GET MORE DETAILS

ట్రిపుల్‌ ఐటీ... వీరే మేటి ! పేదింటి పిల్లలకే టాప్‌ ర్యాంకులు.

 ట్రిపుల్‌ ఐటీ... వీరే మేటి ! పేదింటి పిల్లలకే టాప్‌ ర్యాంకులు.



ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య ఉచితంగా పొందడం ఓ వరం లాంటిది. ఆ కలను సాకారం చేయడానికి ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ఐటీలను రాష్ట్రంలోని పలుచోట్ల ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్తమ స్థాయిలో సాంకేతిక విద్యనందిస్తుండటంతో పోటీ కూడా పెరిగింది. గతంలో వరకు పదో తరగతి మార్కుల ద్వారా విద్యార్థులు సీటు పొందేవారు. కానీ... కరోనా నేపథ్యంలో పరీక్ష విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. గత రెండేళ్లుగా ఆర్జీయూకేటీ సెట్‌ పేరిట పోటీ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోపాటు, ప్రైవేటు వారికి అవకాశం ఇచ్చారు. అయినా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలు సత్తా చాటారు. పోటీని తట్టుకుంటూ ఈ ఏడాది టాప్‌ ర్యాంకులు సాధించారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో అన్ని వసతులు, విద్య బాగుంటుందని మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులు చేరారు. మరి వారి కుటుంబ నేపథ్యం, లక్ష్యం ఏమిటో తెలుసుకుందామా..

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలని...

నా పేరు చిట్టూరి దివ్య, మాది జిల్లాలోని బంటుమిల్లి స్వగ్రామం. నాన్న కౌలు రైతు. అమ్మ కూలీ. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చదివాను. ఉపాధ్యాయుల సలహా మేరకు.. పాఠ్యపుస్తకాలు మాత్రమే తరవుగా చదివి సెట్‌ పరీక్షలో 12వ ర్యాంకు సాధించాను. పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు కావాలన్నదే నా కోరిక.

నాన్న పింఛన్లే ఆధారం...

నా పేరు మన్నెపురి చంద్రిక. విజయనగరం జిల్లా భూపాలరాజపురం స్వస్థలం. నాన్న రామకృష్ణ చనిపోయారు. అమ్మ గృహణి కావడంతో.. నాన్న ఉద్యోగ పింఛను, అమ్మమ్మ పింఛన్లే కుటుంబానికి ఆధారం. పోషణ కష్టంగా మారడంతో నేను బాబాయి దగ్గర ఉండి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివి పదికి పది జీపీఏ సాధించాను. ఆర్జీయూకేటీ సెట్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఏమీ తీసుకోలేదు. పాఠశాల ఉపాధ్యాయులే సెట్‌ రాయడానికి మార్గ నిర్దేశం చేయడంతో 3వ ర్యాంకు సాధించాను. సివిల్‌ ఇంజినీరై అమ్మని బాగా చూసుకుంటాను.

పట్టుదలతో సాధించా...

నా పేరు కేవీఎస్‌ శ్రీనివాసులు, మాది వైఎస్సార్‌ కడప జిల్లా దొమ్మర నంద్యాల గ్రామం. నాన్న ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలలో చదివాను. తొలుత ఎన్‌టీసీఈ పరీక్ష రాశాను. 200 మార్కులకు 118 రావడంతో సెలెక్ట్‌ కాలేదు. నిరుత్సాహ పడకుండా పట్టుదలతో ట్రిపుల్‌ఐటీ సెట్‌ పరీక్షలో 4వ ర్యాంకు సాధించాను. ఉపాధ్యాయులు, స్నేహితులు నూజివీడులో బోధన బాగుంటుందని, యోగా శిక్షణ ఉందని చెప్పడంతో ఇక్కడ చేరాను.

సివిల్స్‌లో ఎంపికే లక్ష్యం...

నా పేరు సింగంపల్లి శ్రీదేదీప్య, విశాఖపట్నం జిల్లా కోటపాడు మండలం ఆనందపురం స్వగ్రామం. నాన్న అప్పలస్వామి ప్రభుత్వ పాఠశాలలో ఒప్పంద టీచరుగా పనిచేస్తున్నారు. నవోదయ పాఠశాలలో నా విద్యాభ్యాసం జరిగింది. పదోతరగతిలో పది జీపీఏ సాధించి.. సెట్‌లో 6వ ర్యాంక్‌ సాధించాను. ఇంటి దగ్గరే ఉండి సిలబస్‌ను సమగ్రంగా పూర్తిచేసి ర్యాంకు సాధించాను.. బీటెక్‌ అయ్యాక సివిల్స్‌కు ఎంపిక కావడమే లక్ష్యం.

పాఠ్య పుస్తకాలే చదివాను...

నా పేరు ఆర్‌వీఎస్‌ఎం శేషసురేష్‌, మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. నేను మున్సిపల్‌ హైస్కూల్లో చదివాను. నాన్న కృష్ణారావు కిరాణా దుకాణంలో గుమస్తాగా పనిచేస్తారు. అమ్మ గృహిణి. సెట్‌ పరీక్షలో 10వ ర్యాంకు సాధించాను. ఆర్జీయూకేటీ సెట్‌కు నెల ముందు నుంచి ఉపాధ్యాయుల సూచన మేరకు పాఠ్య పుస్తకాల్లోని సిలబస్‌ను చదివాను. మంచి ఉద్యోగం పొంది.. అమ్మానాన్నలను బాగా చూసుకుంటాను.

Post a Comment

0 Comments