GET MORE DETAILS

తెలుగు జాతి గర్వపడేలా పనిచేస్తా : సొంతూరిలో చీఫ్‌ జస్టిస్‌ రమణ ఉద్వేగం

 తెలుగు జాతి గర్వపడేలా పనిచేస్తా : సొంతూరిలో చీఫ్‌ జస్టిస్‌ రమణ ఉద్వేగంతెలుగువారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి

తల్లి, సొంత ఊరు. స్వర్గం కన్నా మిన్న

దానికి మాతృభాషనూ జోడిస్తా

నేను పొన్నవరం గ్రామానికి బిడ్డను

ఇప్పుడు నా తల్లిదండ్రులు లేరు

ఈ ఊరివారంతా నా తల్లిదండ్రులే

అపూర్వ స్వాగతం. ఘనసత్కారం


తెలుగువారి గౌరవానికి ఎలాంటి భంగం కలిగించకుండా.. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, కీర్తిప్రతిష్ఠలను, గొప్పతనాన్ని చాటిచెబుతూ.. తెలుగు ప్రజలు గర్వపడేలా పని చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఉద్ఘాటించారు. తెలుగువాళ్లలో చాలామంది గొప్పవాళ్లు ఉన్నారని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కష్టపడి పనిచేసే నాయకులు, ప్రముఖులు ఎంతోమంది ఉన్నారని కితాబిచ్చారు. ‘ఏ రాష్ట్రం వాళ్లైనా సరే తెలుగువాళ్ల గొప్పతనం గురించి చెబుతుంటారు. ఢిల్లీలో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొనేటప్పుడు నేను తెలుగువాడినని, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చానని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను’ అని తెలిపారు. శుక్రవారం ఆయన కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని తన స్వగామ్రం పొన్నవరం వచ్చారు. ఆ గ్రామస్థులతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలూ అపూర్వ స్వాగతం పలికారు. పౌరసన్మానం చేసి.. వెండి నాగలి బహూకరించారు. ఈ సన్మాన సభలో చీఫ్‌ జస్టిన్‌ రమణ మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆశీస్సులతోనే తాను భారత న్యాయాధిపతిగా అత్యున్నత స్థానంలో ఉన్నానని చెప్పారు. పొన్నవరం గ్రామంతో తనకున్న అనుబంధం, మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. ‘కన్నతల్లి, ఉన్న ఊరు స్వర్గం కన్నా మిన్న అంటారు. దానికి నేను మాతృభాషను కూడా జోడిస్తాను. నేను పొన్నవరం వదిలి చాలాకాలమైనా.. నా మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అన్నట్లుగా.. ఈ పల్లెకు నేను బిడ్డనే..! మీ అందరి ఆశీస్సులు తీసుకోవడానికే వచ్చాను. ఇప్పుడు నా కన్న తల్లిదండ్రులు లేకపోయినా ఈ ఊరివారందరూ నాకు తల్లిదండ్రులతో సమానం. పొన్నవరం గామ్రంలో పుట్టి పెరిగిన నేను ఇంత ఉన్నతస్థాయికి చేరుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలే కారణం’ అని తెలిపారు. చిన్ననాటి జ్ఞాపకాలను చీఫ్‌ జస్టిస్‌ రమణ నెమరువేసుకున్నారు.

 ‘మా తాత బాపయ్య  సేవాభావం నాకు అబ్బిందనుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నన్ను పెంచి పెద్దచేయడానికి సహకరించిన అక్క, పెద్దమ్మ, మేనమామలకు కృతజ్ఞతలు. నా చిన్నప్పుడు రా జు మాస్టారు చిన్న అరుగు మీద నడిపే వీధిబడిలో చదువుకున్నాను. నాతోపాటు ఐదుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు చదువుకునేవాళ్లం. నా అదృష్టమేమో గాని రాజు మాస్టా రు, మార్కండేయులు మాస్టారు నన్ను చాలా ఆప్యాయంగా చూసేవారు. తర్వాత జొన్నవరం, కంచికచర్లలోను చదువుకున్నాను. నాలో చైతన్యం, ధైర్య స్థైర్యాలకు.. నేను పుట్టిన ఊరే కారణమనుకుంటాను. ఎందుకంటే.. నాకు ఊహ తెలిసేటప్పటికే మా ఊరిలో మూడు రాజకీయ పార్టీలుండేవి. 1967లో శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు అన్ని పార్టీల నాయకులు పోటీపడినా ఎప్పుడూ ఘర్షణలు, తగాదాలు ఉండేవి కాదు. అన్ని పార్టీల నాయకులు ఎన్నికలప్పుడు మినహా.. మిగిలిన రోజుల్లో స్నేహంగా ఉండేవారు. ఇప్పుడు కూడా గ్రామస్థులందరూ అదే స్ఫూర్తితో ఐకమత్యంతో మెలగాలని కోరుకుంటున్నాను. నా చిన్ననాటి బాల్యమిత్రుడు శివలింగ ప్రసాద్‌ ఉండేవారు. దురదృష్టవశాత్తూ రెండు, మూడేళ్ల క్రితం కాలంచేశారు. 

ఈ ఊర్లోనే చింతంనేని సత్యవతమ్మ గారు ఉండేవారు. ఆమె భర్త.. ఎన్‌జీ రంగా గారి శిష్యుడిగా ఉండేవారు. 1967-68 ప్రాంతంలో కంచికచర్లలో ఎన్‌జీ రంగా మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌కు సత్యవతమ్మ, నేను ఎడ్లబండి పై వెళ్లాం. అప్పటి నుంచి నాకు రాజకీయాలపై ఆసక్తి. మా నా న్న కమ్యూనిస్టు పార్టీ అభిమాని. ఆ రోజుల్లోనే స్వతంత్ర పార్టీకి ఆకర్షితుడినయ్యాను. ఓ రోజు మా నాన్న కమ్యూనిస్టు పార్టీ నాయకులను తీసుకొచ్చి మా ఇంట్లో మీటింగ్‌ పెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నేను కొంతమందిని పోగేసుకుని స్వతంత్ర పార్టీ జెండాలను పట్టుకుని.. కమ్యూనిస్టు పార్టీ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశాం. అలాంటి వాతావరణం అప్పట్లో ఉండేది. తర్వాత నేను కొంత కాలం కంచికచర్లలో పెరిగాను. 1969 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. 1972లో ఆంధ్ర ఉద్యమాలు వచ్చాయి. తర్వాత ఎమర్జెన్సీ.. ఆ తర్వాత జనతాపార్టీ ఏర్పడడం.. ఈ రకంగా రాజకీయ పరిణామాల్లో మార్పు లు చూశాం’ అని తెలిపారు. తమది మెట్ట ప్రాంతం కావడంతో తాగడానికి నీళ్లుండేవి కాదని జస్టిస్‌ రమణ తెలిపారు. తన చిన్నప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే.. వారికి మంచినీళ్లు ఇవ్వలేకపోయేవారని తెలిపారు. ‘సాగర్‌ కాల్వలు తవ్వడం వల్ల ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. అయితే దేశమంతా అభివృద్ధి చెందుతున్నా.. మా ప్రాంతం ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోకుండా ఉందనే ఆవేదన నాలో ఉంది’ అని అన్నారు.

తెలుగుజాతికి సరైన గుర్తింపు లేదు :

అఫ్ఘానిస్థాన్‌లోని పార్లమెంటు భవనాన్ని కూడా తెలుగువా ళ్లే నిర్మించడం గొప్ప విషయమని చీఫ్‌ జస్టిస్‌ అన్నారు. తాజా గా కరోనా వైరస్‌ నిర్మూలనకు ఉపయోగపడే వ్యాక్సిన్‌ను తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అధినేతలు ఎల్లా కృష్ణ, సుచిత్ర దంపతులు మన తెలుగువారు కావడం గర్వపడాల్సిన అంశమని చెప్పారు. అయితే తెలుగుజాతికి సరైన గుర్తింపు లేదనే ఆవేదన కూడా తనలో ఉందన్నారు.

రాష్ట్రానికే అరుదైన గౌరవం: పెద్దిరెడ్డి

జస్టిస్‌ ఎన్‌వీ రమణ సుప్రీంకోర్టు సీజే కావడం రాష్ట్రానికి దక్కిన అరుదైన గౌరవమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకొచ్చేలా పని చేస్తున్నారని ప్రశంసించారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ.. అభ్యుదయ భావాలు కలిగిన జస్టిస్‌ రమణ అత్యున్నత స్థాయికి ఎదిగినా మూలాలను మరిచిపోలేదన్నారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిచెబుతూ.. తెలుగు భాషకు విశేష ఖ్యాతిని తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. 

ఆలయాలను సందర్శించిన సీజే :

సీజేఐ జస్టిస్‌ రమణ గుంటూరు జిల్లా పొన్నూరు, చందోలులోని దేవాలయాలను సందర్శించారు. శనివారం రాత్రి తొలుత ఆయన పొన్నూరులోని సహస్ర లింగేశ్వరస్వామి, వీరాంజనేయస్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. వేద పండితులు ఆలయ మర్యాదలు, వేద మంత్రోచ్చరణలు, మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో సీజే రమణ పాల్గొన్నారు. పూజారులు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు అందించారు. తర్వాత చందోలు లో బగళాముఖి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించారు. 

రైతుబిడ్డకు రైత్వారీ స్వాగతం :

స్వగ్రామమైన పొన్నవరంలో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణను గ్రామస్థులు ఎడ్ల బండిపై ఊరేగించారు. రైతుబిడ్డకు రైత్వారీ స్వాగతం పలకాలన్న ఉద్దేశంతో.. ఊళ్లోకి ప్రవేశించగానే జస్టిస్‌ రమణ దంపతులను ఎడ్లబండి ఎక్కాల్సిందిగా అభ్యర్థించారు. అక్కడి నుంచి శివాలయం వరకు అందులోనే వారు ప్రయాణించారు. ఈ ఎడ్ల బండి విజయవాడకు చెందిన ఇందిరా ఫుడ్స్‌ అధినేత మండవ వెంకటరత్నానిది. ప్రత్యేకంగా అలకరించిన బండికి వెంకటరత్నం తనకు ఎంతో ఇష్టమైన.. ఇంద్ర, మహేంద్ర పేర్లున్న ఎడ్లను కట్టారు. ఇది జస్టిస్‌ రమణ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చర్నాకోలుపై జస్టిస్‌ రమణ దంపతుల చిత్రాలను ముద్రించారు. 

కన్నతల్లి, ఉన్న ఊరు.. స్వర్గం కన్నా మిన్న అంటారు. దానికి నేను మాతృభాషను కూడా జోడిస్తాను. పొన్నవరం వదిలి చాలాకాలమైనా.. నా మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అన్నట్లుగా ఈ పల్లె (పొన్నవరం)కు నేను బిడ్డనే.

ఏ రాష్ట్రం వాళ్లైనా సరే.. తెలుగువాళ్ల గొప్పతనం గురించి చెబుతుంటారు. ఢిల్లీలో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొనేటప్పుడు నేను తెలుగువాడినని, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చానని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను.

తెలుగుజాతికి సరైన గుర్తింపు లేదనే ఆవేదన నాలో ఉంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు చైతన్యాన్ని పటిష్ఠపరచుకోవాలి.

 - చీఫ్‌ జస్టిస్‌ ఎన్ రమణ

Post a Comment

0 Comments