GET MORE DETAILS

ఉద్యోగ సంఘాల హెచ్చరికలకు భయపడం: సజ్జల

ఉద్యోగ సంఘాల హెచ్చరికలకు భయపడం: సజ్జల




అమరావతి: ‘‘టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తున్నారు. ఓటీఎస్‌ను ఎందుకు ఉచితంగా ఇవ్వరని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలని అడుగుతోన్న వారు గత ప్రభుత్వం హయాంలో ఎందుకు అడగలేదు’’ అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ఓటీఎస్ పథకం పూర్తిగా స్వచ్ఛందమన్నారు. రుణ భారం మోస్తూ, తనఖా పెట్టుకోలేక, పిల్లలకు ఇవ్వలేని వారి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. రూ.15 లక్షల విలువ ఉన్న ఇంటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పేదల చేతుల్లో పెడుతోన్న పథకం ఓటీఎస్ అని అన్నారు. ఈ పథకం నిర్వహణలో ఎలాంటి దాపరికం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ కొంత మంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్‌లో కనిపించకుండా ఉండే ఛార్జీలు ఏవీ లేవన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రూ. 6వేల కోట్లు రాకుండా పోతోందని సజ్జల వెల్లడించారు.

‘‘పీఆర్‌సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీల అమలును రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సీపీఎస్ రద్దుపై కమిటీలు వేశాం.. అధ్యయనం కొనసాగుతోంది. నెలరోజుల్లో ఈ అధ్యయనం పూర్తి అవుతుంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం. ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ ప్రకటనలు చేయడం సరైంది కాదు. ఇలాంటి వ్యాఖ్యలు ఉద్యోగుల పట్ల బాధ్యత కంటే ఉద్యోగులకు నష్టం కలిగిస్తాయి. వారు సంయమనం పాటించాలి. హెచ్చరికలు చేయడం వల్ల మేం వెనక్కి తగ్గం. అదే సమయంలో ముందుకూ వెళ్లం. ఇలాంటి హెచ్చరికలతో వారికే నష్టం. వారంలోపే పీఆర్‌సీ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాను’’ అని సజ్జల పేర్కొన్నారు.

Post a Comment

0 Comments