీ ఆనర్స్‌ కోర్సుల్లో ప్రవేశాలుంటాయి. ఇందులో జీకే, ఇంగ్లిష్, ఆ భాషకు సంబంధించిన ప్రాథమికాంశాలపై ఆబ్జెక్టివ్‌తోపాటు డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు వస్తాయి.  


"భాష నేర్చుకోవడంలో పుస్తకాల పాత్ర కొంతవరకే. అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ ఆ భాషలో మాట్లాడడానికి ప్రయత్నించాలి. కుదిరితే ఆ భాషపై పట్టున్న స్థానికులతో ఎక్కువగా సంభాషించాలి. ఆ భాషలో వీలైనన్ని ఉపన్యాసాలు వినాలి. సినిమాలు చూడాలి, వార్తలు వినాలి"

ఎంపిక ఇలా...

ఏ భాష అంటే ఆసక్తి, భవిష్యత్తులో ఏ దేశంలో ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటున్నారు లేదా సేవలు అందించాలనుకుంటున్నారు, ఏ భాషకు భారత్‌ లేదా ఇతర దేశాల్లో ఎక్కువ డిమాండ్‌ ఉంది, అందుబాటులోని విద్యా సంస్థల్లో నేర్పుతున్నవి...తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని విదేశీ భాషను ఎంచుకోవచ్చు. ఉన్నత విద్య నిమిత్తం జర్మనీ వెళ్లాలనుకున్నవారు జర్మన్‌ భాషను నేర్చుకోవడం వల్ల ఆ దేశంలో భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చు. జపాన్‌లో ఉద్యోగం చేయడం లక్ష్యమైతే జపనీస్‌ నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. లేదా ఏదైనా దేశ సంస్కృతి, వ్యవహారాలపై ఇష్టం ఉంటే అక్కడి స్థానిక భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి.


పట్టు కోసం...

భారత్‌లో ఇంగ్లిష్‌ ఆధారంగా విదేశీ భాషలను నేర్పుతున్నారు. అందువల్ల ముందుగా ఆంగ్లంపై పట్టు సాధించాలి. భాష నేర్చుకోవడంలో పుస్తకాల పాత్ర కొంతవరకే. అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ ఆ భాషలో మాట్లాడడానికి ప్రయత్నించాలి. కుదిరితే ఆ భాషపై పట్టున్న స్థానికులతో ఎక్కువగా సంభాషించాలి. ఆ భాషలో వీలైనన్ని ఉపన్యాసాలు వినాలి. సినిమాలు చూడాలి, వార్తలు వినాలి. ఇందుకు సోషల్‌ మీడియాను వేదికగా మలచుకోవచ్చు. కొంత ప్రావీణ్యం పొందిన తర్వాత ఆ భాషకు సంబంధించిన వార్తా పత్రికలు, మ్యాగజీన్లు, నవలలు...ఇలా వేటినైనా బాగా చదవాలి. ఏదైనా భాషను నేర్చుకోవడానికి వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం..ఈ నాలుగే ప్రామాణికం.


ఉపాధి అవకాశాల సంగతి ?

విదేశీ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రభుత్వ రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, ఆతిథ్య, పర్యాటక రంగాలు, ప్రజా సంబంధ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. బహుళ జాతి కంపెనీలు విస్తరించడంతో సాఫ్ట్‌వేర్, బీపీవో, కేపీవో, ఎల్‌పీవో, మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌...ఇలా ప్రతి విభాగంలోనూ విదేశీ భాషలతో అవసరం ఏర్పడింది. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ఏదో ఒక భాషలో నైపుణ్యం పెంచుకుని సుస్థిర కొలువును సొంతం చేసుకోవచ్చు. ప్రావీణ్యం పొందితే ఆన్‌లైన్‌ వేదికగా ఇంట్లో ఉంటూనే ఉపాధి పొందవచ్చు.

💠 ఏదైనా పర భాషపై పట్టున్నవారు విదేశాల నుంచి వచ్చే అతిథులకు గైడ్‌గా వ్యవహరించవచ్చు. ప్రభుత్వాలకు చెందిన విదేశీ కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు, విదేశీ మంత్రిత్వ శాఖలు, ఐక్యరాజ్యసమితి విభాగాలు, వివిధ సంస్థల కేంద్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. స్థానిక భాషపై పట్టున్నవారికి ఇలాంటి చోట్ల అవకాశాలుంటాయి.

💠 పుస్తకాలు, యూజర్‌ మాన్యువళ్లు, కీలక సమాచారం ఒక భాష నుంచి ఇంకో భాషలోకి తర్జుమా చేసేవారు పెద్దమొత్తంలో సంపాదిస్తున్నారు. హైస్కూల్‌ స్థాయిలో ప్రైవేటు పాఠశాలల్లో సిలబస్‌తో సంబంధం లేకుండా ఏదో ఒక విదేశీ భాషను విద్యార్థులకు నేర్పుతున్నారు.

అలాగే ఫారిన్‌ లాంగ్వేజ్‌లు నేర్పే శిక్షణ సంస్థలు పెరుగుతున్నాయి. ప్రముఖ విశ్వవిద్యాలయాలన్నింట్లోనూ ఏదో ఒక విదేశీ భాష అందుబాటులో ఉంది. ఎన్నో డిగ్రీ కళాశాలలు విదేశీ భాషలను అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో బోధకులుగా అవకాశాలు లభిస్తాయి. ఇంటర్‌ప్రిటర్లుగా వ్యవహరించడం ద్వారానూ డబ్బు సంపాదించుకోవచ్చు.

సంస్థలు.. కోర్సులు :

💠 ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌: విదేశీ భాషల్లో చదువులు అందించే లక్ష్యంతో ఈ విశ్వవిద్యాలయం నెలకొల్పారు. ఇక్కడ యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో కోర్సులు అందిస్తున్నారు. ఈ సంస్థకు హైదరాబాద్‌ తోపాటు లఖ్‌నవూ, షిల్లాంగ్‌ల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌ క్యాంపస్‌లో బీఏ (ఆనర్స్‌) విధానంలో అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్, స్పానిష్‌ కోర్సులను ఇఫ్లూ అందిస్తోంది. పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశాలు ఉంటాయి. పార్ట్‌టైమ్‌ విధానంలో ఉదయం, సాయంత్రం వేళల్లో అరబిక్, ఫ్రెంచ్, ఇటాలియన్, కొరియన్, జపనీస్, పర్షియన్, స్పానిష్‌ భాషలను సర్టిఫికెట్, డిప్లొమా స్థాయుల్లో ఇక్కడ అందిస్తున్నారు.

💠 ఉస్మానియా యూనివర్సిటీ: ఇంటర్‌ విద్యార్హతతో ఫ్రెంచ్, జర్మన్, రష్యన్‌ భాషల్లో ఏడాది వ్యవధితో జూనియర్‌ డిప్లొమా కోర్సులను ఓయూ అందిస్తోంది. ఇవే భాషల్లో ఏడాది వ్యవధితో సీనియర్‌ డిప్లొమా కోర్సులూ నడుపుతోంది. వీటికి జూనియర్‌ డిప్లొమా పూర్తిచేసినవారు అర్హులు. అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులనూ ఏడాది వ్యవధితో ఇక్కడ పూర్తిచేసుకోవచ్చు. వీటికి సీనియర్‌ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. జూనియర్‌ డిప్లొమాలో మోడర్న్‌ అరబిక్, పర్షియన్‌ కోర్సులూ ఉన్నాయి.

💠 జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ: బీఏలో జపనీస్, కొరియన్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, స్పానిష్, అరబిక్, పర్షియన్‌ భాషలను అందిస్తోంది.  

💠 జామియా మిల్లియా ఇస్లామియా: ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆనర్స్‌ విధానంలో బీఏ కొరియన్‌ లాంగ్వేజెస్, అరబిక్, ఇస్లామిక్‌ స్టడీ, పర్షియన్‌ భాషలు చదువుకోవచ్చు. 

💠 దిల్లీ యూనివర్సిటీ: ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, అరబిక్, పర్షియన్, స్పానిష్‌ భాషలను బీఏ ఆనర్స్‌ విధానంలో అందిస్తోంది.  

💠 ఆంధ్రా యూనివర్సిటీ: ఫ్రెంచ్‌లో డిప్లొమా, సీనియర్‌ డిప్లొమా కోర్సులు నడుపుతోంది.

💠 మణిపాల్‌ యూనివర్సిటీ: బీఏ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ అండ్‌ ఇంటర్‌ కల్చరల్‌ స్టడీస్‌ కోర్సు అందిస్తోంది. ఇందులో చేరినవారు ఫ్రెంచ్‌ లేదా జర్మన్‌ స్పెషలైజేషన్‌గా తీసుకోవచ్చు. అలాగే స్పానిష్, ఇటాలియన్, జపనీస్‌లో ఏదో ఒకటి రెండో లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు.

💠 ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం: అరబిక్, ఫ్రెంచ్, రష్యన్, కొరియన్, స్పానిష్, జర్మన్‌లో సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తోంది.

💠 కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సీయూసెట్‌ ద్వారా బీఏలో చైనీస్, జర్మన్‌ స్టడీస్, కొరియన్‌ భాషల్లో చేరడానికి అవకాశం కల్పిస్తున్నాయి.

💠 అమిటి యూనివర్సిటీ ఆనర్స్‌ విధానంలో బీఏ ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్‌ కోర్సులు నడుపుతోంది.

అకడమిక్స్‌తో సంబంధం లేకుండా బయట నుంచీ విదేశీ భాషను నేర్చుకోవచ్చు. వివిధ సంస్థలు ఈ తరహా శిక్షణ ఇస్తున్నాయి. రామకృష్ణ మఠం, హైదరాబాద్‌లో నామమాత్రపు రుసుములతో జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్‌ భాషలను ప్రాథమిక స్థాయి నుంచి చివరిదశ వరకు నేర్చుకోవచ్చు. భాషల వారీ కొన్ని పేరొందిన సంస్థలూ ఉన్నాయి. వాటిలో ఎవరైనా చేరవచ్చు.

Post a Comment

0 Comments