GET MORE DETAILS

బొబ్బిలి సంస్థానం

 బొబ్బిలి సంస్థానంబొబ్బిలి ఒకప్పటి చారిత్మ్రాతక సంస్థానం. ఫ్రెంచి పాలనలో ఒక సంస్థానంగా వెలుగొందిన బొబ్బిలికి పొరుగు రాజ్యం విజయనగరంతో నిత్య శత్రుత్వం ఉండేది. ఈ శత్రుత్వం ముదిరి బొబ్బిలికీ, ఫ్రెంచి, విజయనగర సంయుక్త సైన్యానికీ మధ్య మహా యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో జరిగిన మారణకాండ, బొబ్బిలి వీరుల వీరమరణాలు, బొబ్బిలి స్త్రీల ఆత్మాహుతి.. చరిత్రలో ఆ సంస్థానానికి గొప్ప వీరోచిత స్థానాన్నీ కల్పించాయి.


ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి ఈశాన్యంగా 120 కిలోమీటర్ల దూరంలో విజయనగరం జిల్లాలోని ఒక పట్టణమే బొబ్బిలి. ఒకప్పటి ఈ సంస్థానాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో కవిటి, బొబ్బిలి, రాజాం, సీతానగరం అనే నాలుగు ఠాణాలుగా విభజించారు. ఒక్కొక్క ఠాణా ఒక్కొక్క అమీను అధికారం కింద పర్యవేక్షణలో ఉండేది. 2002 గ్రామాలు (జిరాయితీ), 70 అగ్రహారాలు, 6 మొఖాసా గ్రామాలు ఈ సంస్థానంలో భాగంగా ఉండేవి. బొబ్బిలి సంస్థానాధీశులైన రావు వారు రాచకొండ పాలకులు. వీరిది రేచర్ల గోత్రం. ఇనుగంటి, చింతపట్ల, చెలికాని, తాండ్ర, దామెర ఇంటిపేర్లుగా కలిగిన వెలమ దొరలు ఈ బొబ్బిలి పాలక కుటుంబంతో నెయ్యం, వియ్యం కలిగి ఉన్నారు. వేంకటగిరి వారికి, బొబ్బిలి వారికి మూలపురుషులు ఒక్కరే.పద్మానాయకులలో పదిహేనో తరానికి చెందిన నిర్వాణ రాయప్పనాయుడు (నిర్వాణప్పనాయుడు) నేటి కర్నూలులోని వెలుగోడు రాజ్యాన్ని స్థాపించినట్లు (మన చరిత్ర - 45)లో చదువుకున్నాం. ఈయనకే పెద్దరాయుడు అనే పేరు కూడా ఉంది. కొందరు బొబ్బిలికి మూలపురుషుడు రాజాధర్మారావు అని రాశారు. పెద్దరాయుడు మూలపురుషుడని కార్మికేలు, హంటరు మొదలైన వారు అంగీకరించినట్లు.. ఈ విషయం బొబ్బిలి వారి వంశావళిలోనూ ఉన్నట్లు ఆంధ్ర సంస్థానములు ః సాహిత్యపోషణము అనే గ్రంథంలో డా. తూమాటి దొణప్ప రాశారు. దీనిని బట్టి, పెద్దరాయుడు అనే నామాంతరం గల నిర్వాణప్పనాయుడే బొబ్బిలి వంశానికి మూలపురుషుడు అని తెలుస్తున్నది. ఇతడు వేంకటగిరి సంస్థానంలో విఖ్యాతుడైన యాచశూరు (యాచమనాయుడు)ని ఎనిమిది మంది కొడుకుల్లో పెద్దవాడు. క్రీ.శ. 1652లో మొఘల్ బాద్‌షా సేనానిగా కళింగ దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు షేర్ మహమ్మద్ ఖాన్ వచ్చాడు. ఇతడు ఆనాటి చికాకోలు నవాబు. ఈ షేర్‌ఖాన్ కళింగ సీమపై దాడి చేసినప్పుడు ఇతనికి పెదరాయుడప్ప సహాయం చేశాడు. ఇందుకు సంతోషించిన మొఘల్ బాద్‌షా షేర్‌ఖాన్ ద్వారా రాయుడప్పకు రాజాం ఎస్టేటును ప్రసాదించాడు. రాయుడప్ప ఈ ఎస్టేటులో కోట కట్టి దానికి తన ప్రభువు షేర్ ఖాన్ పేరు పెట్టుకున్నాడు. షేర్ అంటే బెబ్బులి.. అదే రానురాను బొబ్బిలి అయింది. రాయుడప్పనాయని కుమారుడు లింగప్పనాయుడు. బొబ్బిలి కోట నిర్మాత ఇతడేనని కొందరు చరిత్రకారులు చెబుతారు. తన తండ్రి కాలంలోనే లింగప్పకు ఢంకా నగారా, నౌబత్ శ్వేతచ్ఛత్రం, రాజా బిరుదం.. వంటి రాజలాంఛనాలు ఉన్నాయి.


లింగప్పనాయుడు మహా విక్రముడు. ఇతడు మొఘల్ బాద్‌షాకు, చికాకోలు నవాబుకు తలలో నాలుకలా మెలిగేవాడట. షేర్‌ఖాన్ కుమారుడు వేటకు వెళ్లిన సందర్భంలో తిరుగుబాటుదారులు ఎవరో అతణ్ని ఎత్తుకుని పోయి బంధించారు. నవాబు ఆదేశానుసారం లింగప్పనాయుడు పలాసా నుంచి శ్రీకాకుళం వరకు గల మన్యం ప్రాంతాన్నంతటినీ గాలించి రంగవాక వద్ద నవాబు కొడుకు ఆచూకీ కనిపెట్టాడు. ఇక్కడ లింగప్పనాయుడు తిరుగుబాటుదారులతో యుద్ధం చేసి వారిని చెరబట్టాడు. ఈ యుద్ధాన్నే రంగవాక యుద్ధం అంటారు. కొడుకును బంధీ నుంచి విడిపించినందుకు ప్రతిఫలంగా నవాబు షేర్‌ఖాన్ లింగప్పనాయునికి పన్నెండు గ్రామాలను బహుమతిగా ఇచ్చాడట. ఈ రంగవాక యుద్ధ విజయం గురించి, అందులో లింగప్పనాయుడు చూపిన పరాక్రమం గురించీ నవాబు బాద్‌షాకు లేఖ రాశాడు. ఇందుకు బాద్‌షా మెచ్చి నౌబత్, పల్లకీ, దివిటీలతోపాటు రంగరావు అనే బిరుదు, రాజా బహదూర్ అనే లాంఛనాలతో ఫర్మానా జారీ చేశాడట. ఇక అప్పటి నుంచే బొబ్బిలి రావు వారు.. రంగరావులై చిరకీర్తి పొందారు. లింగప్ప.. లింగప్ప రంగరాయలయ్యారు.

లింగప్ప రంగరావుకు సంతానం లేకపోవడం వల్ల వేంకటగిరి సంస్థానం వారైన మాధవరాయుని మూడో కుమారుడైన వెంగళరావుని దత్తత తీసుకున్నారు. బొబ్బిలి పాలకులలో ఈ వెంగళరావు మూడోతరం వారు. వెంగళరావు చిన్న వయసులో ఉన్నప్పుడే తనను దత్తత తీసుకున్న తండ్రి మరణించారు. దీంతో కొంతకాలం తన కన్నతండ్రి మాధవరావు, ఇంకొంత కాలం పెద్దన్న పద్మారావు, మరికొంత కాలం రెండో అన్న నారప్పరావు.. బొబ్బిలి సంస్థాన వ్యవహారాలను చక్కదిద్దారు. వెంగళరావుకు రంగపతి రంగారావు, పెద జనార్దనరావు అనే ఇద్దరు కుమారులున్నారు. జనార్దనరావు లక్కవరపు కోటను సంపాదించి పాలించారు. రంగపతి రంగారావు కుమారులు రాజా రాయుడప్ప రంగారావు. ఈయన తన తండ్రి మరణించే నాటికి చాలా చిన్నవాడు. దీంతో తన అన్న రాజా వెంకటపతి రంగారావు (లక్కవరపు కోట పాలకుడు, బాబాయి అయిన రాజా పెద జనార్దన రంగారావు కుమారుడు) కొంత కాలం ఎస్టేటు వ్యవహారాలను పర్యవేక్షించారు. అటు తర్వాత రాయుడప్ప రంగారావే రాజ్య పాలన చేశారు. వీరికి సంతానం లేకపోవడం వల్ల రాజా గోపాలకృష్ణ రంగారావు బహద్దూర్‌ని దత్తత తీసుకున్నారు. వీరు బొబ్బిలి వారి పూర్వపు దాయాదులు, పాల్తేరు వాస్తవ్యులు అయిన రావు గోపాలరావు పెద్ద కుమారుడు. గోపాలకృష్ణ రంగారావు భార్య మల్లమ దేవి. ఈమె కసింకోట వాస్తవ్యులు చెలికాని వెంకయాంబ, రామరాయల పుత్రిక. ఈమె చెల్లెలు జగ్గమాంబ. ఈవిడ పిఠాపురం పాలకులైన రావు నీలాద్రిరావు (క్రీ.శ. 1730-1776) సతీమణి.


18వ శతాబ్ది మధ్యకాలంలో బొబ్బిలి సంస్థానాధీశునిగా ఉన్న రాజా గోపాలకృష్ణ రంగారావుకు, విజయనగర రాజు పూసపాటి పెద విజయరామరాజుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. కాకతీయ సామ్రాజ్యానంతరం పద్మనాయకుల ప్రాబల్యం తెలుగునాట అంతకంతకూ పెరుగసాగింది. దీన్ని అంతకు ముందు రాజబంధువులుగా, సామంతులుగా ఉన్న కొందరు సోమ వంశ క్షత్రియులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో విజయవాడ దుర్గాధీశుడైన పూసపాటి మాధవవర్మ నాయకత్వంలో జల్లిపల్లి మహా సంగ్రామం (మన చరిత్ర -36, 37) జరిగింది. ఈ రణరంగంలో పరాజితులైన పూసపాటి వారు అనంతరం కళింగ సామ్రాజ్యాన్ని ఆశ్రయించారు. వారి సామంతులుగా తమ రాజధానిని విజయవాడ నుంచి విజయనగరానికి మార్చుకున్నారు. జల్లిపల్లి యుద్ధంలో వంశపు పగలు పొగలు కక్కుతూ ఐదు వందల ఏండ్ల వరకూ అగ్నిజ్వాలలను రగిల్చాయి. రావు వారు బొబ్బిలి సంస్థానాన్ని స్థాపించినా.. పూసపాటి వారు విజయనగరాన్ని ఏలుతున్నా.. పూర్వపు వైషమ్యాలను మాత్రం వీడలేదు. బొబ్బిలి వారిని ఎదుర్కొనడం విజయనగర రాజుల తరం కాలేదు. అంత బలం, బలగం వారికి లేకుండా పోయాయి. కానీ, ఎప్పటికైనా తమ పక్కలో బల్లెంలా ఉన్న బొబ్బిలి వారిని వెళ్లగొట్టి ఆ సంస్థానాన్ని ఆక్రమించుకోవాలని విజయనగరం వారికి ఆశగా ఉండేది. కానీ ఆ ఆశ వారికి ఆడియాశగానే మిగిలిపోసాగింది. ఈ నేపథ్యంలో వారెప్పుడూ అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉండేవారు. 18వ శతాబ్దంలో విజయరామరాజు కాలంలో వారికొక అవకాశం వచ్చింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఫ్రెంచి కమాండర్ ఇన్ చీఫ్ బుస్సీ చెంత చేరాడు విజయరామారావు. బొబ్బిలి వారిని ఒంటరిగా ఎదుర్కొలేక వారిపై లేనిపోని చాడీలు చెప్పి బుస్సీని బొబ్బిలి వారిపైకి ఉసిగొల్పాడు. ఈ పర్యవసానాలే బొబ్బిలి యుద్ధానికి దారి తీశాయి. భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని సంఘటనలను ఆవిష్కరించిన తీవ్ర యుద్ధం అది. అనేక జానపద గాథలకు ప్రాణం పోసిన బీభత్స కాండ ఈ యుద్ధంలో జరిగింది.

Post a Comment

0 Comments