GET MORE DETAILS

గృహంలో అద్దాన్ని ఏ దిశలో ఉంచాలి?

గృహంలో అద్దాన్ని ఏ దిశలో ఉంచాలి?



జాతక,ముహూర్త విషయాలకు సంప్రదించవచ్చును. 

లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

శ్రీనివాససిద్ధాంతి : 9494550355

గృహంలో అద్దాన్ని ఏ దిశలో ఉంచాలి?

ప్రతి గృహంలోనూ అద్దం ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది గదిలో ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ అద్దాన్ని అమరుస్తూ ఉంటారు. అద్దం ఒక్కొక్క చోట అమరిస్తే ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే అద్దం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడికి సంబంధించిన వస్తువు. చంద్రుడు శ్రీ మహాలక్ష్మి దేవి ఇద్దరూ పాలసముద్రం నుంచి ఉద్భవించారు కావున మహాలక్ష్మి దేవికి చంద్రుడు సోదర సమానుడు. చంద్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు శ్రీమహాలక్ష్మి అనుగ్రహం ఉండి ధన ధాన్యాలు అభివృద్ధి చెందుతాయి. అద్దాన్ని తూర్పు గోడకు అమర్చాలి అనగా ఎవరైనా తలదువుకున్నా బొట్టు పెట్టుకున్నా సరే తూర్పు ముఖంగా తిరిగి చేయాలి. ఉత్తర ముఖం కూడా మంచిదే ఉత్తరం గోడకు అద్దాన్ని అమర్చడం వల్ల  విద్యాభివృద్ధి జ్ఞానము పెరుగుతాయి. తూర్పు గోడకు అద్దాన్ని అమర్చినప్పుడు ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం బాగుంటుంది. ఉత్తర వాయువ్యంలో అద్దాన్ని అమర్చినప్పుడు ఆ గృహంలో నివసించే వారి వ్యాపార అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. పడమర గోడకు అద్దాన్ని అమర్చినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఎక్కువగా ఉంటాయి చీటికిమాటికి ఎదో రకంగా గొడవలు పడుతుంటారు. కావున పశ్చిమ గోడకు అద్దాన్ని అమర్చ రాదు. దక్షిణ గోడకు అద్దాన్ని అమర్చినప్పుడు ఆ ఇంట్లో వ్యక్తుల యొక్క పనులు సజావుగా జరగవు చేసే పనులలో అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కావున గృహంలో పశ్చిమ గోడకు అద్దాన్ని అమర్చరాదు. ఇంట్లో ఉపయోగించే అద్దాలు పగిలిపోయినవి మసగబారినవి జిడ్డుగా ఉండే అద్దాలు ఉపయోగించరాదు ఇటువంటివి ఉపయోగించినప్పుడు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తగ్గుతుంది కావున పగిలిన అద్దాలు వంటివి ఉంటే బయట పారవేయండి. అద్దాన్ని ప్రత్యేకమైన స్థానాల్లో అమర్చి విద్యార్థుల అభివృద్ధి వ్యాపార ఉద్యోగ అభివృద్ధి మరియు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి.

ప్రేమ విఫలం:

ఈ కాలంలో ఎక్కువమంది వివాహానికి ముందు ప్రేమించడం, కొంతమందికి ప్రేమించిన వారితో వివాహం జరగడం మరి కొంతమందికి ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఫెయిల్ అయ్యే జాతకాలు ముందుగా తెలుసుకుంటే బాధపడవలసిన అవసరం ఉండదు. ముందుగానే విషయం నుండి దూరంగా వెళ్లే అవకాశం ఉంటుంది. కొన్ని గ్రహాలు కాంబినేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రేమించుకున్న వారు దూరం అవుతూ ఉంటారు. ఉదాహరణకు శుక్ర భగవానుడు షష్టమ స్థానంలో కానీ వ్యయ స్థానంలో కానీ ఉన్నప్పుడు ప్రేమికులు దూరం అవుతారు. శుక్ర భగవానుడు వక్రించినప్పుడు కూడా ప్రేమించుకున్న వారికి వివాహం జరగదు. మరొకటి పంచమరాహువు. పంచమ స్థానంలో రాహువు ఉన్నప్పుడు ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతాయి. రాహువు ఆత్రుతకు కారకుడు ఒక వస్తువును వాడుకోవాలి అనే తొందర ఎక్కువ ఉంటుంది. అదే విషయం ప్రేమలో కూడా జరుగుతుంది. ప్రేమిస్తారు కానీ ఖచ్చితంగా బ్రేకప్ అయిపోతుంది ఇటువంటి వారు రెండు మూడు సార్లు కూడా ప్రేమిస్తారు ఫెయిల్ అవుతారు. చివరికి ఈ ప్రేమ అక్కరలేదు అనుకుంటారు, ప్రేమ పైన విరక్తి పొందుతారు అప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటారు. అప్పుడు లైఫ్ లో బాగా సెటిల్ అవుతారు. మరొక కాంబినేషన్ శుక్ర భగవానుడు బుధుడు ఈ కాంబినేషన్లో మొదటిసారి ప్రేమలో ఫెయిల్ అవుతారు రెండోసారి ప్రేమలో సక్సెస్ అయ్యి వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాంబినేషన్ ఉన్నవాళ్లు మేనత్త కూతురు కానీ మేనమామ కూతురు కానీ మరదలు లేదా మేన మామ ఇటువంటి వారిని ఇష్టపడినప్పుడు మొదటిసారి సక్సెస్ ఇస్తుంది ఎందుకంటే బుధుడు మేనత్త మేనమామ మామయ్య వీటికి కారకుడు. శుక్రుడు బుధుడు కాంబినేషన్ ఉన్న జాతకులు గర్ల్ ఫ్రెండ్స్ లేదా బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు తప్ప వివాహం వరకు వెళ్లరు. మరొక కాంబినేషన్లో శని భగవానుడు కుజుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలకు ఏదైనా సంబంధం ఉంటే వివాహ విషయంలో ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయి. శుక్ర భగవానుడికి శని భగవానుడు లేదా కేతువు లేదా రాహువు ఏ విధంగా అయినా సంబంధం ఉన్నప్పుడు ప్రేమలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతర గ్రహాల కాంబినేషన్లో కొన్ని సందర్భాలలో సక్సెస్ తీసుకొస్తుంది కొన్ని సందర్భాలలో ఫెయిల్యూర్ తీసుకొస్తుంది. శని భగవానుడు శుక్రుడు కాంబినేషన్లో ప్రేమలో చాలా ఒడిదుడుకులు తీసుకొస్తుంది. ఇద్దరూ గొడవలు పడుతూ ఉంటారు మరల కలుస్తూ ఉంటారు ఇద్దరి మధ్యన ఎంత పెద్ద గొడవలు జరిగినప్పటికీ మరల కలిసిపోతూ ఉంటారు చివరకు వివాహం చేయిస్తుంది. ఏది ఏమైనా జాతకంలో శుక్ర భగవానుడు బలంగా ఉన్నప్పుడు ప్రేమ వివాహాలు జరుగుతాయి. పంచమాధిపతి  6 లేదా 8 లేదా 12 స్థానాలలో ఉన్నప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా రాహువు, కేతువు, శని భగవానుడు పంచమాధిపతితో సంబంధం ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్సు ఎక్కువగా ఉంటాయి. శుక్ర భగవానుడు కేతువు కలిసి ఉంటే కిడ్నాప్ నేరంపై పోలీస్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.చాలామంది ప్రేమలో మునిగిపోయి బయటికి రాలేక మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తారు ఇటువంటి వారు పై కాంబినేషన్ ఏమైనా ఉంటే వారు ప్రేమకు దూరంగా ఉండటం చాలా మంచిది.

భార్య శాపం లేదా స్త్రీ శాపం:

జ్యోతిష శాస్త్రంలో వివిధ రకాల దోషాలు గూర్చి వివరించబడినవి. ఈ దోషాలనే శాపాలు అని కూడా అంటూ ఉంటారు. పితృ శాపం, మాతృ శాపం, సోదరీ శాపం, స్త్రీ శాపం ఇటువంటివి చాలా రకాలు వివరించబడ్డాయి స్త్రీ శాపాన్ని భార్య శాపం కూడా పిలుస్తారు.

ప్రస్తుతము జాతకంలో స్త్రీ శాపాన్ని లేదా భార్య శాపాన్ని ఏ విధంగా గుర్తించాలి చూద్దాం. స్త్రీ కారక గ్రహము అయిన శుక్ర భగవానుడు బలహీనపడితే అనగా రాహువు శని భగవానునికి శుక్రుడికి సంబంధం ఏర్పడితే దీనిని స్త్రీ శాపంగా భావించాలి. ప్రస్తుత రోజుల్లో ధనార్ధన అయితే ఏదో విధంగా సంపాదిస్తున్నారు. ఎంత సంపాదించినా వివాహ జీవితం చాలా మందికి సంతోషాన్ని లేకుండా చేస్తుంది. పూర్వజన్మలో భార్యను మానసికంగా హింసించినా, లేదా భార్యను ఆదరణగా చూడకపోయినా, భార్య మనస్థాపానికి గురి అయితే దానిని మరుసటి జన్మలో స్త్రీ శాపం ఉన్నట్టుగా జాతకంలో తెలుస్తుంది. ముందు జన్మలో పురుషుడు అయినవారు ఈ జన్మలో పురుషుడిగా జన్మించాలని నియమం లేదు. ఈ జన్మలో స్త్రీగా జన్మించినప్పటికీ జాతకంలో స్త్రీ శాపం ఉంటే స్త్రీలకు కూడా వివాహ జీవితం మానసిక ఇబ్బందులకు గురిచేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి సమస్యను వివరిస్తూ మహర్షులు దానికి పరిహారం కూడా తెలియజేశారు. ప్రతి సమస్యకు కచ్చితంగా ఒక పరిహారం జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. వివాహాలు ఆలస్యం కావడం, వివాహాలు కాకపోవడం, వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు, శాశ్వతంగా దూరం కావడం ఇవన్నీ కూడా స్త్రీ శాపం మూలంగా ఏర్పడతాయి. వివాహ సమస్యలు కేవలం స్త్రీ శాపం కారణంగా మాత్రమే కాకపోవచ్చు వేరే కారణాల వలన కూడా వచ్చే అవకాశం ఉంది.జాతకం పరిశీలించుకుని వివాహ జీవితంలో సమస్యలు ఉంటే వాటికి తగిన పరిహారాలు పాటిస్తే వివాహ జీవితం సంతోషకరంగా ఉంటుంది.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత:

భార్యాభర్తలు చాలామంది అన్యోన్యంగా ఉంటారు. మరి కొంతమంది ఎప్పుడు తగవులతో గొడవలు పడుతూ ఉంటారు వీరికి మనశ్శాంతి ఉండదు. ఈ విధమైన పరిస్థితులకు జాతక రీత్యా చాలా కారణాలు ఉంటాయి. పూర్వజన్మలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు తర్వాత జన్మలో కూడా బాధిస్తాయి అని జ్యోతిష్య శాస్త్రంలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. పూర్వజన్మలో స్త్రీలను బాధించినా లేదా వారికి మనస్థాపం కలిగించే పనులు చేసినా దానిని స్త్రీ శాపంగా జ్యోతిష శాస్త్రం పేర్కొంటుంది. స్త్రీ శాపం మాతృ శాపం ఇటువంటి దోషాలు జాతకంలో ఉన్నప్పుడు ఆ జాతకులు భార్యతో గొడవలు పడుతూ ఉండొచ్చు సోదర సోదరీమణులతో సఖ్యత సరిగా ఉండకపోవచ్చు తల్లితో విరోధం పొందుతూ ఉండవచ్చు బయట ఆడవాళ్ళతో విరోధం ఉండవచ్చు బయట ఆడవాళ్ళ కారణంగా అవకాశాలు పోగొట్టుకోవడం మనశ్శాంతి లేకపోవడం ఇటువంటివి స్త్రీల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. జాతకంలో మాతృ కారకుడు అయిన చంద్రుడుతో రాహువు కాని కేతువు గానే కలిసి ఉన్నా లేదా వారి దృష్టి చంద్రుడు పై ఉన్నా లేదా నక్షత్ర సంబంధం ఉన్నా సరే   స్త్రీ శాపం ఏర్పడుతుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో  పాప గ్రహాలు లేదా సప్తమాధిపతితో పాపగ్రహాలకు సంబంధం ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడి భార్య భర్తల మధ్య మనశ్శాంతి లేకుండా ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి  దోషాలకు కొన్ని పరిహారాలు పాటించవచ్చు. భార్యను గౌరవించడం తల్లిని, సోదరీమణులను గౌరవించడం బయటి స్త్రీలతో మర్యాదగా ప్రవర్తించడం వాళ్ళ మనసు నొప్పించకుండా మెలగడం, చిన్నపిల్లలకు అనగా బాలికలకు చదువుకోవడానికి అవసరమైన వస్తువులు బహుమతిగా ఇవ్వడం అవకాశం ఉంటే వాళ్ళు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం వంటివి చేయాలి. యుక్త వయసు వచ్చిన కన్యలకు ఇంటికి పిలిచి భోజనం పెట్టడం వారి వివాహ విషయంలో ఆర్థిక సహాయం చేయడం వంటివి చేయాలి. అదేవిధంగా స్త్రీ దేవతల దేవాలయాలను తరచుగా దర్శనం చేసుకోవడం స్త్రీ దేవతల దేవాలయాలలో ఏదైనా సేవ చేయడం ఎక్కువగా చేస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తే స్త్రీ శాపము మరియు మాతృ శాపము వంటి దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది. ఈ పరిహారాలు పూర్తి ఫలితాలను ఇవ్వకపోతే జాతక చక్రం పరిశీలించుకుని ఇంతకన్నా పెద్ద దోషాలు ఉంటే వాటిని గమనించి సరైన పరిహారాలు పాటిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సమాజంలో ఇతర స్త్రీల ద్వారా సహాయ సహకారాలు పొంది జీవితం సుఖమయం అవుతుంది.

సర్వే సుజనా సుఖినోభవంతు!

Post a Comment

0 Comments