GET MORE DETAILS

27 శాతానికి మించి ఇవ్వలేం : ఉద్యోగ సంఘాలకు తేల్చిచెప్పిన ప్రభుత్వం

 27 శాతానికి మించి ఇవ్వలేం : ఉద్యోగ సంఘాలకు తేల్చిచెప్పిన ప్రభుత్వం




మధ్యేమార్గం ఆలోచించండి

ఉద్యోగ సంఘాలకు తేల్చిచెప్పిన ప్రభుత్వం

నేడు మరోసారి చర్చలు

ఆందోళన కొనసాగిస్తామన్న నాయకులు


పిఆర్‌సిపై అధికారుల కమిటీ సూచించిన విధంగా 27 శాతానికి మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులకు తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్య్టా అంతకుమించి పెంపుదల సాధ్యం కాదని తెలిపారు. 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాల్సిందేనని ఉద్యోగ సంఘాల నాయకులూ తేల్చిచెప్పారు. సిఎస్‌ కమిటీ ఇచ్చిన నివేదిక వల్ల నష్టం వస్తుందని, అంగీకరించబోమనీ తెలిపారు. 11వ పిఆర్‌సిని పరిశీలించిన సిఎస్‌ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నాయకులతో రెండురోజులుగా చర్చలు జరుపుతున్నారు. బుధవారం సాయంత్రం ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి చర్చలు జరిపారు. ఈ సమావేశానికి జెఎసి, అమరావతి జెఎసి నుండి బండి శ్రీనివాసరావు, బప్పరాజు వెంకటేశ్వర్లు, యుటిఎఫ్‌ నుండి ప్రసాదు, సచివాలయ ఉద్యోగుల సంఘం నుండి కె.వెంకట్రామిరెడ్డి, సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, ఈ సమయంలో 27 శాతానికి మించి ఇవ్వలేమని, మరో ఆలోచన చేయాలని సూచించారు. దీనికి స్పందించిన ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్‌ఆర్‌ఏ విషయంలో అనుమానాలున్నాయని తెలిపారు. సిసిఎస్‌ విషయాన్ని కూడా తేల్చాలని కోరారు. దీనికి స్పందించిన సజ్జల ఆ విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవాల్సి ఉందని, అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే గురువారం మరోసారి చర్చలు జరుపుదామని సూచించారు. ఇక్కడ ఒక నిర్ణయానికి వస్తే సిఎంతో చర్చలు జరిపేందుకు అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రేపటిలోపు ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. అయితే సిఎస్‌ కమిటీ ప్రకటించిన విధంగా భారాలు పడబోమని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఇప్పటికే ఐఆర్‌ ఇస్తున్నా దాన్ని కూడా కలిపి చూపించారని తెలిపారు. అదనంగా ప్రభుత్వంపై హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు మాత్రమే భారం మాత్రమే పడుతుందని తెలిపారు. ఇది కూడా కమిటీ సూచించిన దానిలో సగం కంటే తక్కువగా ఉంటుందని వివరించారు. సిఎస్‌ కమిటీ లెక్కలు వేయడంలోనే లోపం ఉందని సూచించారు. అయితే 34 శాతానికి తక్కువ గాకుండా చూడాలని సెక్రటేరియట్‌ ఉద్యోగ సంఘాల నాయకులు వివరించారు. తొలుత సమావేశం ముగిసిందని ప్రకటించినా అనంతరం మరోసారి నాయకులను పిలిచి చర్చలు ప్రారంభించారు. రాత్రి పదిగంటల వరకూ చర్చలు సాగుతూనే ఉన్నాయి.

Post a Comment

0 Comments