13 నుంచి ఆందోళనలు తీవ్రతరం - జెఎసి చైర్మన్ బండి శ్రీనివాసరావు
71 డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో పోరాడుతున్నాయని జెఎసి చైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు. పిఆర్‌సి అమలు చేయకపోతే 13 నుంచి దశలవారీగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ డిప్లమో ఇంజనీర్ల సంఘం వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు, న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తుండటంతో ఉద్యోగులు ఉద్యమం వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటనపై ఉద్యోగుల ఉద్యమం ఆధారపడి ఉందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్, ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేయడం వంటి కార్యక్రమాలను చేశారని, అయితే పిఆర్‌సిని మాత్రం అమలు చేయడం లేదన్నారు. కార్యక్రమంలో ఎపి ఎన్‌జిఒ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, మాజీ అధ్యక్షులు రవీంద్ర శర్మ, తదితరులు పాల్గొన్నారు.
0 Comments