GET MORE DETAILS

దేవాలయంలో విగ్రహాలు ఏ భంగిమలో వుంటాయో కొంచెంగా తెలుసుకొందాం.

 దేవాలయంలో విగ్రహాలు ఏ భంగిమలో వుంటాయో కొంచెంగా తెలుసుకొందాం.




మనం దేవాలయానికి వెళ్ళినపుడు గర్భగృహంలోవున్న ప్రధాన విగ్రహంతోపాటుగా స్తంభాలపైనా గుడికుడ్యాల (గోడల) పైనా అనేక విగ్రహాలను చూసేవుంటాం. ఒక్కో శిల్పం ఒక్కోలా వుంటుంది. కొన్నేమో నాట్యభంగిమలోను మరికొన్ని యుద్ధ, యోగాసన, వాయిద్య, సాధారణ భంగిమలలో వుంటాయి. మనకు ఈ ప్రధానవిగ్రహాలు కాని శిల్పాలుకాని సాధారణంగానే గోచరించవచ్చును. అయితే ప్రతిశిల్పం కూడా శాస్త్ర ప్రకారమే మలచిబడి వుంటుంది. 

శిల్పశాస్త్రం నిర్దేశించిన ప్రకారమే  ప్రతిశిల్పం వుంటుంది. దేవాలయంలోని మూలవిగ్రహాల భంగిమలు ఐదురకాలుగా వుంటాయి. 

అవేమిటంటే (1) స్థానకం (2) ఆసనం (3) శయనం (4) స్థానకాసనం (5) శయనాసనం.

ఆసనమంటే పీఠం (కుర్చి, సంహాసనం) అనే అర్థాలు కూడా వున్నాయి.

గమనించారో లేదో ప్రతివిగ్రహం ఏదో ఒకపీఠం పైనే ఆసీనమైవుంటుంది.

(1) నిలుచున్న విగ్రహాన్ని స్థానకమంటారు.

(2) కూర్చోనివున్నభంగిమ విగ్రహాలను ఆసనమంటారు.

(3) పడుకొనివున్న భంగిమ విగ్రహాలను శయనమంటారు.

(4) నిలబడివున్న విగ్రహంలో తల ఎదురుగాకాకుండా ప్రక్కకు చూస్తున్న భంగిమలోనున్న విగ్రహాన్ని స్థానకాసనమంటారు.

(5) పడుకొని ప్రక్కకు చూస్తున్న విగ్రహభంగిమను శయనాసనమంటారు.

విశ్వకర్మీయ శిల్పశాస్త్రప్రకారం  ఈ ఐదుభంగిమలను పంచవృత్తులని, పంచకృత్యమని పిలుస్తారు.


1. స్థానకమంటే విగ్రహం యొక్క చేతులు,రెండుపాదాలు సమంగాచాపివుంటాయి. చేతులలో ఆయుధాలు కలిగి రెండుపాదాలు సమతలంగావుంటే కూడా స్థానకభంగిమనే అంటారు. విష్ణు, చంద్రశేఖర విగ్రహాలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. రెండు పాదాలను వ్యతిరేకదిశలో వున్న విగ్రహాలను వైతస్థికస్థానభంగిమని, ఒకకాల పాదం సమంగావుండి మరోకాలిపాదం ప్రక్కకు తిరిగివుంటే అర్ధస్థికస్థానభంగిమంటారు.

చేతులను పూర్తిగా కిందికి చాపివుండి కాల్లు కూడా నిలువుగావుంటే అలాంటి విగ్రహాలను కాయోత్సర్గమంటారు. శ్రావణబెళగోళలోని గోమఠేశ్వర విగ్రహం ఇందుకు మంచి వుదాహరణగా చెప్పాలి.


(2) ఆసనవిషయానికి వస్తే ఎడమకాలు మడచి, కుడికాలును పీఠంనుండి కిందికి వదలిన విగ్రహాలను సుఖాసీనభంగిమలంటారు.

మరోకటి పద్మాసనం. పద్మాసనంలో రెండుఅరికాల్లు బయటకు కనబడేవిధంగా కాల్లురెండు ఒకదానిమీద ఒకటిగా వుండాలి.దీనినే కమలాసనమని కూడా అంటారు. అరికాల్లు కనబడకుండా కుర్చున్న భంగిమను అర్ధపద్మాసనమంటారు.

ఒకకాలును పద్మాసనంలోలాగా కాల్లను వుంచి, మరొకకాలును కాస్తా వంచి కూర్చున్న విగ్రహాన్ని మహరాజలీలాసనమంటారు. పీఠమునుండి ఒకకాలును కిందకు వదలి, మరోకాలి అరికాలు కిందకు వదలిన కాలిమోకాలిపై  వుంచి కూర్చున్న విగ్రహాలను వీరాసనమంటారు.

ఇంకా ఈ ఆసనాలలో మహారాజలీలాసనం, ఉత్కిటికాసనం, రాజలింగాసనం, యోగాసనం, స్వస్తికాసనం, గరుడాసనం అనేరకాలున్నాయి.

ఇంకా వైశాఖస్థానకం, వైష్ణవం, స్వస్తికాసనం, ప్రత్యాలీఢాసనం, ఊర్ద్వజాను, ఏకపాదస్థానకం, సమశయనాసనం, అర్ధశయనాసనం మొ॥రకాలున్నాయి.


జిబి.విశ్వనాథ.9441245857.అనంతపురం.

Post a Comment

0 Comments