మాఘ పురాణం : 28 వ అధ్యాయము. క్రూర (రా) కథ
గృత్నృమహమహర్షి జహ్నుమునితో నిట్లనెను.
మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము నాచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము,అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశమువారి నందరినుద్ధరించుచు పుణ్యలోకమును చేరెను, ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము, పూర్వము ద్వాపర యుగమున విదేహదేశమున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ యుండెను,ఆమె యొక రైతు భార్య మిక్కిలి కోపము కలది. ఆదంపతులకు జ్ఞానియగు పుత్రుడుకలడు,అతడు దయావంతుడు ధర్మాచరణమనిన ఇష్టము కలవాడు,వాని భార్య పతి భక్తి కలిగినది ఉత్తమురాలు,ఆమెకును ధర్మకార్యములను చేయుటయందిష్టము కలదు,బంధువులకు దీనులకు అతిథులకు అందరికి యధా శక్తి సేవ చేయునది, అత్తమామలకెప్పుడును సేవచేయుచుండెను,క్రూర కోడలిని యే దోషము లేకున్నను నిందించెడిది కిట్టెడిది,అప్పుడప్పుడామె భర్తయు తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు నోర్పుతో వినయ విధేయతలతో వారికి యధాశక్తిగ సేవలు చేయుచుండెడిది.
ఒకనాడు యిట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను జూచి క్రూరా పుత్రుడు తన తల్లిదండ్రులతో నిట్లనెను, నాయనా!అమ్మ! నామాటను వినుడు, నామాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది,మీకు కోడలిపై కోపమెందులకు? కలహమునకు కారణమేమి? మీశరీరములకును బాధను కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు? నేను గాని, నాభార్యగాని మీకేమి ఉపకారమును చేసితిమి? మీ ఈ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు,పెరిగిన కోపముచే ఆయువు ధనము,కీర్తి,సుఖము, గౌరవము,జ్ఞానము మున్నగునవి నశించును కదా!సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను.
పుత్రుని మాటలను విని క్రూర భర్తతోబాటు మిక్కిలి కోపముతొ యిట్లనెను, మూర్ఖుడా పో పొమ్ము. నీవెంత?నీ భార్యయెంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు నిన్ను నీభార్యను యేమి చేసినను తప్పులేదు,అని పలికి కొడుకును కోడలిని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగ కొట్టెను, ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను,కాని సహజమైన శాంతమును పొందెను, 'అయ్యో తల్లితండ్రులను ద్వేషించుట యెంత తప్పు అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా,తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటిలేదు,స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా!విష్ణువుతో సమాన దైవము,గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను, భార్యను తగుమాటలతో నూరడించెను,ఓర్పుగా నుండుమని సమాధాన పరచెను.
కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసి వేసెను,ఆమె కుమారుడీ ఆకృత్యమును జూచి తల్లినేమియు అనలేక పితృభక్తి వలన నేమియు చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలెనే తల్లిదండ్రులకు సేవ చేయునుండెను,కోడలు ఆగదిలో ఏడురోజులు అన్నము,నీరులేక ఆవిధముగా నిర్భంధములోనుండెను, యిరుగుపొరుగువారు, బంధువులు,మిత్రులు యీపని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు, కోడలిని అట్లె నిర్బంధించి పీడించెను,ఏడవదినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను, పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండ తలుపు తెరచి చూచెను, మరణించిన భార్యను జూచి సంతాపమునంది నిశ్చేష్టుడైయుండెను, కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను,గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై బడెను.
క్రూరయూ తలుపు తెరచి యుండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖవివశుడైన పుత్రుని జూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము యెక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె యెడ్పును విని అందరును యేమియనుచు చూడవచ్చిరి. విషయమును తెలిసికొని క్రూరను బహువిధములుగ నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను.
క్రూర పశ్చాత్తాపమునందెను, పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను, ఆమె భర్తయు శోకించెను, వారట్లు అధికముగ శోకించుటను జూచి జనులందరును విచారించిరి,కాని ఈసమయమున విచారించి లాభమేమి, పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి, యమలోకమును చేరిరి, వారు అసివత్ర నరకము(కత్తుల బోను) చిరకాలమనుభవించిరి, తరువాత చంపా తీరమున సర్పములై జన్మించిరి,రావి చెట్టు తొఱ్ఱలో నివసించుచుండిరి, కొంతకాలమునకు ధీరుడు, ఉపధీరుదు అను ఇద్దరు సజ్జనులు అచటకి వచ్చిరి. చంపానదిలో మాఘమాస స్నానము నాచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి, మాఘమాస మహిమను పురాణముగ చెప్పుకొనిరి.
సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుటవలన,వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగెను,వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి,వారికై దివ్య విమానము వచ్చెను,శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి, జహ్నుముని వర్యా! మాఘమాసవ్రత మిట్టిదని యెంతకాలము చెప్పినను పూర్తికాదు,ఇంతమందియే మాఘమాసవ్రత మహిమ వలన తరలచిరని చెప్పుటకును వీలులేదు. ఎన్నో యుగముల నుండి యెంతమందియో,ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు,శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్ష్యాదులు,వారు వీరననేల సర్వప్రాణులును మాఘమాసవ్రతము నాచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి,ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము నాచరించినచో,చేసిన పాపములు పోయి పుణ్య లోకములు కలుగుననుటకెన్ని ఉదాహరణములను చెప్పగలను?ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్నృమదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను.

0 Comments