శ్రావణ మాస ప్రాముఖ్యత
చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే, శ్రావణమాసం ఐదవ మాసం. పూర్ణిమనాదడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ నెలలో రోజూ ఉదయం, సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘసుమంగళీయోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే. శ్రావణ మాసం అంటే శుభమాసం. దీనిని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం.
అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఇల్లు, ఆలయాలు భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. వివాహాలు, నోములు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పురాణాల ప్రకారం పాలసముద్ర మథనంలో ఉద్భవించిన హలాహలాన్ని పరమ శివుడు శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు. ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీ, తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వేంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితోపాటు గరుడ పంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి.
నిత్యం ఆధ్యాత్మిక ధార్మిక పరిమళాలతో భక్తకోటి పునీతమయ్యే పరమ పవిత్ర మాసం శ్రావణమాసం ఎన్నో విశిష్టతల సమాహారం. సౌభాగ్యం, సౌశీల్యం, కుటుంబ శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం వ్రతాలు ఆచరించే మాసం. “శ్రావణమాసంలో చేసే పూజాది సత్కర్మలు అనంతమైన ఫలితాన్నిస్తాయి” అని సాక్షాత్తూ ఈశ్వరునిచే శ్రావణమాస మహిమ కీర్తించబడింది. స్త్రీలకు అత్యంత పవిత్రమైనదీ మాసం. ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను ప్రత్యేకతను సంతరించు కున్న మాసం శ్రావణమాసం. పేరులోని శృతికి ఇంపైన ఈ మాసంలో మానవులు తరించడానికి కావలసిన పర్వాలన్నీ నిండి ఉన్నాయి.
స్థితికారకుడైన శ్రీమహావిష్ణువు దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు అనేక పర్యాయాలు అవతరించాడు. ఒక్కొక్క మారు ఒక్కొక్క రూపం. చేయవలసిన కార్యాన్నిబట్టి, ఆయా కాలాలకు తగిన ధర్మాన్నిబట్టి స్వామి వివిధ రూపాల్లో అవతరిస్తుంటాడు. నిరాకార, నిర్గుణ పరబ్రహ్మ ఒక రూపాన్ని అవతరించడమే అవతారం. ఈ అవతారాలలో కొన్ని లీలావతారాలు, కొన్ని అంశావతారాలు, మరికొన్ని పూర్ణావతారాలు.
ఈ అవతారాలలో తెలిసి నవి, తెలియనివి మరెన్నో ఉన్నాయి. ఎక్కువ మందికి తెలియని అవతారాలలో ఒకటి హయగ్రీవ అవతారం. విష్ణుమూర్తి హయ గ్రీవునిగా అవతరించిన ఈ రోజున ఆయనను ఆరాధించినట్టయితే విద్యాభివృద్ధి కలుగుతుంది. ఎందువలననగా విద్యను ప్రసాదించే గురువుగా హయగ్రీవుని ఆరాధిస్తూ ఉంటారు. ఈ స్వామిని శివపరంగా కొలిచిన 'దక్షిణామూర్తి' అని, దేవీపరంగా ఉపాసిస్తే 'శారదామూర్తి' అని చెబుతూ ఉంటారని చిలకమర్తి తెలిపారు. అని అభిఏ విద్యకైనా ఫలం జ్ఞానం ఆనందం. ఈ రెండింటి కలయికే హయగ్రీవమూర్తి.
శూన్యమాస మైన తర్వాత వచ్చే శ్రావణమాసం కోసం పెళ్లీడు పిల్లలు ,పెళ్ళైన కొత్త దంపతులు ఆత్రంగా ఎదురు చూస్తుంటారు .శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చేదికనుక శ్రావణం . మండే ఎండాకాలమైన గ్రీష్మ ఋతువు ,వెళ్లి చల్లబరచే వర్ష ఋతువు ప్రవేశించి ఉపశమనం కలిగిస్తుంది .పంటలు వేసేకాలం .భూమి ఆకుపచ్చ చీర కట్టుకొని ముచ్చటగా దర్శనమిచ్చి మనశ్శాంతి కల్గిస్తుంది .వర్షాలు విపరీతంగా కురిసి నదులన్నీ నిండు గర్భిణీ స్త్రీలు లాగా నిండుగా ప్రవహిస్తాయి . శ్రావణ మంగళవారాలలో స్త్రీలు మంగళ గౌరీ నోము నోస్తారు. ప్రతి శుక్రవారం పవిత్రమైందే .రెండవ శుక్రవారం అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం .ముత్తైదువలు అత్యంత భక్తీ శ్రద్ధలతో దీర్ఘ సౌమాంగల్యం కోసం అమ్మవారిని పూజిస్తారు ..కొబ్బరి కాయకు పసుపు కు౦కుమపెట్టి కలశంపై ఉంచి పైన రవికముక్కను అందంగా అలంకరించి అమ్మవారికి కళ్ళూ ముక్కు చెవులు నోరు ఏర్పరచి ,ఆభరణాలు తొడిగి, పుష్పహారాలతో శోభిల్లజేసి తమ ఇంట లక్ష్మీదేవి వెలసినట్లు పరవశిస్తారు .అమ్మవారిని ఈ రకంగా చూసి మురిసిపోయి ధన్యులవుతారు .
ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించి, మంచి కలిగించడానికి, ధర్మాచరణాలను పండుగగా ఆచరించడం నియమం. మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్ధం వైపు మళ్లించి మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలలోని ఆచారాల ముఖ్యోద్దేశం.
0 Comments