GET MORE DETAILS

అవకాశాలు సిద్ధం... అందుకుందామా మరి

 అవకాశాలు సిద్ధం... అందుకుందామా మరి...!



2021లో ఎన్ని చూశాం! లాక్‌డౌన్‌.. కొవిడ్‌తో ప్రాణ భయం.. ఉద్యోగ అనిశ్చితి.. వీటికితోడు మానసిక ఒత్తిడి! ఏడాదంతా ఎన్నో ఒడుదొడుకులు! నెమ్మదిగా పరిస్థితుల్లో మార్పు వస్తోంది. మునుపటిలా సాధారణ స్థితికి వచ్చేస్తోందన్న ఆశ. అది నిజమే అన్నట్టుగా కొత్త ఏడాదీ వచ్చేసింది. కొంగొత్త ఆశలు, భవిష్యత్‌పై ఎన్నో కలలు మోసుకొచ్చింది. వీటికి అనుగుణంగానే అవకాశాలూ సిద్ధంగా ఉన్నాయి. మనం అందుకోవడమే తరువాయి!

‘సృజనాత్మకంగా ఆలోచిస్తారు.. భిన్న మనస్తత్వాల వారితోనూ తేలిగ్గా కలిసిపోగలరు.. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని సాధ్యం చేయగలరు.. అందుకే అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలిస్తున్నాం’.. దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు వెలిబుచ్చిన అభిప్రాయమిదీ. అందుకే కొత్తఏడాదిలో మనకోసమే ప్రత్యేకంగా ఎన్నో అవకాశాలను తీసుకొస్తున్నాయి.

ఐటీలో.. వేలు :

అమ్మాయిలు.. ఇంజినీరింగ్‌ అనగానే సాఫ్ట్‌వేరే గుర్తొచ్చేంతగా ముద్ర పడిపోయింది. కానీ లెక్కల్ని చూస్తే మనశాతం 40లోపే! ఈ ఏడాది టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ సహా ఐటీలో దిగ్గజ సంస్థలన్నీ భారీగా ఉద్యోగావకాశాలను ప్రకటించేశాయి. తమ ప్రధాన ఎంపిక అమ్మాయిలేననీ ముందే చెప్పేశాయి. 60 వేలకు పైగా ప్రాథమిక స్థాయి ఉద్యోగాల్లోకి తీసుకుంటామన్నాయి. వీటిలో సగం విప్రో, ఇన్ఫోసిస్‌లవే. హెచ్‌సీఎల్‌ టెక్‌ తన సంస్థలో లింగ నిష్పత్తి 50ః50గా ఉండేలా చూసుకోవాలనుకుంటోంది. అందుకే.. ఈఏడాది 20 వేలకుపైగా తాజా గ్రాడ్యుయేట్లను తీసుకోబోతోంది. విప్రో ఉద్యోగుల్లో 35% మహిళలే. దాన్ని 50% చేసేందుకు ప్రయత్నిస్తోంది.

తిరిగి ఆహ్వానిస్తున్నాయ్‌!

కెరీర్‌లో మనం ఎంత దూసుకెళుతున్నా.. కుటుంబం, పిల్లల సంరక్షణ విషయానికొచ్చేసరికి వాటికి స్వస్తి చెప్పాల్సిందే! కొన్నేళ్ల తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరదామనుకున్నా.. ఈ విరామం పెద్ద అవరోధమవుతోంది. దీంతో ప్రాథమిక స్థాయిలో ఉన్న శాతం పైస్థాయికి వెళ్లేసరికి భారీగా తగ్గిపోతోంది. ఈ పరిస్థితిలోనూ మార్పు వస్తోంది. బాధ్యతల కారణంగా తాత్కాలిక విరామం తీసుకున్న మహిళలకి కొన్ని సంస్థలు అవకాశమిస్తున్నాయి. ప్రత్యేకంగా రిటర్నింగ్‌ ప్రోగ్రామ్‌లూ రూపొందిస్తున్నాయి. టీసీఎస్‌- రీబిగిన్‌, అమెజాన్‌- సెకండ్‌ ఇన్నింగ్స్‌, ఎయిర్‌ బస్‌- ఫ్లైఎగైన్‌, మింత్రా-ఫియోనిక్స్‌, గూగుల్‌-నెక్స్ట్‌ ఇన్నింగ్స్‌, టీవీఎస్‌ మోటార్‌- ఉన్నతి, మైక్రోసాఫ్ట్‌- స్ప్రింగ్‌బోర్డ్‌, ఐబీఎం- రీ ఎంట్రీ, పేపల్‌- రీచార్జ్‌.. ఇలా ఒక్కో సంస్థ ఒక్కో పేరుతో స్వాగతం పలుకుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం సుమారు 46% సంస్థలు ఇలాంటి మహిళలకు ఆహ్వానం పలకడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అవసరమైన శిక్షణనీ ఇస్తున్నాయి. అంతేకాదు.. మధ్య, పై స్థాయులకూ మహిళలే సరిపోతారని అంకురాలు సహా 41% సంస్థలు భావించడమే కాదు.. నియామకాలూ జరపబోతున్నాయట.

తయారీ రంగంలోనూ...

మైనింగ్‌, ఆటోమొబైల్‌, హెవీ ఇంజినీరింగ్‌, నిర్మాణం.. లాంటి పురుషాధిక్య రంగాల్లోనూ మన ఉనికి పెరుగుతోంది. గత ఏడాది జనవరిలో డైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్‌ తయారీలో 46 మంది మహిళల్ని ఎంచుకుంది. ఆ తర్వాతి నుంచి ఎన్నో సంస్థలు ఇదే బాటలో నడిచాయి. టాటా స్టీల్‌ ‘విమెన్‌ ఎట్‌ మైన్స్‌’ పేరిట హెవీ ఎర్త్‌మూవింగ్‌ మెషినరీ నిర్వహణకు అమ్మాయిల్నే ఎంచుకుంది. హిందుస్థాన్‌ కోకాకోలా ప్రాసెసింగ్‌ పరిశ్రమలో  60%పైగా మహిళలకే అవకాశమంటోంది. ఓలా ఎలక్ట్రిక్‌.. తన ద్విచక్ర వాహన తయారీ విభాగాన్ని  అమ్మాయిలతోనే నిర్వహించనుంది. ఇందుకు 10 వేల మందిని నియమించుకుంటాననీ ప్రకటించింది. ఇండియన్‌ హోటల్స్‌, టాటా ప్రాజెక్ట్స్‌ నిర్మిస్తున్న జింజర్‌ హోటల్‌కు ఆల్‌ విమెన్‌ ఇంజినీరింగ్‌ బృందం సారథ్యం వహిస్తోంది. కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ లిమిటెడ్‌ మహిళా మిషన్‌ 20 ప్రాజెక్టు పేరిట తయారీ విభాగంలో అవకాశాలిస్తోంది.

ఇవేకాదు.. డిగ్రీలోపు విద్యార్హత ఉన్నవారికీ ఎన్నో సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయి. ఈకామర్స్‌ దిగ్గజం.. అమెజాన్‌ పూర్తిగా అమ్మాయిలే డెలివరీ చేసేలా 5 ‘ఆల్‌ విమెన్‌ పార్ట్‌నర్‌ డెలివరీ స్టేషన్‌’లను తమిళనాడు, గుజరాత్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రారంభించింది. నిపాన్‌ తమిళనాడులో 500 మంది మహిళలకు పెయింటింగ్‌ నేర్పించి, ఉపాధినీ చూపిస్తోంది. హిందుస్థాన్‌ యూనిలివర్‌ హరిద్వార్‌ ప్లాంట్‌లో ఆపరేషన్‌ విభాగంలో అమ్మాయిలకు శిక్షణనిచ్చి మరీ తీసుకుంది. ఇవన్నీ ప్రయోగాత్మకంగా ప్రారంభించినవే.. కానీ ఫలితం ఆయా సంస్థలు ఊహించిన దానికంటే ఎక్కువ ఆశాజనకంగా వచ్చింది. ఉత్పత్తి శాతం బాగా పెరిగింది. దీంతో ఇవన్నీ దేశవ్యాప్తంగా అమ్మాయిలను విధుల్లోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. కొన్ని సంస్థలైతే కుటుంబాలకు వీడియో రూపంలో వాళ్ల పని, చేసే చోటు, రక్షణ విషయాల్లో అవగాహననూ కల్పిస్తున్నాయి.

ఇన్ని గంటలు కేటాయించలేమంటారా! మీ చేయి తిరిగిన వంటకంతోనూ సంపాదించొచ్చు. గృహిణులందరినీ ఓ తాటిపై తెస్తూ ఎన్నో అంకుర సంస్థలొచ్చాయి. ట్యూషన్స్‌, సంగీతం, హస్తకళలు వంటివి నేర్పే ఆన్‌లైన్‌ వేదికలున్నాయి. అవసరమైన అదనపు శిక్షణనీ అవే ఇస్తున్నాయి లేదా ఏ యూట్యూబ్‌ ఛానెలో, సామాజిక మాధ్యమాల్లో వ్లాగ్సో చేయండి. వ్యాపకంలానూ ఉంటుంది, మెప్పిస్తే ఆదాయమూ.

సృజనాత్మకత, కష్టపడేతత్వంలో అమ్మాయిలు ఎవరికీ తీసిపోరని సంస్థలు నమ్ముతున్నాయి.

మల్టీటాస్కింగ్‌లో మనకు సాటిలేదనీ భావిస్తున్నాయి. అందుకే ఎన్నో అవకాశాల్ని మనకు ఇస్తున్నాయి. కొత్త ఏడాదిలో వాటిని అందుకుని సత్తా చూపడం ఇక మన చేతుల్లోనే ఉంది.


Post a Comment

0 Comments