Ads Area

శ్లోకపఠనానికీ సమయాలున్నాయి

0

 శ్లోకపఠనానికీ సమయాలున్నాయి



సనాతన ధర్మంలో కొన్ని కర్మలకు కొన్ని సమయాలను నిర్దేశించారు. ఉదాహరణకు త్రికాల సంధ్యావందనం.

ఇది ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలాలలో చేయవలసినది. ఇక కొన్ని వ్రతాలు సాయంకాల సమయంలో చేయడం శ్రేష్ఠం. దానికి ఉదాహరణ సత్యనారాయణ వ్రతం. ఇది ఉదయం కూడా చేయవచ్చు. ఇక పండగలలో శివరాత్రి నాటి అర్చనలు ముఖ్యంగా రాత్రి ప్రధానమైనవి.

కారణం లింగోద్భవకాలం అర్ధరాత్రి కావడమే. ఇలా వేర్వేరు కాలాలలో చేసే కర్మలున్నాయి. సాధారణంగా ఎక్కువ అష్టోత్తర, సహస్రనామాల ఫలశృతిలో ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే అని ఉంటుంది. అనగా భగవంతుడిని ఉదయాన్నే స్మరించడం వల్లదుఃఖాలు నాశనమై సుఖాలు లభిస్తాయని శాస్త్ర వచనం. జ్యోతిషశాస్త్ర ప్రకారం పూజలు, జపతపాదులు స్నానానంతరం శుచిగా చేయాలి.

శుచిగా లేకుండా నిద్ర లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకోకుండా పూజలు చేస్తే పుణ్యం రాదు సరి కదా పాపం సంక్రమిస్తుందని పెద్దలు చెబుతారు. అయితే కొన్ని నామాలను, శ్లోకాలను పక్కదిగక ముందే పఠించాలని శాస్త్రం చెబుతోంది. ఈ శ్లోకాలను పఠించడానికి స్నానం అనివార్యం కాదు. లేవగానే భూమిపై కాలు పెట్టడానికి ముందు భూదేవిని క్షమాపణ కోరాలి.

అలాంటప్పుడు పక్క మీదే ఆ శ్లోకం చదవాలి. సందర్భాన్ని బట్టి చదివే శ్లోకాలు కొన్ని ఉంటాయి. వాటికి స్నానం కుదరదు. కొంత శుచిగా ఉంటే చాలు. ప్రయాణంలో భద్రత కోసం చదివే శ్లోకం బయలుదేరే ముందు చదవాలి, చోర బాధ లేకుండా చదువుకోడానికి ఉద్దేశించిన కార్తవీర్యార్జున శ్లోకం రాత్రి పడుకునే ముందు చదవాలి.

సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో నిద్రించకూడదనేది సాధారణ నియమం. సూర్యోదయం అయ్యాక నిద్రలేచేవారు మందబుద్ధులవుతారని, అందువల్ల వీలున్న అందరూ సూర్యోదయానికి ముందు వచ్చే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలని శాస్త్ర నిర్దేశం. నిద్రలేస్తూనే ఈ మూడు శ్లోకాలను పఠించడం ఉత్తమం. అవి

ఒకటవ శ్లోకం:

'బ్రహ్మ మురారి త్రిపురాతంకారీభాను శశి భూమిసుతో బుధశ్చ 

గురుశ్చ శుక్ర శనిః రాహ కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్'

దీని అర్ధం హే! బ్రహ్మ విష్ణు శివ సూర్య చంద్ర మంగళ, బుధ బృహస్పతి శుక్ర రాహుకేతాది దేవతలారా! నామీద దయ ఉంచండి. నా జీవితాన్ని మంగళమయం చేయండి అని. ఈ శ్లోకం చదవడం వల్లసమస్త దేవతలు, నవగ్రహాల కృప ఉంటుందని, శుభాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.

రెండవ శ్లోకం:

రెండవ శ్లోకాన్ని నిద్రలేస్తూనే కుడి అరచేతిని కళ్ళు తెరచి చూస్తూ చదవాలి. అది ఎక్కువ మందికి తెలిసిన శ్లోకమే.

కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి,

కర మూలేతు గోవింద: ప్రభాతే కర దర్శనమ్

దీని అర్ధం అరచేయి పైభాగంలో లక్ష్మి, మధ్యభాగంలో సరస్వతి, కింది భాగంలో గోవిందుడు నివసిస్తాడని, వారికి నమస్కారమని, ఈ శ్లోకం చదివి రెండు అరచేతులను రాపిడి చేసుకుని ఆ అరచేతులను కళ్ళకు అద్దుకోవాలి. అరచేతుల రాపిడి వలన వేడి పుడుతుంది. ఆ వేడి కనులారా హృదయానికి చేరుకుంటుంది.

మూడవ శ్లోకం:

సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే

విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

దీని అర్థం సముద్రాలు వస్త్రంగా పర్వతాలే వక్షస్థలంగా గల ఓ విష్ణుపత్నీ (భూమి కూడా విష్ణువుకు పత్ని) నీపై పాదాలు పెట్టాల్సి వస్తోంది క్షమించు అని. మనం భూమిని మాతగా పరిగణిస్తాం. భూ మాత అంటాం. చిన్నప్పుడు తల్లిని తొక్కినట్లే దినమంతా భూమాతను కాళ్ళతో తొక్కి, ఇంకా అనేక విధాలుగా అపవిత్రం చేస్తాం. అందుకే మంచం దిగుతూనే భూమిని స్పృశించి వందనం చేసి, గత్యంతరం లేక నేను చేసే ఈ తప్పులను క్షమించమని ప్రార్థించడం సంప్రదాయం.

ఈ మూడు శ్లోకాలు నిద్రలేస్తూనే చేయవలసినవి కాబట్టి స్నానం చేయడం సాధ్యం కాదు. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. వేద మంత్రాలను, బీజాక్షర మంత్రాలను సరైన గురువు నుంచి గ్రహించి నిష్టగా జపించాలి.

ఇటువంటి అధిక నిష్ఠనియమాలు శ్లోక పఠనానికి, దివ్య నామాల స్మరణకు అవసరం లేదు. ఆ నామాలను తెలుసుకుని అనుషిస్తే ధన్యులమ వుతాము. పైన పేర్కొన్న మూడు శ్లోకాలను స్నానం చేయకుండా చదవ వచ్చు. సాధారణంగా మిగతా శ్లోకాలను స్నానం చేసి శుచిగా ఉండి చదవాలి. సామాన్య శ్లోకాలు దినంలో ఎన్ని మార్లు పఠించినా దోషం లేదు.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area