GET MORE DETAILS

ఇదీ... క్యాలండర్ కథ

ఇదీ... క్యాలండర్ కథకొత్త సంవత్సరం వస్తోంది అంటే అందరికీ సరదాయే! కొత్త క్యాలండర్లు తెచ్చుకోవడం, రోజూ దినచర్య రాసుకునేందుకు డైరీలు సిద్ధం చేసుకోవడం అందరికీ ఇష్టమైన పనులు. అసలైతే కాలానికి తుది-మొదలు అంటూ లేవు. అయినా రాత్రి-పగలు, రోజులు, నెలలు, సంవత్సరాలు అంటూ ఆ కాలాన్ని రకరకాలుగా విభజించుకొని, మనం మన కార్యక్రమాల్ని జరుపుకుంటూ పోతుంటాం. మనిషి ఇలా ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడిపేలా చేయడంలో క్యాలెండర్ పాత్ర చాలా పెద్దది, కదూ...?


'క్యాలండర్' అంటే ఏమిటి...?

ఉదయం-సాయంత్రం వేళల్లో సూర్యుడు కనిపించటం-మాయమవుతుండటం, ఇక రాత్రుళ్ళు చీకటి పడగానే చంద్రుడు-నక్షత్రాలు కనిపించడం, సూర్యోదయంతో అవి కనిపించకుండా పోవడం, కొంతకాలం వేడి, కొంతకాలం చలి, కొంతకాలం వర్షాలు- ఇలా ప్రకృతిలో చోటు చేసుకుంటున్న రకరకాల మార్పులలో క్రమాన్ని గమనించాడు మనిషి. ఈ మార్పుల క్రమాన్ని అర్థం చేసుకొని, దాన్ని అనుసరించటం మొదలు పెట్టాడు. ఆ మార్పులకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తూ తన జీవన ప్రమాణాలను పెంచుకున్నాడు. దైనందిన వ్యవహారాలను సులభంగా చక్కదిద్దుకోవడానికి, సూర్య-చంద్రుల గమనాన్ని తెలుసుకోవడానికి, ఇలా రకరకాల కారణాలతో కాలాన్ని లెక్కించటం మొదలు పెట్టాడు. ఇలాంటి 'కాలగణన'ను సూచించేదే, క్యాలండర్.

లాటిన్ భాషలో క్యాలండే (Kalendae) అనే పదం నుంచి పుట్టింది, 'క్యాలెండర్' అనే మాట. కాలెండ్ అంటే 'నెలలో మొదటి రోజు' అని అర్థమట. కానీ ఇప్పుడు క్యాలండర్ అనేది రోజులు- వారాలు- నెలలు- సంవత్సరాలు- అన్నిటినీ చూపించే ఒక కాల సూచిక ఐపోయింది.

ఎన్ని రకాల క్యాలండర్లు ?

వివిధ దేశాల్లో, వివిధ నాగరికతల్లో, వాళ్ళ వాళ్ళ జీవన విధానాన్ని అనుసరిస్తూ పలు రకాల క్యాలండర్లు అమలులోకి వచ్చాయి. గ్రెగోరియన్ క్యాలండర్, జర్మన్ క్యాలండర్, హిందూ క్యాలండర్, ఇస్లామిక్ క్యాలండర్, ఇరానియన్ క్యాలండర్, హిబ్రూ క్యాలండర్, బౌద్ధుల క్యాలండర్- ఇలా ఎన్నో రకాల క్యాలండర్లు ఉంటున్నాయి.

వీటన్నిటిలోనూ 'కాలాన్ని లెక్కించే పద్ధతులు ఏంటి' అని చూస్తే మటుకు, అవి ప్రధానంగా రెండు విధాలు: 'చాంద్రమానం', 'సౌరమానం'. చంద్రుడి గమనం ఆధారంగా లెక్కకట్టే కాలాన్ని చాంద్రమానం అనీ, సూర్యుడి గమనం ఆధారంగా లెక్కకట్టే కాలాన్ని సౌరమానం అనీ అంటారు.

అనేక ఇతర దేశాల్లో‌ మాదిరిగానే మన దేశంలో కూడా ఈ రెండు రకాల క్యాలండర్లూ అమలులో ఉన్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలలో భాగంగా పండుగలు పబ్బాలు జరుపుకునేందుకు వాడే తెలుగు క్యాలెండరు చాంద్రమానపుది. ఇక మనందరికీ బాగా అలవాటైపోయి, ప్రామాణికంగా వాడబడుతున్న ఆంగ్ల క్యాలండర్ సౌరమానం ప్రకారం నడుస్తుంది.


గ్రెగోరియన్ క్యాలండర్ :

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మనం అందరం వాడే ఇంగ్లీషు క్యాలండర్ అసలు పేరు గ్రెగోరియన్ క్యాలండర్. ప్రపంచం అంతటా ఇది ప్రస్తుతం అమలులో‌ఉన్నా, దీన్ని నెలకొల్పినవా ళ్ళు మటుకు రోమన్లే.

ఒకప్పుడు రోమన్లు ఓ 'రోమన్ క్యాలండర్' ను అనుసరించేవాళ్ళు. ఆ క్యాలండర్ ప్రకారం సంవత్సరానికి పదినెలలు- మార్చి నుండి డిసెంబరు వరకు ఉండేవి. చలికాలం కాలానికి లెక్క ఉండేది కాదు. అది పూర్తవ్వగానే మళ్ళీ కొత్త సంవత్సరం ప్రారంభం‌ అయ్యేది. అదంతా కూడా మరి, చాంద్రమానం ప్రకారం‌ ఉండేది! చంద్రుడు కనిపించే పౌర్ణమి నుండి నెల ప్రారంభం అవుతుండేది. దాంతో అదంతా కొంచెం చాలా ఇబ్బందిగానే ఉండేది.

కొత్త క్యాలండరు :

ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యే సంప్రదాయం క్రీ.పూ. 46లో గానీ మొదలు కాలేదు. దీన్ని మొదట ప్రారంభించినవాడు రోమన్ చక్రవర్తి 'జూలియస్ సీజర్'. అందుకే ఆ కొత్త క్యాలండర్‌ని జూలియన్ క్యాలండర్ అని పిలవటం‌మొదలు పెట్టారు. అంతకు ముందున్న రోమన్ క్యాలండర్‌కు చాలా సవరణలు చేశాడు జూలియస్ సీజర్. అయితే ఈయన తయారు చేసిన జూలియన్ క్యాలండర్‌కూ, నిజంగా సంభవిస్తున్న సూర్యుడి గమనానికీ ప్రతి సంవత్సరమూ 11 నిముషాల తేడా రాసాగింది. అలా కొన్ని వందల-వేల సంవత్సరాలు గడిచిపోయే సరికి, ఈ తేడా కాస్తా చాలా పెద్దదే అయిపోయింది. నిముషాల తేడా రోజుల తేడా అయి కూర్చున్నది. దానికి తోడు భూ పరిభ్రమణానికి మరో‌ పావురోజు ఎక్కువ పడుతున్నదని తెలిసింది. అట్లా కూడా జూలియస్ సీజర్ గారి క్యాలండరు వెనక పడింది!


ఈ ఇబ్బందుల్ని సవరిస్తూ, 16వ శతాబ్దపు 'గ్రెగోరీ' అనే పోప్‌గారు క్యాలండర్లో మరికొన్ని సవరణలు చేశారు. నాలుగు సంవత్సరాలకి ఒకసారి ఒక పూర్తిరోజును ఫిబ్రవరి నెలలో కలిపి, దాన్ని 'లీప్ సంవత్సరం' అన్నారు. క్రీ.శ.1600ను మొదటి లీప్ సంవత్సరంగా ప్రకటించారు. అప్పటినుండి పన్నెండు నెలల ఈ క్యాలండరును ఆయన పేరిట, 'గ్రెగోరియన్ క్యాలండర్' అని పిలుస్తున్నారు. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కాలాన్ని లెక్కించడానికి ప్రస్తుతం ఈ‌ గ్రెగోరియన్ పద్ధతే వాడుతున్నారు.

నెలల పేర్లు ఎలా వచ్చాయి :

ఈ క్యాలండర్లో పన్నెండు నెలలు ఉన్నాయి కదా, వాటి పేర్లన్నీ మనకు తెలిసినవే- అయితే ఆయా నెలల పేర్ల వెనక ఉన్న కథా కమామీషు ఆసక్తి కరంగా ఉంటుంది:

జనవరి నెల ను సంవత్సరంలో మొదటి నెలగా 'జూలియస్ సీజర్' మార్చాడు. 'జేనస్' అనే గ్రీకు దేవుడి పేరు మీద జనవరి నెల పేరు వచ్చింది. గ్రీకు పురాణాల ప్రకారం జేనస్ దేవుడికి రెండు ముఖాలుంటాయి. రెండూ వేరు వేరు దిశలను చూస్తుంటాయి. ఒక స్థితి నుండి మరొక స్థితిలోకి మార్పు చెందే అన్ని కాలాల్లోను ప్రజలు ఈ గ్రీకు దేవుడిని ఆరాధించేవాళ్ళు. యుద్ధ సమయం, వ్యవసాయం, పెళ్ళిళ్ళు- అన్నిటిలోనూ ఈ దేవుడు గతించిన కాలాన్నీ, రాబోయే కాలాన్నీ సూచిస్తూ ఉండేవాడన్నమాట. అందుకనే కొత్త సంవత్సరాన్ని ఈయన పేరుతో మొదలు పెట్టించాడు జూలియస్ సీజర్.

ఇక, ఫిబ్రవరి కథ కొంచెం‌ పెద్దది. 'ఫిబ్రువాలియా' అనే పదం లాటిన్ భాషలోది. దీని అర్థం‌ 'శుద్ధి చేయటం'. రోమన్లు ఫిబ్రవరి పదిహేనవ తేదీని పరిశుద్ధి చేసుకునే పండుగగా 'ఫిబ్రువా' అని పిలిచేవాళ్ళు. ఫిబ్రువా పేరుమీదే ఈ నెలకి ఫిబ్రవరి అని పేరు వచ్చింది. క్రీ.పూ 7వ శతాబ్ది వరకు రోమన్ల క్యాలండర్లో పది నెలలే ఉండేవని చెప్పాను కదా, ఆ రోజుల్లో మార్చి నెలతోటే సంవత్సరం మొదలయ్యేది. చలికాలాన్ని లెక్కలోకి తీసుకునేవాళ్ళు కాదు. కానీ క్రీ.పూ 713లో రోమన్ చక్రవర్తి 'న్యూమా పాంపిలస్ ' క్యాలండర్‌కి చివర్లో ఈ నెలను కలిపాడు. ఆ తర్వాత ఓ రెండు వందల యాభై సంవత్సరాలపాటు ఈ నెలకు 23 రోజులే ఉండేవి. అప్పుడు జూలియస్ సీజర్ దీనికి మరో‌ నాలుగు రోజులు కలిపి 28రోజులు చేశాడు. తర్వాతి కాలంలో పోప్ గ్రెగరీ నాలుగు సంవత్సరాలకు ఒక రోజును అదనంగా‌ కలిపే సరికి, ఫిబ్రవరి నెలలో నాలుగు సంవత్సరాలకు ఒకసారి 29 రోజులు ఏర్పడ్డాయి.

ఇక గ్రీకు పురాణాల ప్రకారం మార్స్ (మెర్సిడోనియస్) అనే దేవుడు యుద్ధాలకు అధి దేవత. ఆ దేవత పేరు మీద ఈ నెలకు 'మార్చ్' అని పేరు వచ్చింది. ఈ నెలలో మార్స్ ను పూజించి తిరిగి యుద్ధాలను మొదలు పెట్టుకునేవాళ్ళు. మొదట్లో, రోమన్ క్యాలండర్ ప్రకారం, సంవత్సరం ఈ నెలతోటే మొదలయ్యేది. కానీ జూలియస్ సీజర్ పుణ్యాన జనవరి నెల మొదటికి వచ్చి, ఇది మూడో నెల అయ్యింది.

తర్వాతి నెల ఏప్రియల్ . లాటిన్ పదం 'ఏప్రిలిస్' దీనికి ఆధారం. 'క్రియ' అనీ, 'తెరుచుకునేది' అని దీనికి రెండు అర్థాలు ఉండేవి. ఎన్నో పండుగలు, శుభకార్యాలు మొదలు పెట్టే నెలగా ఏప్రిలిస్ నెల ఉండేది. 'ఏఫ్రొడైట్ ' అనే మరో దేవత పేరు మీద ఏప్రియల్ వచ్చిందని మరో కథనం కూడా ఉంది. అందానికి, ప్రేమకు అధిదేవత ఏఫ్రొడైట్. ఏప్రియల్ నెలలో వసంతకాల ఆగమనంతో‌ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కదా, అందువల్ల ఈ నెలకు ఆమె పేరు పెట్టారని చెబుతారు. మొదట్లో ఈ నెలకి 29 రోజులే ఉండేవట. జూలియస్ సీజర్ దీనికి మరో రోజు కలిపి 30రోజులు చేశాడు.

ఇక, ఫ్రెంచి-లాటిన్ పదాలైన 'మాయి', 'మెయ్యా' లు మే మాసపు మూలాలు అని చెబుతారు. ఇటలీలో వసంతకాలపు దేవత పేరు మెయ్యా. ఫానస్ అనే రాజుకి, వల్కాన్ అనే రాణికి పుట్టిన ఈమె చాలా గొప్పదట. మెయ్యా అంటే అర్థం కూడా అదే- 'చాలా గొప్పది' అని! మే నెల చాలా గొప్పదన్నమాట.

ఇక, 'జూనో' అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది జూన్. రోమన్ దేవతల్లో అతి ముఖ్యమైన దేవత ఈ జూనో. స్త్రీల సౌభాగ్యానికి, పెళ్ళికి అధిదేవత ఈవిడ. జూపిటర్ అనే దేవుడికి స్వయానా చెల్లెలు. ఈ నెలకి కూడా మొదట్లో 29రోజులే ఉండేవట. జూలియస్ సీజర్ చేసిన మార్పుల వల్లనే దీనికి కూడా 30 రోజులు వచ్చాయి.

క్యాలెండర్లో ఇన్నిన్ని మార్పులు చేసిన జూలియస్ సీజర్, తను పుట్టిన నెలకి జూలై అని తన పేరు పెట్టుకున్నాడట. అంతకు ముందు ఈ నెలని 'క్వింటిలస్' అనేవాళ్లట- 'ఐదవది' అని దాని అర్థం. మొదట్లో జులై నెల ఐదవదిగా ఉండేది కదా, అందుకని ఆ పేరు ఉండేదన్న మాట.

రోమన్ క్యాలండర్ ప్రకారం ఆగస్టు మాసపు అసలు పేరు సెక్ట్సిలస్- "ఆరవది". ఆ రోజుల్లో ఇది సంవత్సరంలో ఆరో నెలగా ఉండేది. అయితే క్రీ.పూ 8వ శతాబ్దిలో రోమ్‌ నగరాన్ని పాలించిన 'అగస్టస్' చక్రవర్తి ఈ నెల పేరును తన పేరు మీదుగా 'ఆగస్టు' అని మార్చాడట. అగస్టస్ వేరెవరో కాదు: జులై నెలకు తన పేరు పెట్టుకున్న జూలియస్ సీజర్‌కి మారు కొడుకే ఈయన. మొదట్లో ఈ నెలకి 30 రోజులే ఉండేవట. 'అయితే తన మారుతండ్రి నెల- జులై-కి 31 రోజులుంటే తన నెలకి తక్కువ ఎందుకుండాలని, ఈయన ఫిబ్రవరిలోంచి ఒక రోజును తగ్గించి తన నెలకు కలుపుకున్నాడు' అని ఓ కథ ఉంది. 

ఇక వచ్చి, సెప్టెంబర్ నెల. రోమన్ భాషలో 'సెప్టమ్‌' అంటే 'ఏడవది' అని అర్ధం. నెలలు మార్చితో మొదలైనప్పుడు ఇది ఏడోదికదా, అందుకని ఆ పేరు. అయితే ఆ తర్వాత నెలలు జనవరితో మొదలైనా, దీని పేరు మటుకు మారకుండా అలానే ఉండిపోయిందట- 'సెప్టెంబర్' అని.

మరి 'ఆక్టో' అంటే ఎనిమిది. ఒకప్పటి ఎనిమిదో నెల 'అక్టోబరు' అయ్యింది. క్యాలెండర్లు మారే సరికి, ఇప్పుడు ఇది పదో నెల అయికూర్చున్నది. అయినా దాని పేరు మటుకు అలాగే ఉండిపోయింది.

ఇక, 'నవం' - తొమ్మిది నుండి ' నవంబరు '; 'డిసెం' -పది- నుండి డిసెంబరు వచ్చాయి. అప్పట్లో‌ ఇవి తొమ్మిదవ, పదవ నెలలు కదా. ఇదన్నమాట క్యాలండరు కథ.

Post a Comment

0 Comments