GET MORE DETAILS

డిసెంబరు 17 - 'పెన్షనర్స్‌ డే'

 డిసెంబరు 17 - 'పెన్షనర్స్‌ డే'1983 నుండి ఏటా డిసెంబరు 17న 'పెన్షనర్స్‌ డే'గా జరుపుకొంటున్నాం. పెన్షన్‌కు భారతదేశంలో దగ్గర దగ్గరగా 160 ఏళ్ళ చరిత్ర వుంది. 

రిటైర్మెంట్‌ అనంతర జీవనం కోసం తమ రిటైర్డ్‌ ఉద్యోగులకు కొంత సొమ్ము అందజేయాలని ఆనాటి వలసప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధంగా భారత పెన్షన్‌ చట్టం, 1871 ద్వారా ఈ వ్యవస్థ రూపుదిద్దుకొంది.  ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తటస్థీకరించేందుకు పెన్షన్‌ను అప్పుడప్పుడు పెంచుతూ బ్రిటీష్‌ ప్రభుత్వం పరిహారం కల్పించేది.

రిటైర్మెంట్‌ ప్రయోజనాలను ప్రభుత్వం అందజేస్తున్నప్పటికీ 1922, జనవరి 1నుండి అమలులోకి వచ్చిన ఫండమెంటల్‌ రూల్స్‌లో వాటిని పొందుపర్చలేదు. రక్షణ మంత్రిత్వశాఖలో ఆర్థిక సలహాదారుగా వున్న డి ఎస్‌ నకారా ఇండియన్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ ఆడిట్‌ అండ్‌ అక్కౌంట్స్‌లో ఒక ఆఫీసర్‌గా 1972లో రిటైరయ్యారు. మిగతా పెన్షనర్లలాగే ఆయనకూడా పెన్షన్‌ పొందటంలో అనేక ఇబ్బందుల నెదుర్కొన్నాడు. అందువల్ల ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ ఫైల్‌ చేశారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు చంద్రచూడ్‌ గారు ఫిర్యాదుదారు, ప్రభుత్వ వాదనలను విన్నారు. ''పెన్షన్‌'' అన్నది బహుమతిగా లేదా పారితోషికంగా లేదా దయతో ఇచ్చే అదనపు ఫలితంకాదని, అది సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించి రిటైరైన ప్రభుత్వోద్యోగి హక్కు అని తమ తీర్పులో తేల్చి చెప్పారు. తన ఉద్యోగులు రిటైరైన తరువాత ఒక శాంతియుత, గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకొని తీరాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక తీర్పు 1982 డిసెంబరు 17న వెలువడింది. ఆ కారణం గానే డిసెంబరు 17న నేడు దేశమంతటా '  పెన్షనర్స్‌డే'     (పింఛనుదార్ల దినోత్సవం)గా పాటిస్తున్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రకారం పెన్షన్‌ను పెన్షనర్‌ హక్కుగా పరిగణించ బడింది.మరియు పెన్షనర్ గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అది సరిపడు నంతగా వుండాలి.

'నకారా కేసు' లో సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనల ప్రాతిపదికగా ఐదవ కేంద్ర వేతన సంఘం *''పెన్షన్‌ అన్నది బిక్షగాళ్ళకు వేసే ధర్మంలాంటిది కాదు. వయోధిక పౌరులను, వారి వయసుకు తగిన రీతిలో హుందాగా, మర్యాదపూర్వకంగా పరిగణించాల్సిన అవసరం వుంది. పెన్షన్‌ అన్నది వారి చట్టబద్ధమైన, అన్యాక్రాంతానికి తగని, న్యాయపరంగా అమలు పరచాల్సిన హక్కు. అది వారు చమటోడ్చి సాధించుకొన్నది. అందువల్ల ఉద్యోగుల జీతభత్యాల లాగే పెన్షన్‌ని కూడా నిర్ధారిస్తూ, సవరిస్తూ, మార్పులు చేర్పులు చేయాల్సి వుంద''ని పేర్కొంది.

భారతదేశంలో ఇటీవల చోటు చేసుకొంటున్న పెన్షన్‌ సంస్కరణలు, పిఎఫ్‌ ఆర్‌డి ఎ (పెన్షన్‌ ఫండ్‌ క్రమబద్ధీకరణ, అభివృద్ధి సంస్థ) బిల్లు, ప్రపంచబ్యాంకు పెన్షన్‌ నమూనాకు అనుగుణంగా రూపొందించబడ్డాయి.

పెన్షన్‌ సంస్కరణలలో ప్రభుత్వానికి బాగా నచ్చినది, ప్రస్తుతమున్న పెన్షన్‌ స్థానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ప్రవేశపెట్టాలన్నది. ఈ పెన్షన్‌ స్కీం అమలు జరుపుతున్న దేశాలలో చిలీ, స్వీడన్‌, పోలెండ్‌, మెక్సికో, ఆస్ట్రేలియా, హంగరీ, కజకిస్థాన్‌ వంటి దేశాలున్నాయి. భారత ప్రభుత్వం ప్రధానంగా చిలీ పెన్షన్‌ సంస్కరణ పథకం పట్ల మరింతగా ఆకర్షితురాలైంది. 

2004, జనవరి 1నుండి కేంద్రప్రభుత్వ సర్వీసులలో చేరే నూతన ఉద్యోగులకు పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లు ద్వారా నూతన పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది అమలులో వున్న కంట్రిబ్యూటరీ యేతర డిఫైన్డ్‌ బెనిఫిట్‌ పథకానికి బదులు డిఫైన్డ్‌ కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని ప్రతిపాదిస్తోంది. దీని క్రమబద్ధీకరణ నిర్వహణ పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ మూలవేతనం, డిఎపై 10శాతం చెల్లిస్తే, అంతే మొత్తం ప్రభుత్వం జమచేస్తుంది.

బ్యాంకులలో 2010 ఏప్రిల్‌ 1న, ఆ తరువాత చేరిన ఉద్యోగులు, అధికార్లకు ఈ స్కీం వర్తింపజేయ బడుతోంది. కొత్త ఉద్యోగులకు వేరేగా మరెలాంటి ప్రావిడెంట్‌ ఫండ్‌ లేదు. ఈ ఉద్యోగ వ్యతిరేక పెన్షన్‌ ఫండ్‌ బిల్లు (పిఎఫ్‌ఆర్‌డిఎ) ను పార్లమెంటులో ఆమోదం పొందడంతో ఈ విశేష హక్కును కేంద్రప్రభుత్వం లాక్కొన్నట్లైంది. ఈ కొత్త పెన్షన్‌ పథకంలో ఉన్నవారి పెన్షన్‌ మార్కెట్‌ ఒడిదుడుకులపై ఆధారపడి వుంటుంది. ఆ విధంగా జీవన సంధ్యా సమయంలో వారి ఆదాయం అనిశ్చితిగా మారి కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఇది ప్రైవేటు మదుపుదార్ల, సట్టా మార్కెట్‌ ప్రయోజనాలను కాపాడడానికే తప్పఉద్యోగుల భద్రతకు ఏ మాత్రం సరిపడనిది.

నేటికి 16.40 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులూ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు దాదాపు 30 లక్షల మంది ఉన్నట్టు తెలిసింది. ఇందులో ఏపీ వారు 1.57 లక్షల మంది వున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 264 మందికి పైగా చనిపోయిన వారు వుంటారు. ఈ కుటుంబాలకు మాత్రం పెన్షన్‌ రావటం లేదు. ప్రతి నెలా వేతనం, కరువు భత్యం నుండి 10 శాతం చొప్పున మదుపు చేసిన పెన్షన్‌ ఫండ్‌ నుండి సీపీఎస్‌ రూల్‌ ప్రకారం క్లైమ్‌ చేసుకోవాల్సిన 60 శాతం సొమ్ము కూడా సకాలంలో రాక ఆ కుటుంబాలు అనేక అవస్థల పాలవుతున్నాయి. పాత పెన్షన్‌ పథకం వారికి గ్రాట్యుటీ సదుపాయం వుండటం వలన చనిపోయిన లేదా రిటైరైన ఉద్యోగి కుటుంబానికి గరిష్టంగా రూ.15 లక్షల వరకు లభించేది. సీపీఎస్‌లో గ్రాట్యుటీ అవకాశం లేకపోవటం వలన ఆ కుటుంబాల పరిస్థితి దుర్భరంగా ఉంది. పెన్షన్‌ కాదది వంచనగా రుజువైంది. పాత పెన్షన్‌ పథకం కంటే కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమే లాభదాయకంగా వుంటుందనే పాలకుల మాటలు పచ్చి అబద్ధాలు అని తేలిపోయింది.

 సీపీఎస్‌ ప్రమాదం తేటతెల్లమవుతున్న కొద్దీ ఉద్యోగుల్లో అభద్రత, ఆందోళన పెరుగుతోంది. దానితో సీపీఎస్‌కి వ్యతిరేక ఉద్యమాలు ఊపందు కుంటున్నాయి. సీపీఎస్‌ చందా దారులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రత్యేక సంఘాలుగా సమైక్యమై నిరంతర పోరాటాలు చేస్తున్నారు. సీపీఎస్‌తో అపాయింట్‌ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఖ్య పెరగటంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ సంఘాలు ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్నాయి. ఎన్‌జీఓ సంఘాలు జాతీయ సమాఖ్యలతో కలిసి దేశవ్యాపిత ఉద్యమాలు చేపడుతున్నాయి. ఇందుకు తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేయడం మంచి పరిణామం. అధికారంలోకి వచ్చిన 7రోజులలో మన రాష్ట్రంలో సి పి యస్ రద్దు చేస్తామని చెప్పి అధికాంలోకి వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలయినా కమిటీలతో రేపుమాపని కాలయాపన చేయడం ఇటీవల  ప్రభుత్వ సలహాదారు పరోక్షంగా సిపియస్ రద్దు అసాధ్యం , రాష్ట్రబడ్జెట్టు దీనికి చాలదని ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి గా ఉంది.

 సీపీఎస్‌ని  రద్దు చేసి పాత పెన్షన్‌ పథకాన్ని అనుమతించకుండా గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ వరకే అంగీకరించటం వలన ఫలితం ఉండదు.* తద్వారా ఉద్యోగుల ఉద్యమాలు శాంతిస్తాయని పాలకులు భావిస్తే అది వారి భ్రమ. రెండేళ్ల్ల నుండి సీపీఎస్‌పై పోరాటాలు దేశవ్యాపితంగా వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకో జూస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కదా అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల పెన్షన్‌ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అనే విషయాన్ని ఏమార్చలేవు. ఉద్యోగుల జీతభత్యాలు, సెలవులు, పెన్షన్‌ తదితర కొన్ని ముఖ్యమైన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అనుసరించే ధోరణి గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతోంది. అందువలన సీపీఎస్‌ విషయంలో కూడా అదే ధోరణి వ్యక్తమవుతోంది.  గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ అనుమతించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల వంటి పరిణామాలు సీపీఎస్‌ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వీయరక్షణలో పడుతున్నట్టు కనిపిస్తోంది. పోరాడి విజయం  సాధించాలి.

భారతదేశంలో ప్రస్తుతం 60ఏళ్ళ పైబడినవారు 8శాతానికి మించివున్నారు. అంటే సుమారు 10కోట్లమంది. ఈ సంఖ్య 2050 నాటికి 21 శాతానికి అంటే 33.6 కోట్లకు చేరుకొంటుంది. మనదేశంలోని 60ఏళ్లు పైబడిన వృద్ధులందరికి - వారు వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ము కొనేవారు కావచ్చు. లేదా ఇళ్ళల్లో పనిచేసే ఇంటిపని వారలు కావచ్చు - ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత, జీవిత సంధ్యా సమయంలో వారందరికీ ఒక భరోసాగా పెన్షన్‌ సాధిం చాల్సి వుంటుంది. వారంతా వయసులో వున్నంతకాలం శ్రమిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తోడ్పడిన వారే. అంటే ఇప్పుడు పెన్షనర్ల పెన్షన్‌ను పరిరక్షించడం, పెన్షన్‌ లేనివారికి పెన్షన్‌ కల్పించడమే మనముందున్న బృహత్తర కర్తవ్యం. ఆ కర్తవ్యానికి పునరంకితులు కావడమే ఈ పెన్షనర్ల దినోత్సవ సందర్భంగా మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ.

ప్రభుత్వాలు పెన్షనర్స్ కు పెన్షన్ చెల్లించడమనేది ఓ బాధ్యతగా భావించాలే గానీ బరువని , అనవసర ఖర్చుఅని భావించడం సరికాదు. ఆ ఆలోచన తిరోగమనం అవుతుంది. ప్రపంచంలో మొట్టమొదటిగా పెన్షన్ ప్రవేశపెట్టిన జర్మనీ చాన్సలర్ ఒట్టోవా బిస్మార్క్ గారికి భారతదేశంలో పెన్షన్ కోసం పోరాడి సాధించి పెట్టిన స్వర్గీయ నకారా గారికి పెన్షన్ బిక్ష కాదు అది హక్కు ,దానిని చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వాలదే అని అధ్భుతమైన తీర్పునిచ్చి పెన్షనర్స్ అందరి మదిలిలో చిరస్ధాయిగా నిలిచిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ వై వి చంద్రచూడ్ గారికి జోహార్లు తెలియచేస్తూ , 

పెన్షనర్లందరికి పెన్షనర్స్ దినోత్సవ శుభాకాంక్షలు

Post a Comment

0 Comments