GET MORE DETAILS

విద్యార్థులు మాస్కులు ధరించకపోతే హెచ్‌ఎంకు 1000 జరిమానా : కడప డీఈఓ ఉత్తర్వుల కలకలం, నేడు ప్రధానోపాధ్యాయుల నిరసన

 విద్యార్థులు మాస్కులు ధరించకపోతే హెచ్‌ఎంకు 1000 జరిమానా : కడప డీఈఓ ఉత్తర్వుల కలకలం, నేడు ప్రధానోపాధ్యాయుల నిరసన





 కొవిడ్‌ కేసులు పెరుగుతున్న రీత్యా పాఠశాలల్లో విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కులు పెట్టుకొని రావాలి. ఒక వేళ విద్యార్థులు మాస్కు పెట్టుకోకుండా వస్తే ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రూ.1,000 జరిమానా చెల్లించాలి’’ అంటూ కడప జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) శైలజ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఈ మేరకు ఆమె జారీ చేసిన ఉత్తర్వుల్లో... ఈ మేరకు జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని పాఠశాలల్లో 90 శాతం మంది విద్యార్థులు మాస్కులు ధరించకుండా పాఠశాలలకు వస్తున్నారని జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారుల తనిఖీలో వెల్లడయిందని పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాశాఖాధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి మాస్కులు ధరించేలా విద్యార్థులకు వివరించాలని తెలిపారు. కాగా, కొవిడ్‌ నిబంధనలు పాటించని అధికారులకు రూ.5,000, సిబ్బందికి రూ.1,000, ప్రజలకు రూ.100 జరిమానా విధిస్తామని కలెక్టర్‌ విజయరామరాజు ఇటీవల ప్రకటించారు. మరోవైపు శుక్రవారం నిరసన వ్యక్తం చేయాలంటూ హెచ్‌ఎంల సంఘం పిలుపునిచ్చింది. ‘‘అకారణంగా కడప జిల్లా ఆర్జేడీ వల్లూరు మండలం పెద్దపుట్ట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డిని సస్పెండ్‌ చేశారు. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రధానోపాధ్యాయులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలి’’ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర కౌన్సిల్‌ పిలుపునిచ్చింది. గురువారం ఈ మేరకు సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అన్ని జిల్లాల్లోనూ ప్రధానోపాధ్యాయులందరూ 2న సెలవు దరఖాస్తు చేసుకోవాలి. 3న డీవైఈవో, డీఈవో కార్యాలయాల్లో మెమొరాండం ఇవ్వాలి. రాష్ట్రంలో 2000 మంది ప్రధానోపాధ్యాయులకు అకారణంగా షోకాజ్‌ నోటీసులు ఇచ్చారన్నారు. తాజాగా మధ్యాహ్న భోజన సమయంలో హెచ్‌ఎం లేరని ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే... కనీసం వివరణ కూడా తీసుకోకుండా కక్షసాధింపు చర్యలతో సస్పెండ్‌ చేశారు. ఇది కడప జిల్లా ఆర్జేడీ కృష్ణారెడ్డి నియంతృత్వ పోకడలకు నిదర్శనం’’ అని ఆ ప్రకటన విమర్శించారు.

Post a Comment

0 Comments