GET MORE DETAILS

ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత. ఆందోళన వద్దు: సజ్జల రామకృష్ణారెడ్డి

 ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత. ఆందోళన వద్దు: సజ్జల రామకృష్ణారెడ్డి



పీఆర్‌సీ నివేదికపై సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించిన భేటీ ముగిసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నేతృత్వంలో సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. జీతాల పెంపు అమలు తేదీలపైనా సమావేశంలో చర్చ జరిగింది. పెంచిన జీతాలను 2018 జులై నుంచి వర్తించజేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల తరఫున ఐకాస నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. పీఆర్‌సీ సహా 71 డిమాండ్లపై సమీక్ష నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నేతలు సమావేశానికి నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు.

చర్చల అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘పీఆర్‌సీపై అధికారులు కమిటీ ఇచ్చిన సిఫార్సులపై చర్చించాం. నిన్న అనధికారికంగా.. ఇవాళ అధికారికంగా చర్చలు జరిపాం. ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అంశాలపైనా చర్చ జరిగింది. రూ.1300 కోట్లు అదనంగా భరిస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. రెండేళ్లుగా 27 శాతం ఐఆర్‌ ఇస్తూ వచ్చాం. ఐఆర్‌ సంరక్షిస్తూనే 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సూచించాం. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి కార్యాచరణకు పిలుపునిచ్చాయి. ప్రస్తుత చర్చల దృష్ట్యా ఉద్యమం వాయిదా వేయాలని కోరాం. సీఎస్‌ ద్వారా హామీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.  ఉద్యోగుల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. ఉద్యోగులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. సమస్యలకు కొన్ని రోజుల్లోనే పరిష్కారం దొరుకుతుంది. సీపీఎస్‌పై నా వ్యాఖ్యలను వక్రీకరించారు. ఉద్యోగ విరమణ తర్వాత భద్రత అంశాన్ని పరిష్కరిస్తాం. రాజకీయ ప్రయోజనాలకు ఉద్యోగ నేతలు లొంగరని భావిస్తున్నాం. మొత్తం సమస్యల పరిష్కారానికి మరో 2 నెలల సమయం పడుతుందని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

పీఆర్‌సీ నివేదిక ఇవ్వకున్నా ఇబ్బంది లేదు: వెంకట్రామిరెడ్డి

‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మేరకు పీఆర్‌సీ కమిటీ హెచ్‌ఆర్‌ఏపై సిపార్సు చేసింది. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అంగీకరించబోమని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాం. కనీసం 34 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరాం. హెచ్‌ఆర్‌ఏ విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని కోరాం. తెలంగాణలోనూ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ సిఫార్సు చేశారు. అయితే కేంద్ర హెచ్‌ఆర్‌ను చాలా రాష్ట్రాలు అమలు చేయడం లేదు. పీఆర్‌సీ నివేదికలోని చాలా అంశాలపై అంగీకరించబోయేది లేదని తేల్చి చెప్పాం. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ రూ.10 లక్షలకు పెంచాలని, గ్రాట్యుటీ రూ.18 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశాం. ఈహెచ్‌ఎస్‌ పూర్తిగా ఇవ్వాలని సూచించాం. పీఆర్‌సీ నివేదిక ఇవ్వకున్నా ఇబ్బంది లేదు. పూర్తి అంశాలు తెలుసుకోవాలంటే నివేదిక కావాలి. పీఆర్‌సీ కమిషన్‌ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని కోరాం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయాన్ని సీఎం వద్ద త్వరగా తేల్చాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనను కోరాం’’ అని తెలిపారు.

నివేదికపై అంశాల వారీగా చర్చించాం: సూర్యనారాయణ

‘‘ఉద్యోగుల ఆర్థిక పరమైనటువంటి 21 ప్రధాన అంశాలపై ఇవాళ భేటీలో చర్చించారు. పీఆర్‌సీ కమిటీ ఇచ్చిన నివేదికపై అంశాల వారీగా చర్చించాం. ఈ 21 అంశాల్లో ఫిట్‌మెంట్‌ ఒకటి. ఈ చర్చలో దీనిపై ఏకాభిప్రాయం రాలేదు. కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదిక అర్థరహితంగా ఉంది. దాన్ని  ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. పీఆర్‌సీ నివేదిక మాత్రమే చర్చలకు ప్రాధాన్యం కావాలని కోరాం. సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ఎందుకు శాస్త్రీయంగా లేదో ఆధారాలతో ప్రభుత్వానికి వివరించాం. 20 అంశాలపై అన్ని సంఘాలు ఒకే తాటిపై నిలబడ్డాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారికి హెచ్‌ఆర్‌ఏ తొలగింపు సరికాదు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు రూ.40 వేలు అద్దె భత్యం ఇస్తున్నారు. పీఆర్‌సీ వివాదానికి సోమవారం కల్లా శుభం కార్డు పడుతుందని భావిస్తున్నాం’’ అని వెల్లడించారు.

చర్చలు ఇంకా పూర్తి కాలేదు: బండి శ్రీనివాస్‌

‘‘ప్రభుత్వంతో పూర్తి సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. చర్చలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఫిట్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోసారి చర్చలు జరుపుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది’’ అని తెలిపారు.

హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదన నష్టం కలిగించేలా ఉంది: బొప్పరాజు 

కేంద్ర వేతన స్కేలు అమలును పూర్తిగా వ్యతిరేకించినట్లు బొప్పరాజు తెలిపారు. పీఆర్‌సీ నివేదికను అంశాల వారీగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. అధికారుల కమిటీ దుర్మార్గంగా సిఫార్సులు చేసిందని బొప్పరాజు విమర్శలు చేశారు. కమిషన్‌ సిఫారసులను అధికారుల కమిటీ మార్చేసిందన్నారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ సరికాదని చెప్పినట్లు ఆయన తెలిపారు. హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదన నష్టం కలిగించేలా ఉందని చెప్పినట్లు బొప్పరాజు పేర్కొన్నారు.  ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందికీ హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలన్నారు. సీఎంతో చర్చించాక మళ్లీ భేటీ అవుదామని చెప్పినట్లు బొప్పరాజు పేర్కొన్నారు. స్పష్టమైన హామీ వచ్చేవరకు నల్లబ్యాడ్జీలతోనే హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments