GET MORE DETAILS

Free ration: ఉచిత రేషన్‌ పంపిణీ పొడిగించే ప్రతిపాదన లేదు !

 Free ration: ఉచిత రేషన్‌ పంపిణీ పొడిగించే ప్రతిపాదన లేదు !




కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ కార్యదర్శి వెల్లడి


   కరోనాతో తలెత్తిన సంక్షోభం దృష్ట్యా ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన (PMGKAY) పథకం కింద కేంద్రం దేశ ప్రజలకు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌ నుంచి మొదలైన ఈ ఉచిత పంపిణీ పథకం ఈ ఏడాది నవంబర్‌ వరకు కొనసాగనుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటున్న తరుణంలో నవంబర్‌ 30 తర్వాత ఉచిత రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని పొడిగించే ప్రతిపాదన ఇంతవరకు లేదని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. శుక్రవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, బహిరంగ మార్కెట్లో ఆహార ధాన్యాల వినియోగం, విక్రయాలు ఈ ఏడాది బాగానే ఉన్న నేపథ్యంలో పీఎంజీకేఏవైని పొడిగించే ప్రతిపాదన లేదని చెప్పారు.

   దేశంలో కరోనా విజృంభణతో గతేడాది మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ పీఎంజీకేఏవై పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత దీన్ని ఏప్రిల్‌  నుంచి జూన్‌ వరకు అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. ఆ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా ఈ ఏడాది నవంబర్‌ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఈ పథకం కింద దేశంలో దాదాపు 80 కోట్లమందికి పైగా లబ్ధిదారులకు జాతీయ ఆహారభద్రత చట్టం కింద రేషన్‌ పంపిణీ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ ఖర్చును కేంద్రమే భరిస్తూ వస్తోంది.


వంట నూనెల ధరలు తగ్గాయి

   దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు అదుపులోకి వచ్చాయని సుధాన్షు పాండే వెల్లడించారు. కేజీకి రూ.5 నుంచి రూ.20 మేర తగ్గాయని పేర్కొన్నారు. దిగుమతి సుంకం తగ్గించడం సహా కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా ధరలు తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నారు. ప్రముఖ వంట నూనె తయారీ సంస్థలు సైతం కొత్త స్టాక్‌కు తగ్గించిన ధరలనే ముద్రిస్తున్నారని పాండే తెలిపారు.

Post a Comment

0 Comments