GET MORE DETAILS

కొన్ని జీవులు రంగులను చూడలేవెందుకని...?

కొన్ని జీవులు రంగులను చూడలేవెందుకని...?




మనం రంగుల్ని చూడగలం. కొన్ని జంతువులు చూడలేవు. షార్కులు కూడా అంతేనని ఇటీవలి పరిశోధనలో తెలిసింది! 


ఒక్కసారి సముద్ర అంతర్భాగంలోకి వెళ్లినట్టు ఊహించుకోండి. నీలం రంగు నీటిలో ఈదుతున్న రంగురంగుల చేపలు, వింత మొక్కలు, పగడపు దీవులు అన్నీ అద్భుత దృశ్యాలే. అయితే.. ఈ అందాలన్నీ కనిపించేది మనకే. ఎందుకంటే కొన్ని జలచరాలు రంగుల్ని చూడలేవు. షార్క్‌లు కూడా అంతేనని పరిశోధకులు కొత్తగా కనుగొన్నారు. అంటే వాటికి లోకమంతా నలుపు-తెలుపు సినిమాలాంటిదేనన్నమాట. 

షార్క్‌లకు రంగులు కనపడవని మనకెలా తెలుసు? అవి నోరు విప్పి చెప్పలేవు కదా అనే సందేహం వచ్చిందా? మనుషులకైనా, జంతువులకైనా కళ్లలో రెటీనా ఉంటుందని, దాని మీద పడిన కాంతి కిరణాలను గ్రహించే వ్యవస్థ వల్ల దృశ్యాలు కనిపిస్తాయని చదువుకుని ఉంటారు. రెటీనాపై ప్రధానంగా కాంతిని గ్రహించే రెండు రకాల కణాలు ఉంటాయి. అవే రాడ్‌, కోన్‌ కణాలు.

రాడ్‌ కణాల వల్ల వస్తువుల కదలికలు, కాంతి తీవ్రతలో తేడాలు తెలిస్తే, కోన్‌ కణాల వల్ల రకరకాల రంగులు కనిపిస్తాయి. శాస్త్రవేత్తలు ఏ జంతువు రెటీనానైనా పరిశీలించి ఆయా కణాలు ఉన్నాయో లేవో చూసి వాటికి ప్రపంచం ఎలా కనిపిస్తుందో కనుగొంటారన్నమాట. 

అలా కొందరు శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియాలో దాదాపు 17 జాతుల షార్క్‌లపై పరిశోధనలు చేశారు. పది జాతుల్లో అసలు కోన్‌ కణాలే లేవు. మిగిలిన వాటిలో ఒకే రకమైన కోన్‌ కణాలు ఉన్నాయి. దీన్ని బట్టి అవి రంగుల తేడాలను గమనించలేవని తేల్చారు. 

'అవెలా చూస్తే మనకేంటట?' అనుకోకండి. ప్రపంచవ్యాప్తంగా చేపల కోసం వేసే ఎరల్లో లక్షలాది షార్క్‌లు చనిపోతున్నాయి. వాటి చూపు ఎలా ఉంటుందో తెలిస్తే వాటిని ఆకర్షించని విధంగా ఎరలను, వలలను తయారు చేసే వీలుంటుంది. దాని వల్ల వాటికి ప్రమాదం తప్పుతుంది. అలాగే సముద్రంలో డైవ్‌ చేసే వారి ఈత దుస్తుల్ని కూడా వాటిని ఆకర్షించని విధంగా రూపొందించవచ్చు. అందువల్ల మనకూ ప్రమాదం తప్పుతుంది. 


◆ కుక్కలు, పిల్లులకు ఎరుపు, ఆకుపచ్చ రంగులు కనిపించవు.

◆ ఆవులు, గేదెలు లాంటి పశువులకు లోకమంతా నలుపు-తెలుపుల్లోనే కనిపిస్తుంది.

◆ చాలా రకాల చేపలు, పక్షులు రంగుల్ని చూడగలవు.

◆ తేనెటీగలు మనకు కూడా కనిపించని అతినీలలోహిత రంగుల్ని చూడగలవు.

◆ చీమలు ఎరుపు రంగును చూడలేవు.

Post a Comment

0 Comments